ఎమ్బీయస్: రామానుజుడి విగ్రహం

దీనికి ముందు ‘రామానుజుడి ప్రభావం’ వ్యాసం చదవాలి. రామానుజుడి జీవితం, సిద్ధాంతం గురించి యిటీవల ‘‘సాక్షి’’ ఆదివారం అనుబంధం ‘ఫన్‌డే’లో న్యాయశాస్త్రంలో ప్రొఫెసర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా చేసిన మాడభూషి శ్రీధర్ గారు అద్భుతమైన సీరియల్…

దీనికి ముందు ‘రామానుజుడి ప్రభావం’ వ్యాసం చదవాలి. రామానుజుడి జీవితం, సిద్ధాంతం గురించి యిటీవల ‘‘సాక్షి’’ ఆదివారం అనుబంధం ‘ఫన్‌డే’లో న్యాయశాస్త్రంలో ప్రొఫెసర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా చేసిన మాడభూషి శ్రీధర్ గారు అద్భుతమైన సీరియల్ రాశారు. కావాలంటే అది చదువుకోవచ్చు. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం చెపుతున్నాను. రామానుజుడి కంటె ముందే వైష్ణవం ఉండేదని చెప్పాను కదా. విష్ణుమూర్తిని సగుణబ్రహ్మంగా ఉపాసించి, వైష్ణవానికి పునాదులు వేసినవారు క్రీ.శ. 7-9 శతాబ్దాల మధ్య వర్ధిల్లిన 12 మంది ఆళ్వారులు. గోదాదేవి (ఆండాళ్), ఆమె తండ్రి విష్ణుచిత్తుడు, విప్రనారాయణుడు.. వీళ్లందరూ ఆళ్వార్లే.

రామానుజుడు శ్రీవైష్ణవం తీసుకుని వచ్చిన తర్వాతనే దళితులతో సహా అన్ని కులాల వారినీ వైష్ణవంలో చేర్చుకున్నాడని అనుకోకూడదు. ఈ 12 మంది ఆళ్వారుల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, దళితులు కూడా ఉన్నారు. ఆ మాటకొస్తే బౌద్ధ, జైనాలకు వ్యతిరేకంగా  క్రీ.శ. 3-8 శతాబ్దాలలో శైవాన్ని ప్రచారం చేసిన 63 నాయనమార్లలో కేవలం 17 మంది మాత్రమే బ్రాహ్మణులు. తక్కివారిలో దళితులతో సహా అన్ని వర్ణాలవారూ ఉన్నారు. ఆళ్వారుల తర్వాతి శతాబ్దాలలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినవారిని ఆచార్యులంటారు. వారిలో ఒక ప్రసిద్ధుడు నాదముని. ఆయన మనుమడు యామునాచార్యుడు. శ్రీరంగంలోని దేవాలయానికి అధిపతిగా వుండేవాడు. ఆయన మనుమరాలి కుమారుడు రామానుజుడు.

దరిమిలా రాజీవ్‌గాంధి హత్య జరిగిన శ్రీ పెరంబుదూరులో 1017 లో పుట్టాడు. కంచిలో యాదవ ప్రకాశుడనే గురువు వద్ద కొంతకాలం అద్వైతాన్ని అభ్యసించాక ఆయనకి అది నచ్చలేదు. గురువుతో వాదనకు దిగాడు. గురువు రామానుజుడిని వాదనలో ఓడించలేక అతన్ని చంపించడానికి ప్రయత్నించాడు. అది తెలిసి, రామానుజుడు తప్పించుకున్నాడు. తర్వాతి కాలంలో గురువు తప్పు గ్రహించి, రామానుజుడికి శిష్యుడిగా మారాడు. యాదవప్రకాశుడి నుంచి వచ్చేసిన తర్వాత రామానుజుడు పెళ్లి చేసుకుని, తన ఊరిలోనే ఉన్నాడు. ముత్తాత యామునాచార్యుడు (అలవందర్ అని కూడా అంటారు) ఆదేశానుసారం శ్రీరంగం చేరాడు.

