కొత్త సంవత్సరం వస్తోందంటే.. కొంగొత్త ఆశలు ఎప్పుడూ ఉండేవే. కొత్త సంవత్సరం తమ ఆకాంక్షలను నిజం చేయాలని, ఆశలు, ఆశయాలు కొత్త సంవత్సరంలో కార్యరూపం దాల్చాలని కోరుకోని వ్యక్తి ఉండదు. అలాగే మన తోటి వారి ఆశలూ, ఆకాంక్షలు కూడా తీరాలని కోరుకుంటూ.. విష్ యూ ఏ హ్యాపీ న్యూయర్ అంటూ చెప్పుకుంటాం. అందరి ఆకాంక్షలూ తీరాలని, వాటితో పాటు మన ఆకాంక్షలూ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
కొత్త సంవత్సరం వచ్చినప్పడల్లా.. వీటి గురించి ఎవరి మనసులో వారు చర్చించుకోకుండా ఉండరు! మనకేం కావాలో..మనమేం కోరుకుంటున్నామో మననం చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. ఈ ఏడాదైనా అనుకున్నవన్నీ జరిగిపోవాలని అనుకోని ఏడాదంటూ ఉండదు. 2020 సంవత్సరం వరకూ.. మనం, మనవాళ్లు అనుకుంటూ ఆలోచించేది ప్రపంచం.
అయితే 2021 వస్తూ వస్తూ మనిషిని చాలా విస్తృతంగా ఆలోచించేలా మార్చింది. వాస్తవానికి 2020నే మనిషిని ఈ ఆలోచనలో పడేసింది. అయితే 2021 సందర్భంగా మనం ఒక్కటే బాగుంటే సరిపోదు, మన పక్క వాళ్లు బాగుండాలి, ఆ పక్కవాళ్లు బాగుండాలి.. ఎక్కడో ఉన్న యూరప్ బాగుండాలి, అంతకన్నా దూరమున్న అమెరికాలో పరిస్థితులు చక్కబడాలి.. అని ఏదో ఒక క్షణంలో అయినా కోరుకోని మనిషి లేడిప్పుడు!
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని నలుమూలలా వీలైనంత త్వరగా అంతరించిపోవాలని, అంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చే రోజు రావాలనేది 2021 సందర్భంగా ఎక్కువగా వ్యక్తం అవుతున్న కోరిక. మామూలుగా అయితే .. ఎక్కడో ఏవో దేశాల్లో వైరస్ అంటే, మనకేమొచ్చిందిలే అనుకునే వాళ్లమే.
అయితే.. ఏదో దేశంలో ఎవరో తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తోంది! ఎప్పుడో దశాబ్దాల కిందట ఎవరో ఫ్రాన్స్ తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందంటూ సామెత చెప్పారు. అదేదో మాట వరస సామెత కానీ, ఇప్పుడు ఇలా వాస్తవం అయిపోయింది.
యూకేలో ఎవరో తుమ్ముతుంటే ఇండియా ఎయిర్ పోర్టులు మూసేస్తున్నాం! మానవాళ్లే అయినా అక్కడ నుంచి ఎందుకొచ్చారా.. అనేంత విసుగు ధ్వనిస్తోంది! ఇలాంటి నేపథ్యంలో.. అక్కడ కూడా పరిస్థితులు చక్కబడిపోతే.. మనకు కూడా పూర్తి రిలీఫ్ దొరుకుతుంది అనే భావన ప్రతి మనిషిలోనూ వచ్చింది.
ఈ పరివర్తన మంచిదే. అన్ని దేశాలూ బాగుంటేనే మనం కూడా బాగుంటామనే ఇంగితాన్ని మనిషికి అర్థమయ్యేలా చేసింది కరోనా మహమ్మారి. ఇది కేవలం ఆ వైరస్ విషయంలోనే కాదు.. ఉగ్రవాదం, తీవ్రవాదం, జాతి విద్వేషాలు, వర్ణ వివక్ష, మతద్వేషాలు.. వీటన్నింటికీ వర్తిస్తుంది.
వైరస్ విషయంలో ప్రాక్టికల్ గా అర్థం అవుతోంది. మిగతా విషయాల్లో మాత్రం ఇంకా అంత ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదు. ఈ విషయాల్లో ఇంకా కుంచించుకుపోతున్నాం. మనుషులు ఈ విషయాల్లో లోతుగా ఆలోచించడాన్ని ఆపించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలు ఆందోళనను రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎంత త్వరగా మారితే అంతమంచిది.
కొత్త సంవత్సరానికి కాన్ఫిడెంట్ గా వెల్కమ్ చెప్పవచ్చని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చేతిలో కరోనా వ్యాక్సిన్ విరుగుడును పెట్టుకున్నామని.. ధీమాను కాస్త పెంచుకోవచ్చని వారు భరోసా ఇస్తున్నారు.
ఇలా కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెబుతోంది. ప్రపంచానికి 2021 మరో 2020 లాంటి అనుభవాలు పొరపాటున కూడా పునరావృతం కాకూడదని ఆకాంక్షిస్తూ జనజీవనం పూర్తి స్థాయిలో గాడిన పడి కొత్త లక్ష్యాల దిశగా సాగాలని ఆశిస్తూ… గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.