అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యాకా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీద టాలీవుడ్ టాప్ హీరోల చూపు పడింది. డీప్ క్యారెక్టర్ స్టడీని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన సందీప్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఉత్సాహం చూపించారు.
అందులో మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా మహేష్, చరణ్ లతో పలు సందర్భాల్లో సందీప్ కనిపించడంతో ఆయా కాంబోలో సినిమాలు అనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి.
అయితే ఆ సినిమాలు ఎంతకూ ప్రతిపాదన దశకు కూడా రాలేదు. అంతలోనే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ పనుల్లో బిజీ అయ్యాడు సందీప్. బాలీవుడ్ లో కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తన దర్శకత్వ ప్రతిభతో బాలీవుడ్ హీరోలనూ కూడా ఆకట్టుకున్న సందీప్ కు అక్కడ ఛాన్సెస్ మెరుగయ్యాయి. ఈ క్రమంలోనే యానిమల్ సినిమా పట్టాలెక్కింది.
ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే.. ముందుగా ఇదే కథను మహేశ్ కు చెప్పాడట సందీప్. అయితే తెలుగు హీరోలకు యథాతథమైన ఇబ్బందులు ఉండనే ఉంటాయి.
అర్జున్ రెడ్డితో బోల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందీప్ అంతే స్థాయి బోల్డ్ కాన్సెప్ట్ ను టాలీవుడ్ టాప్ హీరోలకు చెప్పడంతో వారి నుంచి తటపటాయింపు తప్పలేదని తెలుస్తోంది. ఈ సినిమా గురించి కొన్నాళ్ల పాటు చర్చించిన మహేశ్ చివరకు చేయడం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.
అలా ఆగిన కథనే ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. గతంలో అర్జున్ రెడ్డి కథను స్టార్ హీరోలకు చెప్పడానికి కూడా సందీప్ కు అవకాశం లభించినట్టుగా లేదు.
ఇప్పుడు అలాంటి యాక్సెస్ సులభంగానే ఉన్నా, ఈ దర్శకుడి స్టైల్ బోల్డ్ కాన్సెప్ట్ లకు టాలీవుడ్ హీరోలు తలూపలేకపోతున్నారు. అయితే..టాలీవుడ్ కు మించి మార్కెట్, గుర్తింపు ఉన్న స్థాయిలోనే సందీప్ తన సినిమాను రూపొందించగలుగుతున్నాడు. మరి ఈ సారి ఏ మేరకు తన సత్తా చాటతాడో!