ఎట్టకేలకు సందీప్ రెడ్డి వంగ తన నెక్ట్స్ ప్రాజెక్టును ప్రకటించాడు. నూతన సంవత్సర కానుకగా రణబీర్ కపూర్ హీరోగా కొత్త సినిమా ప్రకటించాడు. దీనికి యానిమల్ అనే పేరు పెట్టాడు సందీప్. మూవీ ప్రకటనలో భాగంగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో పాపులరైన సందీప్ రెడ్డి, అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతడు ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాలీవుడ్ హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
ఫైనల్ గా రణబీర్ కపూర్ తో తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు ఈ దర్శకుడు. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ హిందీలో కిక్ సినిమాను రీమేక్ చేయడం కోసం ఈ టైటిల్ ను ఆల్రెడీ రిజిస్టర్ చేయించారు. దీంతో యానిమల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
సినిమాలో బాబీ డియోల్, అనీల్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఎందుకంటే.. అతడు గతంలో తీసిన కబీర్ సింగ్ సినిమాపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాను బాలీవుడ్ క్రిటిక్స్ ఏకిపడేశారు. ఇదేం సినిమా అంటూ ఆడిపోసుకున్నారు.
సందీప్ రెడ్డి కూడా అస్సలు తగ్గలేదు. క్రిటిక్స్ పేర్లు ప్రస్తావించి మరీ ఎదురుదాడికి దిగాడు. త్వరలోనే అర్జున్ రెడ్డికి బాబు లాంటి మరో సినిమా తీస్తానని కూడా ఛాలెంజ్ చేశాడు. ఈ నేపథ్యంలో యానిమల్ సినిమాపై అంచనాలు పెరిగాయి.