అప్పటికే దివంగతుడైన అలవందర్ అసంపూర్ణంగా వదిలిన కార్యాలను, ఆయన శిష్యుడు పెరియనంబితో కలిసి  చేపట్టి చేస్తూండగా యిద్దరి భార్యలకు మధ్య గొడవల కారణంగా పని ఆగిపోయింది. రామానుజుడి భార్యకు వేదాంతం పట్ల ఆసక్తి లేదు. పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదను అనుకుని రామానుజుడు సన్యాసం స్వీకరించి, జీవితాన్ని వేదాంత కృషికి అంకితం చేశారు. శ్రీరంగంలోని పీఠానికి 40 ఏళ్ల పాటు ఆధిపత్యం వహించారు. అనేక గ్రంథాలు, భాష్యాలు రాశారు. విశిష్టాద్వైత మార్గాన్ని ప్రతిపాదించి దానికి శ్రీవైష్ణవం అని పేరు పెట్టి, రామేశ్వరం నుంచి బదరీనాథ్‌కి వెళ్లి, అక్కణ్నుంచి బెంగాల్ వెళ్లి, దేశమంతా పర్యటించి, దాన్ని వ్యాప్తి చేశారు. తన తర్వాత కూడా ప్రచారం సాగేట్లు, 74 మంది శిష్యప్రశిష్యులను నియమించాడు. రామానుజుడు అనేక క్షేత్రాలు సందర్శించి వాటిని వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు. అక్కడి పూజావిధానాలను నిర్దేశించారు.

రామానుజుడున్న ప్రాంతాన్ని 1070 నుంచి 1122 వరకు పాలించిన కులోత్తుంగ చోళుడు శైవమతాలవంబి. శైవాన్ని వృద్ధి చేయాలంటే రామానుజుణ్ని మారిస్తే సరిపోతుందని ఎవరో సలహా యిస్తే శైవం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. దానితో రామానుజుడు మైసూరు వద్ద ఉన్న మేల్కోటేకు తరలి వెళ్లి పోయి, అక్కడ హోయసాల యాదవ రాజు ఆశ్రయం పొందాడు. 120 ఏళ్ల పూర్ణాయుర్దాయాన్ని అనుభవించి అక్కడే పరమపదించారు.

రామానుజుడి జీవితంలో అతి గొప్పగా చెప్పుకోదగ్గది, అందరూ ఆదర్శంగా తీసుకోదగినది అయిన ఒక సంఘటన ఉంది. శ్రీరంగంలో ఉండగా ఆయన గోష్ఠిపూర్ణుడనే ఆచార్యుడికి శిష్యుడిగా ఉన్నాడు. మోక్షం ప్రసాదించే తారకమంత్రాన్ని ఉపదేశించమని కోరగాకోరగా కొన్నాళ్లకు ‘సరే ఉపదేశిస్తాను కానీ యితరులెవ్వరికీ చెప్పకూడదు. చెప్తే నరకానికి పోతావు.’ అన్నాడాయన. రామానుజుడు సరేనని, మర్నాడే రంగనాథాలయానికి ఊరి జనాన్నందర్నీ రప్పించి, వేదిక నెక్కి ఆ మంత్రాన్ని చెప్పేశాడు. అదేమిటని గురువు మండిపడితే ‘ఇంతమందికి వైకుంఠానికి వెళ్లే అవకాశం వుండగా, నేనొక్కడిని నరకానికి పోతే ఏం?’ అన్నాడు. స్వర్గనరకాలున్నాయని గాఢంగా నమ్మిన వ్యక్తి అలా అనడం ఎంత విశేషమో కదా!

అలాగే ఛాందసత్వం రాజ్యమేలే ఆ రోజుల్లో మేల్కొటేలో హరిజనుల చేత ఆలయ ప్రవేశం చేయించడం, ‘మునివాహనసేవ’ పేరుతో దళితుణ్ని భుజాలపై కూర్చోబెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించడం, అనేక గుళ్లల్లో మాలదాసరులను నియమించడం, దళితులతో సహా అన్ని కులాల వారికీ పూజావిధానం నేర్పించడం.. ఒక సంఘసంస్కర్త చేసే యిలాటి పనులు వెయ్యేళ్ల క్రితమే చేసిన ఘనుడాయన! పండితులకు, సమాజంలోకి కొన్ని వర్గాల వారికీ మాత్రమే పరిమితంగా వున్న దైవచింతనను సామాన్య ప్రజానీకం దరికి తెచ్చి, వారిలో భక్తిని నెలకొల్పిన ఘనత నిశ్చయంగా రామానుజుడిదే! ఇప్పుడు రామానుజుడి సిద్ధాంతం గురించి కాస్త చెపుతాను.

