ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ముందస్తు ఎన్నికల జపం చేస్తున్నారు. ఇదంతా పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కాపాడుకునే వ్యూహంలో భాగమని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఏడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడతలో ఘోర పరాజయం, రెండో విడతలో అసలు పోటీకే ధైర్యం చేయని టీడీపీ, ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం గమనార్హం.
చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రావడమే ఆలస్యం, తాను మళ్లీ సీఎం కావడం తథ్యమని చంద్రబాబు కలలు కంటున్న వైనాన్ని చూడొచ్చు. ముందస్తు ఎన్నికలపై బాబు ఏమన్నారంటే…
‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ధైర్యం ఉంటే ఎన్నికలకు రేపైనా వెళ్లవచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం. రేపో ఎల్లుండో ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రోజురోజుకూ పతనావస్థకు చేరుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యతిరేకత పెరుగు తోంది. అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారు. ఈ కుంపటి దించుకునేందుకు ప్రజలూ సిద్ధం’ అని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఎన్నికలు రావడం, టీడీపీ అధికారాన్ని దక్కించుకోవడం, తాను ముఖ్యమంత్రి కావడం… ఇలా అనేక కలలు చంద్రబాబు మాటల్లో చూడొచ్చు. టీడీపీ రోజురోజుకూ పతనావస్థకు చేరుతుండడం వల్లే…. ఎన్నికల బూచీ చూపుతూ నాయకులను నిలుపుకునేందుకు చంద్రబాబు ముందస్తు అనే నాటకానికి తెరలేపారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు పాలించాలని జగన్‌కు అధికారం కట్టబెట్టారని, ఇంకా రెండేళ్ల సమయం ఉందని గుర్తు చేస్తున్నారు.
జగన్ మూడేళ్ల పరిపాలనకే చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, పార్టీని కాపాడుకోలేక, భవిష్యత్‌పై భరోసా లేకపోవడంతో దిక్కుతోచని మాటలు మాట్లాడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కనీసం రెండేళ్లకైనా చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమైతే మంచిదని హితవు చెబుతున్నారు. మరోసారి చంద్రబాబు అనే కుంపటిని నెత్తికెత్తుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని వైసీపీ నేతలు అంటున్నారు.