చరిత్రలోనే ఖరీదైన ప్రేమకథ ప్రభాస్ దే

అన్ని సినిమాల్లోనూ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ ఉంటుంది. అలా అని అవన్నీ ప్రేమకథాచిత్రాలైపోవు. సాధారణంగా ప్రేమ కథలకు భారీ బడ్జెట్లుండవు. ఆమాటకొస్తే అంతటి భారీతనం ప్రేమకథలమీద పెట్టే అవసరం ఏర్పడదు.  Advertisement భారీతనమంతా…

అన్ని సినిమాల్లోనూ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ ఉంటుంది. అలా అని అవన్నీ ప్రేమకథాచిత్రాలైపోవు. సాధారణంగా ప్రేమ కథలకు భారీ బడ్జెట్లుండవు. ఆమాటకొస్తే అంతటి భారీతనం ప్రేమకథలమీద పెట్టే అవసరం ఏర్పడదు. 

భారీతనమంతా యాక్షన్ సన్నివేశాలకి, హీరో బిల్డప్పులకి, బరువైన క్యాస్టింగ్ కి ఖర్చవుతూ ఉంటుంది. 

బాహుబలిలాంటి సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్, గ్రాఫిక్స్ విభాగం సింహభాగం బడ్జెట్ ని స్వాహాచేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాని ప్రేమకథ అనలేం. అదొక వీరోచిత జానపద కథ.  

అలాగే చిరంజీవి, బాలకృష్ణల చారిత్రక చిత్రాలు సైరా, శాతకర్ణి లకి కూడా ఆ స్థాయి ఖర్చులయ్యాయి. 

కానీ ప్రేమకథ మీద ఏకంగా 300 కోట్లు ఖర్చుపెట్టడమంటే అది అత్యంత పెద్ద ప్రయోగమే అని చెప్పాలి. ప్రభాస్- పూజా హెగ్డే జంటగా వస్తున్న “రాధే శ్యాం” అన్ని భాషల్లోనూ బజ్ తెచ్చుకుంది. ఈ వారంలోనే విడులవుతోంది. ఇప్పటివరకు ఇంత భారీ ఖర్చుతో వస్తున్న తొలి ప్రేమకథాచిత్రం ఇదే. 

ఈ చిత్రానికి గాను కేవలం ఆర్ట్ డిపార్ట్మెంట్ కే రూ 100 కోట్లు ఖర్చాయ్యాయంటే ఇక ఏ స్థాయిలో ఈ కథని నమ్మారో అర్థం చేసుకోవచ్చు. ఇటలీకెళ్లి కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఇటలీ సెట్ వేసారు. ఇక గ్రాఫిక్స్ ఖర్చైతే చెప్పక్కర్లేదు. 

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రేమకథలే కాదు పెద్ద స్టార్స్ నటించిన ప్రేమకథలు కూడా చాలా అరుదు. 

గత పదేళ్లుగా అయితే ఎక్కడా పెద్ద స్టార్స్ నటించిన ప్రేమకథలు కనిపించడంలేదు. ఇంకాస్త ముందుకెళ్లి చూస్తే తొలిప్రేమ, ఖుషిలాంటివి గుర్తొచ్చినా ఆ టైముకి పవన్ కళ్యాణ్ యువ హీరోనే కానీ సీనియర్ హీరో కాదు. 

ఇక 1990ల్లో గీతాంజలి వచ్చినా అది అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా విజయం అందుకోలేదు. కేవలం హిట్టయిందంతే.  

అందుకే ప్రేమకథల మీద ఒక మోతాదుకు మించి ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ధైర్యం చేయరు. జనరల్ గా పెద్ద హీరోలతో ఫార్ములా సినిమాలు తీయడమే సేఫ్ అని అనుకుంటుంటారు. కానీ “రాధే శ్యాం” మీద 300 కోట్లు పెట్టడంతో ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమే కాదు దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దీని ఫలితమేమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

ఇప్పుడు లవర్ బాయ్ గా నటిస్తున్న ప్రభాస్ వయసు 42 ఏళ్లు. తెరమీద పాత్రకు తగ్గట్టుగా కనిపించడానికి గ్రాఫిక్స్ సాయాన్ని ఎంత వాడుకున్నారో ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటూ, కరోనా వేవ్ లను దాటుకుంటూ ఖర్చు తడిసి మోపెడు చేసుకున్న చిత్రమిది. 

అయినా కూడా ప్రీ రిలీజ్ హైప్ అయితే పొందగలిగింది. కారణం ప్రభాస్ దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అతి పెద్ద స్టార్ హీరో. బాహుబలి లాంటి జానపద చిత్రం, సాహో లాంటి యాక్షన్ చిత్రం తర్వాత “రాధే శ్యాం” అనే ప్రేమకథతో ఆయా చిత్రాల బడ్జెట్ కు ఏమాత్రం తీసిపోకుండా తయారయ్యి ముందుకొస్తున్నాడు. 

ఈ చిత్రం బ్రేకీవెన్ చేసుకున్నా చరిత్రలో నిలిచిపోయే విజయం కింద పేర్కొనొచ్చు. లాభాలొస్తే సువర్ణాక్షరాలతో చరిత్ర రాసుకోవచ్చు. తేడాకొడితే మాత్రం ప్రయోగం వికటించిందనో, కాస్ట్ ఫెయిల్యూర్ అనో అనుకోవాలి. 

అయినా అమంగళం ప్రతిహతమగుగాక. 

రెండ్రోజుల్లో ముందుకొస్తున్న “రాధే శ్యాం” జనాదరణపొందే విధంగా ఉండాలని ఆశిద్దాం. 

– శ్రీనివాసమూర్తి