అద్వైతానికి, విశిష్ట అద్వైతానికి తేడా ఏమిటంటే, అద్వైతంలో బ్రహ్మపదార్థం, అంటే పరమాత్మ, దేవుడు అనుకోండి, గుణరూపరహితం! విశిష్టాద్వైతంలో దానికి రూపం కల్పించబడింది. పరమాత్మలోనే జీవుడు, పదార్థం కూడా వుంటాయి. అవి తమ అస్తిత్వానికి పరమాత్మమీద ఆధారపడి వుంటాయి కానీ పరమాత్మ వాటిమీద ఆధారపడడు. జీవి బతికున్నంతకాలం పదార్థంతోటీ, ముక్తి చెందాక దేవుడితోటీ ముడిపడివుంటాడు. ఈ రెండు దశల్లోనూ జీవుడు అస్తిత్వం కోల్పోడు. భక్తితోనే జీవి దేవుణ్ని చేరగలడు. జ్ఞాన, కర్మ మార్గాలు భక్తికి త్రోవను సుగమం చేస్తాయి. భక్తికి దారితీయని జ్ఞాన, కర్మయోగాలు వృథా. పరమాత్మ అంటే విష్ణువే. వైకుంఠంలో ఉంటాడు. శ్రీదేవి, భూదేవి, లీల ఆయన భార్యలు. శంఖచక్రాదులు ధరించి లోకాలను పరిపాలిస్తూ వుంటాడు. తనను భక్తితో కొలిచే జీవులకు మోక్షం ప్రసాదిస్తాడు. భక్తి 9 రకాలు. జ్ఞాన, కర్మయోగాలతో పని లేకుండా మోక్షం పొందే మార్గం ప్రపత్తి. అంటే భగవత్ శరణాగతి. నీవు తప్ప ఇతఃపరం బెరుంగ అన్నట్లు సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించి, ఆయన శరణు పొందాలి. ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకాలు నండూరి రామమోహనరావు గారి ‘‘విశ్వదర్శనం’’, గోపీచంద్ ‘‘తత్త్వవేత్తలు’’. వారికి కృతజ్ఞతలు.

ఏతావాతా విశిష్ట అద్వైతం అంటూనే రామానుజులవారు జీవిని, దేవుణ్ని విడివిడిగా చూపించారు. జీవుల పుట్టుక, మరణం అంతా దేవుడి లీల అన్నారు. పూజాపునస్కారాలకు చాలా ప్రాముఖ్యత యిచ్చారు. ఎంత యిచ్చారంటే శివాలయాల్లో కంటె విష్ణ్వాలయాల్లో ఆచారవ్యవహారాలు చాలా పక్కాగా వుంటాయి. తిరుపతి గుళ్లో ఒక్కో మార్పు తేవడానికి పూజారులతో ఎంతలా కొట్లాడవలసి వచ్చిందో పివిఆర్‌కె ప్రసాద్ గారు తన పుస్తకంలో విపులంగా రాశారు. కొన్ని శివాలయాల్లో భక్తులను గర్భగుడిలోకి కూడా అనుమతిస్తారు. విష్ణు ఆలయాల్లో ఆ ప్రసక్తే లేదు. రామానుజుడు గొప్ప మతాచార్యులు, గొప్ప సంస్కర్త అనడం వరకు ఎవరికీ పేచీ లేదు. ఆయన సమతామూర్తి, సమాజంలో సమతాస్ఫూర్తిని నింపారు అంటే ఆమోదించడానికి నాబోటి వాడికి యిబ్బందిగా వుంది. సమతామూర్తి అంటే అందర్నీ సమానంగా చూసేవాడు, ఆయనవి ఇన్‌క్లూజివ్ రెలిజియస్ ప్రాక్టీసెస్ అనే అర్థంలో తీసుకుంటే అది నప్పదు.

