రికార్డు సృష్టించిన‌ కేజ్రీవాల్‌

పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) పాగా వేయ‌నుంది. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాల్లో అధికారం వైపు ఆప్ దూసుకెళ్లింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు 59 సీట్లు…

పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) పాగా వేయ‌నుంది. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాల్లో అధికారం వైపు ఆప్ దూసుకెళ్లింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు 59 సీట్లు అవ‌స‌రం. 

ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం మేర‌కు ఆప్ 62 స్థానాల్లో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌తో మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అధిగ‌మించింది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో మాత్రం ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఒక ప్రాంతీయ మ‌రోపార్టీ రెండో రాష్ట్రంలో కూడా అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఈ ఘ‌న‌త ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే ద‌క్కుతుంది. కేజ్రీవాల్ రికార్డు సృష్టించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కూ ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆప్‌… తాజాగా పంజాబ్‌లో కూడా స‌త్తా క‌న‌బ‌ర‌చ‌డం విశేషం. 

పంజాబ్‌లో అధికారాన్ని సొంతం చేసుకోవ‌డం ద్వారా దేశ ప్ర‌జానీకాన్ని త‌న‌వైపు కేజ్రీవాల్ ఆక‌ర్షించుకోగ‌లిగారు. పంజాబ్‌లో కేజ్రీవాల్ పార్టీ స‌త్తా చాట‌డంతో దేశ రాజ‌కీయాల్లో మార్పున‌కు శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలున్నాయి. 

ఇంత వ‌ర‌కూ బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ప‌శ్చిమ‌బెంగాల్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రులు మ‌మ‌తాబెన‌ర్జీ, కేసీఆర్ త‌మ‌ను తాము ప్ర‌క‌టించుకుంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీ అధినేత‌గా మ‌రో రాష్ట్రంలో ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేప‌థ్యంలో కేజ్రీవాల్ మోదీకి ప్ర‌త్యామ్నాయ నేత‌గా దేశం ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌డ‌ప‌డుతున్నారు.