పాడేరు ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్…?

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఈనాటికి బలంగానే ఉన్నారు. వారి కార్యకలాపాలు మందగించాయని పోలీసులు అనుకోవడం అంతా కూడా ఒక వైపు సాగుతున్నా మావోలు ఎపుడూ చాప కింద నీరులాగానే విస్తరిస్తూ ఉంటారు. తమ యాక్టివిటీస్…

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఈనాటికి బలంగానే ఉన్నారు. వారి కార్యకలాపాలు మందగించాయని పోలీసులు అనుకోవడం అంతా కూడా ఒక వైపు సాగుతున్నా మావోలు ఎపుడూ చాప కింద నీరులాగానే విస్తరిస్తూ ఉంటారు. తమ యాక్టివిటీస్ ని కూడా కాలానికి పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికపుడు డిజైన్ చేసుకుంటూ ఉంటారు.

ఇక చాలాకాలానికి  విశాఖ ఏజెన్సీలో మావోలు మరో మారు హెచ్చరికల స్వరం వినిపించారు. అది కూడా పాడేరు మహిళా ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మికి తన కఠిన స్వరాన్ని తేటతెల్లం చేశారు. పాడేరు ఎమ్మెల్యేగా ఉంటూ బాక్సైట్ అక్రమ తవ్వకాలకు భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారు అని మావోలు గట్టి ఆరోపణే చేశారు.

లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు ఏజెన్సీలో విచ్చలవిడిగా తవ్వుతున్నారని, అయితే ఎమ్మెల్యే సహకారంతోనే ఇదంతా సాగుతోందని మావోయిస్టులు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని సూచించారు. తక్షణం ఎమ్మెల్యే పదవికి భాగ్యలక్ష్మి రాజీనామా చేయాలని, ఆమె ఏకంగా మన్యం ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాలని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఈ విషయంలో తమ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకపోయినా అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోములకు పట్టిన గతే మీకూ పడుతుందని తాజాగా రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది.

ఇదిలా ఉంటే 2018 అక్టోబర్ నెలలో మావోయిస్టులు అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముని మాటు వేసి మరీ పట్టుకుని కాల్చేశారు. ప్రజా కోర్టు పేరిట శిక్షలు వేశామని కూడా ప్రకటించారు. ఇపుడు కూడా ప్రజా కోర్టు అంటూ కిడారి ఉదంతాన్ని గుర్తు చేయడంతో పాడేరు వైసీపీ ఎమ్మెల్యే శిబిరంలో భయాందోళనలు మొదలయ్యాయి.

ఇక భాగ్యలక్ష్మి చురుకైన నేత. మంచి మెజారిటీతో 2019 ఎన్నికల్లో ఆమె పాడేరు నుంచి గెలిచారు. అయినా మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడక మావోలు ఇపుడు ఆమెను టార్గెట్ చేయడంతో ఏజెన్సీ మొత్తంగా ప్రజా ప్రతినిధులు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. 

మరి దీని మీద పోలీస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయి ప్రభుత్వం ఏ విధమైన రక్షణ ఆమెకు కల్పిస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా ఎమ్మెల్యేను సడెన్ గా రాజీనామా చేయమనడం మాత్రం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.