రామానుజుడి దృష్టిలో మనుషులంతా సమానమే  అన్నారు చిన జియర్. మనుషుల మాట ఏమో కానీ, దేవుళ్లంతా సమానం కాదు రామానుజుడి దృష్టిలో. శివుడు, ఆయన కుటుంబీకులు ఎవరూ దేవుళ్లు కారు. మధ్వాచార్యుల పద్ధతిని అనుసరించేవాళ్లను మాధ్వులు అంటారు. రామానుజుడితో సహా వైష్ణవం అనుసరించేవాళ్లు వైష్ణవులు. వీరశైవులు, లింగధారులు శివుణ్ని, అతని కుటుంబసభ్యులను మాత్రమే పూజిస్తారు. విష్ణు ఆలయంలోకి వెళ్లరు. అలాగే మాధ్వులు, వైష్ణవులు శివాలయాల్లోకి వెళ్లరు. అద్వైతం పాటించేవాళ్లు శివుడు, విష్ణువు, దేవి.. యిలా కనబడిన దేవుళ్లందరినీ సమదృష్టితో చూస్తారు. వీళ్లని స్మార్తులు అంటారు. మనలో చాలామంది స్మార్తులమే. నా చిన్నతనంలో మాధ్వ, వైష్ణవ క్లాసుమేట్స్ శివాలయాలకు రమ్మనమంటే వచ్చేవారు కారు. ‘బయట వెయిట్ చేస్తాం, వెళ్లామని తెలిస్తే మా యింట్లో తిడతారు’ అనేవారు. వాళ్లు శివసంబంధమైన పేర్లు పెట్టుకోరు. తమిళ బ్రాహ్మణుల్లో అయ్యర్లు స్మార్తులు, వాళ్లలో శివ, విష్ణు సంబంధమైన పేర్లు రెండూ కనబడతాయి. అయ్యంగార్లు వైష్ణవులు. వారిలో శివసంబంధమైన పేర్లు కలికానికి కూడా కానరావు.

సాధారణ వైష్ణవ ఆలయాల్లో స్మార్తులు పూజార్లగా కూడా కనబడతారు. కానీ శివాలయాల్లో వైష్ణవ పూజారులు ఎక్కడా వుండరు. ప్రసిద్ధ వైష్ణవాలయాలలో మాత్రం వైష్ణవ పూజారులే ఉంటారు. తిరుపతిలో ఒక్క పూజారి కూడా విబూదితో అడ్డంగా బొట్లు పెట్టుకోడు. అందరూ నిలువుబొట్ల వాళ్లే. రామానుజుడి విగ్రహావిష్కరణ గొడవ తర్వాత కెసియార్ చిన జియర్ లేకుండా యాదాద్రి ఫంక్షన్ చేయిద్దామని చూస్తూంటే ‘ఎవర్ని పడితే వాళ్లను పిలవడానికి వీల్లేదు, శ్రీవైష్ణవ పూజారులనే పిలవాలి, అందుకని జియర్‌ను పిలవక తప్పదు’ అని కొందరు వాదించారట. అప్పుడు కెసియార్ ‘అంతగా వైష్ణవులే కావాలంటే అహోబిలం వాళ్లను పిలవవచ్చుగా’ అన్నారట. చూదాం, ఫైనల్‌గా ఎవర్ని పిలుస్తారో! ఎవర్ని పిలిచినా మానినా స్మార్తుణ్ని మాత్రం పిలవరు, అంతవరకు నిశ్చయం.

స్మార్తులు పరాయివాళ్లు ఓకే, కానీ వైష్ణవుల్లో కూడా సమదృష్టి లేదే! వారిలో తెంగల్ (దక్షిణమార్గం), వడగల్ (ఉత్తరమార్గం) అని ఉన్నాయి. భగవంతుడికి మనం సమస్తం అర్పించుకుంటే, పిల్లి తన పిల్లల్ని మెడ దగ్గర కరిచి పట్టుకుని జాగ్రత్తగా మరో చోటకి తీసుకెళ్లిన ఫక్కీలో ఆయనే భక్తుల్ని కాపాడుకుంటాడు అని తెంగల్ వాళ్లు అంటారు. అంటే అక్కడ తల్లిదే బాధ్యత, శిశువుకి ఏ బాధ్యతా లేదు. కానీ వడగల్ వాళ్లు మర్కటకిశోర న్యాయాన్ని ఉటంకిస్తారు. కోతి ఒక చెట్టు నుంచి మరొక చెట్టు మీదకు ఉరికేటప్పుడు తల్లి కడుపును గట్టిగా పట్టుకోవలసిన బాధ్యత కోతిపిల్లదే! అలాగే భగవత్కృప పొందడానికి భక్తులకు భక్తితో పాటు మానవప్రయత్నం కూడా అవసరం. తెంగల్ వాళ్లు నుదుటిపై వైష్ణవనామాన్ని ఇంగ్లీషు ‘వై’లా పెట్టుకుంటారు. వడగల్ వాళ్లు ‘యు’లా పెట్టుకుంటారు. కాంచీపురం దేవరాజస్వామి ఆలయంలో ఏనుగుకి బొట్టు వై-లా పెట్టాలా? యు-లా పెట్టాలా? అని 1796లో కోర్టుకెళితే ఆ కేసు కొన్ని శతాబ్దాలు నడిచి 1976లో తీర్పు వచ్చింది. అంతెందుకు, 2015లో తిరుపతిలో యిదే విషయం మీద గొడవ జరిగి, పేపర్లలో వచ్చింది.

