సత్తిబాబు కరెక్టుగా చెప్పాడు !

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు మాట్లాడితే వారు ఏం చెబుతున్నారో ఓ పట్టాన అంతుపట్టదు. అర్ధం కాకుండా మాట్లాడే ఏపీ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ అలియాస్…

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు మాట్లాడితే వారు ఏం చెబుతున్నారో ఓ పట్టాన అంతుపట్టదు. అర్ధం కాకుండా మాట్లాడే ఏపీ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తి బాబు ముందు వరుసలో ఉంటారు. సాధారణంగా ఇప్పటి మంత్రులకు సబ్జెక్ట్ పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రుల భజన చేయడం, ప్రతిపక్షాలను తిట్టడం, శాపనార్ధాలు పెట్టడమే వీరికి తెలిసిన విద్య.

సబ్జెక్ట్ గురించి సరిగ్గా చెప్పలేరు కాబట్టే అర్ధంపర్ధం లేకుండా మాట్లాడి జనాలను అయోమయంలో పడేస్తుంటారు. ఇలాగే ఈ మధ్య అయోమయంలో పడేశాడు సత్తిబాబు. అయోమయంలో పడేసినా ఆయన చెప్పిన దాంట్లో కొంతమేరకు వాస్తవం ఉంది. ఇంతకూ ఆయన రెండు రోజుల కిందట ఏమన్నాడు? 2024 వరకు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అన్నాడు. ఇది విభజన చట్టంలోనే ఉందన్నాడు. ఇది కరెక్టే.

విభజన సమయంలో ఏపీలో రాజధాని కట్టుకోవడానికి కేంద్రం పదేళ్లు సమయం ఇచ్చింది. అప్పటివరకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పింది. కానీ ఓటుకు నోటు కేసు కారణంగా అప్పటి సీఎం చంద్రబాబు ముందే ఏపీకి వెళ్ళిపోయాడు. 

అమరావతిని స్టార్ట్ చేశాడు. అది ఒక ఆకారానికి వచ్చేసరికి ఆయన పదవి పోయింది. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నాడు. ఆ నినాదంతోనే మూడేళ్లు గడిచిపోయాయి. తాజాగా ఏపీ హైకోర్టు అమరావతే రాజధాని అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో ఏం చేయాలో జగన్ సర్కారుకు అర్ధం కావడంలేదు. ఇంతకీ, ఏపీ ప్రభుత్వం మనసులో ఏముంది?

రాజధాని అమరావతి విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును, ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేదు, మూడు రాజధానుల విధానానికే కట్టు బడి ఉంటుందా?

ఇప్పుడు ఈ ప్రశ్న మరోమారు ప్రముఖంగా చర్చకు వచ్చింది.  న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి ‘మూడు’ మారలేదు. అయన మౌనంగానే ఉన్నారు. కానీ’ మంత్రులు, అధికార పార్టీ సీనియర్ నాయకులు, మూడు రాజధానులే మా విధానం అని ప్రకటిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే, మూడు రాజధానుల తాజా బిల్లు ప్రవేశ పెడతామని ప్రకటించారు.

అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ, మూడుకు మరో ముడి వేశాడు. “2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు ఆలా మాట్లాడి ఉంటాయి.

ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే” అని బొత్స వ్యాఖ్యానించారు. 

అమరావతి శాసన రాజధానిగా చెబుతున్నప్పుడు అసలు రాజధాని హైదరాబాదే అవుతుంది కదా. కానీ ఏపీ పరిపాలన హైదరాబాదు నుంచి సాగడంలేదు కదా. పరిపాలన హైదరాబాదు నుంచి సాగకపోయినా ఏపీ ప్రజలకు హైదరాబాదే రాజధాని అని చెప్పుకోవాలి. ఏపీ ప్రజలు కావొచ్చు, మంత్రులు కావొచ్చు ప్రతి విషయంలోనూ హైదరాబాదు మీదనే ఆధారపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ సొంత ఊరు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సొంత ఊరు కూడా హైదరాబాదే, ఇద్దరికీ ఇక్కడ సొంత ఇల్లు, ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. వీళ్ళే కాదు, ఏపీ మంత్రులకు కూడా హైదరాబాదులో ఆస్తులు, ఇళ్ళు, వ్యాపారాలు ఉన్నాయి. ప్రజలు, నాయకులు, మంత్రులు వైద్యం కోసం, వారి పిల్లల చదువుల కోసం హైదరాబాదుకు వస్తున్నారు. ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వెతుక్కుంటున్నారు.

పెళ్లిళ్లు లాంటి శుభ కార్యాలు హైదరాబాదులోని భారీ ఫంక్షన్ హాల్స్ లో చేస్తున్నారు. ఇక్కడి రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడులు పెడుతున్నారు. ఏపీ గవర్నర్ కు, కొందరు మంత్రులకు కరోనా వస్తే వైద్యం కోసం హైదరాబాదుకే వచ్చారు. ఇన్ని అవసరాలు హైదరాబాదుతో ముడిపడి ఉన్నప్పుడు ఏపీకి హైదరాబాదు రాజధాని కాకుండా ఎలా ఉంటుంది?