బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ పెద్ద సంచలన ప్రకటనే చేశారు! అదేమిటంటే.. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వీరితో టచ్లో ఉన్నారట! టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 మంది బీజేపీతో టచ్లో ఉన్నారట.
ఇందుమూలంగా బండి సంజయ్ చెప్పేదేమిటంటే.. ఆయన సిగ్నల్ ఇచ్చేస్తే చాలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వచ్చి బీజేపీ బండెక్కేస్తారనేది!
మరి 30 మంది టచ్లో ఉన్నరని ఈయన చెప్పగానే.. టీఆర్ఎస్ ఏ మేరకు బెంబేలెత్తుతుందో కానీ, ఇంతకీ బీజేపీ వద్ద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రశ్న మాత్రం తప్పకుండా తలెత్తుతుంది! సొంతంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లేని బీజేపీ ఇలా ముప్పై మంది, నలభై మంది అంటూ ప్రకటనలు చేయడం కామెడీనే అవుతుంది.
ఇప్పటికే బోలెడన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనత బీజేపీ సొంతం. ఈ విషయంలో బీజేపీ శక్తియుక్తులను ఎవరూ శంకించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ 60 యేళ్లలో ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టిందో బీజేపీ ఆరేళ్లలో అన్ని ప్రభుత్వాలను కూలగొట్టినట్టేనేమో. కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో ఆ పని పూర్తి చేసి ఇతర రాష్ట్రాల వైపు కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది కమలం పార్టీ అధిష్టానం. ఆ అధిష్టానానికి తగ్గట్టుగా మాట్లాడారు బండి సంజయ్.
అయితే 30 మంది టచ్లో ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం బీజేపీ కూల్చలేదు. ఆ ముప్పై మంది చేతే బండి సంజయ్ రాజీనామా చేయించినా, లేక వాళ్లను బీజేపీలోకి చేర్చేసుకున్నా.. మినిమం మెజారిటీ అయితే టీఆర్ఎస్ కు ఉండనే ఉంటుంది.
కొద్దో గొప్పో సీట్లు సొంతంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలకు ప్రభుత్వాలు భయపడతాయేమో కానీ, మూడు సీట్లు కూడా లేకున్నా.. ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్లో అని చెప్పడం కామెడీనే అవుతుంది.
మరింత ప్రహసనం ఏమిటంటే..జీహెచ్ఎంసీలో తమ పార్టీ తరఫున నెగ్గిన కార్పొరేటర్లను టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోందని బండి సంజయ్ చెబుతున్నారు.
ఏకంగా ఎమ్మెల్యేలే బీజేపీలోకి చేరడానికి గంతులేస్తున్న వేళ, ఇక కార్పొరేటర్ల గురించి చింత ఎందుకో, అక్కడ నుంచి ఎమ్మెల్యేలే వచ్చేస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి కార్పొరేటర్లు ఎలా వెళ్తారబ్బా? రెండు ప్రకటనలకూ ఏమైనా పొంతన కనిపిస్తోందా?