తిరుపతి గుళ్లో జరిగే పూజా విధానం గురించి వైష్ణవుల్లోనే భేదాభిప్రాయాలున్న సంగతి మనకు తెలుసు. సాక్షాత్తూ చిన జియర్ గారే పెద్ద రగడ చేసి, తిరుపతికి వెళ్లనని శపథం చేశారు. ఇలాటి గొడవల మీద భక్తుల్లోనే చీలిక వస్తే అందర్నీ సమదృష్టితో చూస్తున్నాం అని ఎలా అనగలరు? రామానుజుడికి వ్యక్తిగతంగా సమతాదృష్టి ఉందని అనుకున్నా, ఆయన సమాజంలో సమతాస్ఫూర్తి తెచ్చారని అనుకోవడం అతిశయోక్తే అవుతుంది. రామానుజుడు మేల్కోటేలో హరిజనులను ఆలయప్రవేశం చేయించారు కానీ ఆయన పీఠాధిపతిగా 40 ఏళ్లు ఉన్న శ్రీరంగంలో చేయించారని నేను చదవలేదు. మేల్కోటేకు అతి దగ్గర్లో ఉన్న శ్రావణ బెళగొళ జైనక్షేత్రంగా విలసిల్లుతూ దళితులను జైనంలోకి ఆకర్షిస్తోంది కాబట్టి, దానికి విరుగుడుగా యిది చేశారా అన్నది నాకు తెలియదు.

అలాగే బీబీ నాంచారమ్మను వెంకటేశ్వరుడికి భార్యగా ప్రకటించినది రామానుజుడే అని చిన జియర్ చెప్పారు. ఆ విధంగా మైనారిటీలను కూడా అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇప్పుడైతే లవ్ జిహాద్ అనేవారేమో. దానికి కూడా సామాజిక కారణాలు, రాజకీయ కారణాలు ఉండవచ్చు కానీ ఏ పౌరాణిక ఆధారమూ లేకుండా దేవుడికి యిలా అన్యమతాల స్త్రీలతో సంబంధం కలిపేయడం నా మట్టుకు నాకు వెగటుగా తోస్తుంది. రామానుజుడు మునివాహన సేవ పేరుతో దళితుణ్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్లే సంప్రదాయం ఎప్పుడు ఆగిపోయింది? ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు వెలుగులోకి తెచ్చేవరకు దాని సంగతే మర్చిపోయారు. ఆ మధ్య తిరుపతిలో దళితగోవిందం పేర ఉత్సవమూర్తిని దళితవాడల్లో తిప్పితే పురోహితవర్గం నుంచి అభ్యంతరాలు వచ్చి, ఆ విగ్రహాలను ఓ మూల పెట్టేశారని, మళ్లీ వాడలేదని వార్తలు వచ్చాయి.

శూద్రులు, దళితులు పూజార్లుగా వున్న వైష్ణవాలయాలు అనేకం ఉన్న మాట వాస్తవమే కానీ వాటికి వైష్ణవ బ్రాహ్మణులు వెళతారో లేదో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా వుంది. బ్రాహ్మణులు అర్చకులుగా ఉన్న గుళ్లలో ఆ శూద్రపూజారుల చేత పూజలు చేయిస్తారో లేదో కూడా నాకు అనుమానమే! రామానుజుడు పీఠాధిపతిగా ఉన్న శ్రీరంగం గుళ్లో హరిజన పురోహితులు ఉన్నారా? వీటికి కచ్చితమైన సమాధానాలు దొరికినప్పుడు రామానుజుడు ప్రతిపాదించిన ‘సమతాస్ఫూర్తి’ సమాజంలో నిలదొక్కుకుందో లేదో స్పష్టమౌతుంది.

రామానుజుడు కొన్ని గుళ్లలో దేవతామూర్తులను విష్ణువుగా మార్చివేశారంటారు. తిరుపతిని వైష్ణవక్షేత్రం చేసినది ఆయనే. జియర్ గారిది కూడా అదే మార్గం. జూబిలీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో వినాయకుడి విగ్రహానికి నిలువుబొట్లు పెట్టేసి, విష్వక్సేనుడిగా ముద్ర కొట్టేశారు. తొలిపూజ అందుకునే దేవుడు తక్కిన హిందువులందరికీ వినాయకుడు కాగా, వైష్ణవులకు విష్వక్సేనుడు. దేశంలో ఎక్కడా ఆయనకు ఏనుగు ముఖం, తొండం ఉండవు. జియర్ గారి పుణ్యమాని అపోలో ఆసుపత్రిలో మాత్రం ఉంటాయి. 11, 12 శతాబ్దాల్లో జైన విగ్రహాలను శైవ విగ్రహాలుగా మార్చారని వింటాం. 20వ శతాబ్దంలో అలా మార్చిన ఘనత జియర్ గారిదే. శివపుత్రుణ్నే సహించలేకపోతే యింకెక్కడి సమతా స్ఫూర్తి?

