కేసీఆర్ ను తిట్టు.. టీఆర్ఎస్ లో చోటు పట్టు

తనని తిట్టేవారంటే కేసీఆర్ కి బాగా ఇష్టం. ఆ విషయం ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే కేసీఆర్ మంత్రి మండలిలో చాలామంది గతంలో ఆయనని…

తనని తిట్టేవారంటే కేసీఆర్ కి బాగా ఇష్టం. ఆ విషయం ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే కేసీఆర్ మంత్రి మండలిలో చాలామంది గతంలో ఆయనని బండబూతులు తిట్టినవారే. 

ఆ లెక్కలో చూస్తే కేసీఆర్ ని బాగా తిట్టింది ఎవరని పోటీ పెడితే మోత్కుపల్లి నర్సింహులు, జగ్గారెడ్డి ముందు వరుసలో ఉంటారు. వారిద్దరిలో ఎవరు గొప్ప అంటే.. ఎవరికి వారేనని చెప్పాలి. మరి వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు. ఆల్రడీ మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు. జగ్గారెడ్డి లైన్లో ఉన్నారు.

కాంగ్రెస్ గుంపు నుంచి బయటకొచ్చినట్టేనా..?

తానిక కాంగ్రెస్ గుంపులో లేనంటూ ఇటీవల ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ మాటకొస్తే.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుంచి జగ్గారెడ్డి ఆ గుంపులో ఉండేందుకు ఇష్టపడలేదు. ఇటీవల అది బహిరంగంగా చెప్పేశారు. 

అంత మాత్రాన తాను టీఆర్ఎస్ లోకి వెళ్లడంలేదని, అసలలాంటి సంప్రదింపులేవీ జరగలేదన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందు కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కి హాజరైన జగ్గారెడ్డి, వాకౌట్ చేసి మరోసారి చర్చకు తావిచ్చారు. కాంగ్రెస్ లో ఉండలేనంటారు, బయటకు వెళ్లలేనంటారు. ఇదెక్కడి గొడవ అంటూ మిగతా నాయకులు తలలు పట్టుకున్నారు.

తాజాగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత జగ్గారెడ్డిలో అసలు మనిషి బయటపడ్డారు. ఆహా ఓహో కేసీఆర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణంలో ఆర్థిక సాయం చేస్తున్న పెద్ద మనసు కేసీఆర్ ది అంటూ పల్లవి, చరణం అన్నీ కలిపి అనురాగ గీతం ఆలపించారు.

అక్కడితో ఆగలేదు. కేసీఆర్ ని నేరుగా కలిసి అభినందించేందుకు అపాయింట్ మెంట్ అడిగారు. ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. అప్పట్లో అడ్డదిడ్డంగా తిట్టి, ఇప్పుడు అభిమానంతో పొగిడేస్తూ జగ్గారెడ్డి అందరికీ షాకిచ్చారు. 

కేసీఆర్ కూడా ఆయన్ను విశాల హృదయంతో పార్టీలోకి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారట. ఆమాటకొస్తే.. అలా తిట్టినవారిపై అంతులేని ప్రేమ కురిపించడానికి కేసీఆర్ ఎప్పుడూ రెడీనే. ఇప్పుడా అవకాశం జగ్గారెడ్డికి వచ్చిందనమాట.

మరి ఈ నోటిఫికేషన్ తో సంతృప్తి పడిన జగ్గారెడ్డి కేసీఆర్ కొలువులో చేరిపోతారా.. లేక మరో నోటిఫికేషన్ వరకు వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది.