కొత్త ఏడాది వచ్చిందంటే చాలు హీరోలంతా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా లేక వృత్తిపరంగా ఆ నిర్ణయాల్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన సినిమాలకు సంబంధించి ఐకానిక్ డ్రెస్సులు, వస్తువుల్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు బన్నీ.
అల వైకుంఠపురములో సినిమా నుంచి ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా స్టార్ట్ చేశానంటున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాలో మీటింగ్ సీన్ లో వేసుకున్న ఎరుపు రంగు కోటును, బుట్టబొమ్మ పాటలో వేసుకున్న పూల చొక్కాను భద్రంగా దాచుకున్నట్టు చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ప్రతి సినిమాకు సంబంధించి కొన్ని దుస్తులు లేదా వస్తువుల్ని ఇలా దాచిపెట్టడం వల్ల కొన్నేళ్ల తర్వాత వాటికి మరింత విలువ పెరుగుతుందంటున్నాడు బన్నీ. పైగా అవి మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెబుతున్నాడు.
నిజానికి అల వైకుంఠపురములో కంటే ముందు నుంచే బన్నీకి ఈ అలవాటు ఉంది. ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలకు చెందిన కొన్ని వస్తువుల్ని బన్నీ దాచుకున్నాడు. వాటిలో కొన్ని గతంలో సమంత నిర్వహిస్తున్న ఛారిటీకి కూడా ఇచ్చేశాడు.
ఇకపై మాత్రం ఈ ''సేకరణ''ను సీరియస్ గా అమలు చేస్తానని, ప్రతి సినిమాకు సంబంధించి ఓ జ్ఞాపకాన్ని పదిలంగా దాస్తానని చెబుతున్నాడు ఈ హీరో.