రామానుజుడి కారణంగా సమాజంలో సమతాస్ఫూర్తి వచ్చిందనే వాదన ఒప్పుకుంటే సమాజంలో వివక్షత యింకా ఎందుకుందని అడగాలి. అగ్రవర్ణాలు, వెనకబడిన కులాలు, హరిజనులు.. యిలా వ్యత్యాసాలు లేవా? వాళ్ల మధ్య కలహాలు లేవా? అణగారిన వర్గాలపై అత్యాచారాలు లేవా? చిన్నచూపు లేదా? ఆకాశమంత విగ్రహాలు పెడితే ఆ భేదాలు సమసిపోతాయా? సమైక్యతా మూర్తి, స్ఫూర్తి అంటూ బిజెపి వారు పటేల్‌కు పేద్ద విగ్రహం కట్టారు. మళ్లీ ఆ పార్టీ నాయకులే దేశ సమైక్యతకు విచ్ఛిన్నం కలిగించేట్లా 80-20 అంటూ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినవారిని అగ్రనాయకులెవరూ ఖండించటం లేదు. విగ్రహం పెట్టినంత మాత్రాన స్ఫూర్తి పుట్టుకుని వచ్చేస్తుందా?

తన తర్వాత జరిగిన సంఘటనలకు రామానుజుణ్ని బాధ్యుణ్ని చేయలేము. ఆయన తన శక్తి మేరకు వ్యత్యాసాలు తగ్గించడానికి చూశాడు. నిశ్చయంగా గొప్పవాడే. అయితే మాత్రం మరీ అంత పెద్ద విగ్రహం కట్టాలా అనే సందేహం కలగవచ్చు. మన మెంటాలిటీయే దీనికి కారణం. మనకు భక్తి కన్న ఆర్భాటం ముఖ్యం. భక్తి అనేది మనసులోనే వుంచుకుని మౌనంగా ధ్యానం చేసుకుంటే ఎవరికీ తెలియదు. తృప్తి కలగదు. అందువలన మనకు హంగామా కావాలి. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు అంటూనే కొన్ని పుణ్యక్షేత్రాలకు పండగ రోజుల్లో ఎగబడాలి. పూజలు అలా చేయాలి, యిలా చేయాలి అంటూ నిబంధనలు పెట్టుకోవాలి. దేవుడున్నాడని వాదించేవాళ్ల వాదన ఒక రకంగా సాగుతుంది. ‘ఈ చరాచర సృష్టి నియమబద్ధంగా నడుస్తోందంటే దాన్ని నడిపించే శక్తి ఒకటి వున్నట్లేగా? మేం దాన్ని దేవుడు అంటున్నాం. పదార్థం (మేటర్) నాశనం అవుతుంది కానీ శక్తి (ఎనర్జీ) నాశనం కాదు, మహా అయితే రూపు మార్చుకుంటుంది. ఆ శక్తినే పరమాత్మ అంటున్నాం.’ అని.

ఇంతవరకు అందరూ ఒప్పుకోవలసినదే. అయితే దీని తర్వాతి స్టెప్‌లోనే సందేహం వస్తుంది. ఆ శక్తిని పూజించవలసిన అవసరం ఉందా? అదీ ఫలానా పద్ధతిలోనే పూజించమని ఆ శక్తి వచ్చి మనకు చెప్పిందా? మీరు పొద్దున్నే లేచి అర్ఘ్యం యివ్వకపోతే మందేహులనే రాక్షసులతో పోరాడే శక్తి నాకు లేదు బాబోయ్ అని సూర్యభగవానుడు వచ్చి మనతో మొత్తుకున్నాడా? నాకిలాగే పూజ చేయి అని దేవుడు పూజారికి చెప్పాడా? కొబ్బరికాయ లంచం యిస్తే చాలు భగవంతుడు ఐసై పోతాడు అని పూజారి చెప్తే మనం నమ్మేయడమేనా? లోకంలో ఉన్న కొబ్బరి తోటలన్నీ దేవుడు సృష్టించినవే. ఆయన సొత్తులోంచే మనం ఒకటి పట్టుకుని వచ్చి ఆయన్ని లోభపెట్టడం కుదురుతుందా? కానీ పూజారి యివన్నీ ఆలోచించనివ్వడు. త్వరగా తేల్చు, లేకపోతే నీ వెనక్కాలవాడికి ఛాన్సిచ్చేస్తా అంటాడు.

