తనకున్న పరిచయాల్ని సినిమా ఛాన్సుల కోసం వాడుకోవడం అస్సలు ఇష్టం ఉండదంటున్నాడు దర్శక-నిర్మాత కోన వెంకట్. ఒక్క మెసేజ్ పెడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తనతో సినిమా చేయడానికి రెడీ అంటారని.. కానీ ఆ పరిచయాన్ని తన సినిమాల కోసం వాడుకోవడం ఏమాత్రం తనకు ఇష్టం లేదంటున్నాడు.
చివరికి పవన్ కల్యాణ్ తో కూడా తను ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా తీయగలనంటున్నాడు కోన వెంకట్. పవన్ నుంచి తనకు ఎప్పుడూ ఓపెన్ ఆఫర్ ఉందని.. నచ్చిన కథ, నచ్చిన దర్శకుడితో సినిమా చేసుకోమని పవన్ తనకు ఎప్పుడూ ఆఫర్ ఇస్తుంటారని కోన చెప్పుకొచ్చాడు.
“పవన్ కల్యాణ్ తో ఎనీ టైమ్ సినిమా తీయగలను. కానీ చాలా మంచి కథ కావాలి. ఎవ్వరూ తీయనిది, ఎవ్వరూ చేయనిది, ఎవ్వరూ చూడనిది పవన్ తో చేయాలని నా కోరిక. ఎక్కువ ప్రెషర్ తీసుకొని చాలా రాశాను.
కానీ నాకే తృప్తి అనిపించక చాలా కథలు పక్కనపెట్టేశాను. పవన్ మాత్రం ప్రతిసారి కథ అయిందా, అయిందా అని వెంట పడేవాడు. కానీ నేను రాసిన కథ నాకే నచ్చడం లేదు. ఇలా ఎన్నోసార్లు పవన్ కు చెప్పాను.”
ఇలా ఓపెన్ ఆఫర్ ఉన్నప్పటికీ పవన్ తో సినిమా చేయలేకపోతున్నానని బాధపడ్డారు కోన వెంకట్. 2020లో నిశ్శబ్దం మూవీతో కిందామీద పడిన మాట వాస్తవమేనని అంగీకరించిన కోన.. కొత్త ఏడాదిలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేయబోతున్నట్టు ప్రకటించాడు. పెద్ద స్టార్ హీరో అందులో నటిస్తాడని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానని అంటున్నాడు.