టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మార్క్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధికారం, రాజకీయాలు బాబుని ఎంత నీచస్థాయికి దిగజార్చాయో మరోసారి చూపుతున్నాయి. అధికారం కోసం ఎవరిని బలిపెట్టడానికి చంద్రబాబు సిద్ధహస్తుడని ప్రత్యర్థుల విమర్శల్లో నిజమెంతో తెలుసుకునే అవకాశం వచ్చింది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన పెద్ద మనిషి, ప్రజలకు చేసిన మంచి ఏంటో చెప్పుకుని ప్రజాతీర్పు అడిగే ధైర్యం లేక, అలిపిరిలో తనపై హత్యాయత్నాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే.
2003లో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు మందుపాతర్లు పేల్చారు. ఈ ఘటనలో ప్రాణపాయం నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు వుంది. అప్పటికి చంద్రబాబు తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అయితే అలిపిరిలో తనపై హత్యాయత్నాన్ని సొమ్ము చేసుకునేందుకు వ్యూహం రచించారు.
తనను పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పరామర్శించేందుకు వస్తున్నట్టు క్రియేట్ చేశారు. సానుభూతి పొంగిపొర్లుతోందని భ్రమించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి… బొక్కబోర్లా పడ్డారు. బాబుపై ప్రజల్లో సానుభూతికి బదులు తీవ్రమైన ఆగ్రహం ఉందని, 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి ఘన విజయం చాటి చెప్పింది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ఎన్నికల అస్త్రం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. వెతుకుతున్న తీగ కాలికి తగిలిన చందంగా తన భార్య భువనేశ్వరిపై సొంత పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అవాకులు చెవాకులు పేలారు. అసెంబ్లీ బయట లోకేశ్‌ను చులకన చేసి మాట్లాడ్డంలో భాగంగా వల్లభనేని నోరు జారారు. అప్పుడు చంద్రబాబు, లోకేశ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ నోరు మెదపలేదు. అసెంబ్లీలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబుకు శోకాన్ని, కోపాన్ని మిగిల్చాయి.
అసెంబ్లీ సమావేశాల్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు ఉద్వేగంగా ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో తన భార్య భువనేశ్వరిని పవిత్రమైన అసెంబ్లీలో దూషించారని వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని సానుభూతి, ప్రజామద్దతు కూడగట్టుకునేందుకు చంద్రబాబు తనవైన కుట్రలకు తెరలేపారు. అప్పటి నుంచి ఏ సభ జరిగినా తన ప్రసంగంలో భార్య ప్రస్తావన ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన భార్య ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. అలాంటిది ఆమెను కూడా అసెంబ్లీలో తిట్టారని వాపోయారు. గౌరవ సభను కౌరవసభలా మారిస్తే బయటకు వచ్చేశానన్నారు. పదేపదే భువనేశ్వరికి అవమానం జరిగిందంటూ చంద్రబాబు ప్రస్తావించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
2004 ఎన్నికలప్పుడు అలిపిరి ఘటనను వాడుకున్నట్టే, నేడు భువనేశ్వరిని ముందు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యూహం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కాదేదీ రాజకీయానికి అనర్హమని చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారనేందుకు భువనేశ్వరి ఎపిసోడే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2004లో అలిపిరి సినిమా అధికారంలోకి తీసుకురాలేదు.
మరి 2024లో భువనేశ్వరి అవమానమైనా చంద్రబాబును గట్టెక్కిస్తుందా? చంద్రబాబు రాజకీయ చరమాంకంలో ప్రయోగిస్తున్న సతీమణి అస్త్రం ఎంత వరకూ విజయాన్ని ఇస్తుందో అనే చర్చకు తెరలేచింది.