ఈ కర్మకాండలో పడి మనం దేవుడితో కమ్యూనికేట్ చేయడం మానేశాం. నిజానికి దేవుడితో సంభాషించవలసినది మనసుతో. దానికి ధ్యానం ఒక్కటే మార్గం. అది మనకు రాదు. అందుకని పైపై మెరుగులకే, అర్చనలకే ప్రాధాన్యత యిస్తున్నాం. నేతిదీపం పెట్టాలి, వత్తి ఈశాన్యం వైపు పెట్టాలి, పక్కనున్నావిడ స్టీలు ప్రమిద తెస్తే మనం వెండి ప్రమిద తేవాలి, యిదే గోల. మధ్యలో ధర్మసందేహాలు. ‘ఓపెన్ స్టేడియంలో కార్తీకదీపం వెలిగించమంటున్నారు కదా, గాలి వస్తే నా కొంగు అడ్డు పెట్టవచ్చా? లేకపోతే మా ఆయన ఉత్తరీయం అడ్డుగా పెట్టాలా?’ అని స్వాములారిని అడగడం, ఆయనేదో చెప్పడం. పాపప్రక్షాళన అంటూ వాళ్లేదో అడ్డుదారులు చెప్పడం, పరుగులు పెట్టుకుంటూ వీళ్లు చేయడం. గరికపాటి వారు చెప్తూంటారు, గోదావరిలో మూడు మునకలు వేస్తే సమస్తపాపాలు పోతాయంటే గబగబా మునిగేస్తారు కానీ, పవిత్ర గోదావరిని పేపరుమిల్లు వాడు నానా వ్యర్థాలతో నింపేస్తున్నాడు, ఉద్యమం చేసి వాడిని ఆపుదాం అంటే ఒక్కళ్లూ రారని.

ఎప్పుడో చక్కటి మాట విన్నాను. నీటి వల్లనే బురద ఏర్పడుతుంది. దాన్ని వదల్చుకోవాలంటే మళ్లీ నీళ్ల అవసరమే పడుతుంది అని. అలాగే మన దుష్కర్మల చేతనే పాపపంకిలంలో యిరుక్కుంటాం. వదుల్చుకోవాలంటే సత్కర్మలు చేయాలి. షార్ట్‌కట్స్ లేవు. పాపపరిహార పత్రాలు కొంటేనో, హుండీలో డబ్బులు వేస్తేనో, బుడుంగుబుడుంగుమని పుష్కరస్నానాలు చేస్తేనో అవి మటుమాయం అయిపోవు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ భక్తి చూపించాలంటే ఆంజనేయుళ్లా మనం గుండెలు చీల్చి చూపించలేం. అందుకని విగ్రహాలు పెడతాం, వాటిని ఘనంగా అలంకరిస్తాం. ఫలం, పుష్పం లేదా తోయం చాలన్నాడు భగవద్గీతలో అంటాం. మళ్లీ తలెత్తి చూస్తే తలపాగ కింద పడేటంత ఎత్తులో పెద్ద గోపురంతో గుడి కడతాం. ఇది అన్ని మతాల్లోనూ వుంది.  విగ్రహారాధనను నిరసించి, సన్యాసిలా జీవితం గడిపిన బుద్ధుడికి ప్రపంచంలో అనేక దేశాల్లో భారీ విగ్రహాలున్నాయి. బంగారుపూతల ఆరామాలున్నాయి. ఆత్మ, పునర్జన్మ లేదు పొమ్మన్న బుద్ధుడికి పోయాక పూర్వజన్మలున్నాయంటూ జాతక కథలు కల్పించారు. ఎవరు? పూజారులు! భక్తులకు అదే నచ్చింది.

అత్యంత సాధువుగా గడిపిన ఏసుక్రీస్తుకి ఎన్ని విగ్రహాలు? ఎంతెంత ఎత్తయిన చర్చిలు? వాటికి చేసిన బంగారుపూతలు, పెద్దపేద్ద బొమ్మలేసిన అద్దాల కిటికీలు చూస్తే శిలువ మీదున్న క్రీస్తు కళ్లు తిరిగి కింద పడాల్సిందే! అంతెందుకు, అవధూతలా బతికిన సాయిబాబాకు యిప్పుడు గుళ్లలో బంగారు పల్లకీలు, వజ్రకిరీటాలు. ఆయనే బతికి వుంటే వీటన్నిటినీ ఎడం కాలితో తన్ని అవతల పారేసి నేను చెప్పిన శ్రద్ధ, సబురీ ఏవర్రా అని అడిగేవాడు. అవి చూపించలేం, అందుకని యివి చూపించి సరిపెట్టుకో మంటున్నాం. ఇప్పుడు రామానుజుడి పూజావిగ్రహం సంగతే చూడండి. 120 కిలోల బంగారంతో చేసి ఎవరూ దరికి రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటరానివాళ్లను ఆయన నెత్తిన పెట్టుకున్నాడు కానీ యిప్పుడీ విగ్రహాన్ని అంటుకోవాలంటే అంటరానివాళ్లకే కాదు, అగ్రవర్ణాల వారికీ వీలుపడదు.

మరి ఎందుకింత ఆర్భాటం? స్ఫూర్తిదాయకం అంటూ పబ్లిసిటీ చేసుకోవడానికి. అసెంబ్లీ ముందు, పార్లమెంటు ముందు గాంధీ విగ్రహాలు పెడతారు. లోపల మైకులు విరుస్తారు, స్పీకరుపై కాగితాలు చింపి పోస్తారు, తన్నుకుంటారు. గాంధీ విగ్రహం ఏమాత్రం అహింసాస్ఫూర్తి నిచ్చినట్లు? రామానుజులవారు సమతాస్ఫూర్తిని యిచ్చారంటారు జియర్. ఒక రియల్ ఎస్టేటు వ్యాపారి, స్థానిక ముఖ్యమంత్రి సహాయంతో ఆ ప్రాంతానికి సకల సౌకర్యాలు సమకూర్చుకుని, చివరకు ప్రధాని స్వయంగా వస్తాననేసరికి సమానత్వం మాట మరచి, ముఖ్యమంత్రి పేరుని శిలాఫలకంపై ఎగరగొట్టేశారు. అమరావతి శిలాఫలకంపై కెసియార్ పేరు ఉండడం ఎంత పొరపాటో, యిక్కడ లేకపోవడమూ అంతే పొరపాటు. స్వామీజీ ఏరుదాటి తెప్ప తగలేశారని కెసియార్‌కు ఆగ్రహం వచ్చింది. తన తడాఖా చూపిస్తున్నారు. రాజాశ్రయాన్ని నమ్ముకున్న కవులకే కడగండ్లు తప్పలేదు. స్వామీజీలకు తప్పుతాయా?

కరోనా యింత ఉధృతంగా వున్నపుడు యీ స్థాయిలో జనాలను సమీకరిస్తే ఎలా? అంటే కెసియార్, జియర్ ‘అన్నీ దేవుడే చూసుకుంటాడు’ అన్నారు. ఇప్పుడీ వివాదాన్ని కూడా దేవుడే చూసుకోవాలి. పూర్ణాహుతి పేరుతో ఆయనకు అనేక కిలోల ఖాద్యపదార్థాలు, బట్టలూ అగ్నిదేవుడి ద్వారా అందాయి కదా! ‘అవేమీ వేస్టు కాదు, కరోనాను తరిమికొట్టడానికి అవి అవసరమే’ అన్నారు జియర్. ఈ విషయంపై ఎవరి నమ్మకాలు వాళ్లవి అనుకుని వ్యాఖ్యానించక పోవడం మేలు. ఫోర్త్‌వేవ్‌ మాట ఎలా ఉన్నా ఒమిక్రాన్ వలన కలుగుతున్న నీరసం తగ్గితే, అదే పదివేలు. చీఫ్ జస్టిస్ నుంచి సామాన్యుడి దాకా అందర్నీ పీడిస్తోందది. కరోనా బాధలు తాత్కాలికమే కానీ రామానుజుడి పేరు చెప్పి అక్కడో టౌన్‌షిప్ ఏర్పడుతోంది. టూరిజం మాట ఎలా ఉన్నా, అక్కడున్న వారందరి భూములకు విలువ పెరుగుతుంది. ఆ ప్రాంతంవారు యితరుల కంటె ఎక్కువ సమానమవుతారు. శుభం. – (సమాప్తం)

ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)