తన ఆత్మీయుడు, సహచర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాశ్వత గుర్తింపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మిత్రుడి కోసం తాను ఏం చేయాలని అనుకుంటున్నారో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ఇవాళ అసెంబ్లీలో జగన్ ప్రవేశ పెట్టారు. చివరిగా జగన్ మాట్లాడుతూ గౌతమ్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని పెట్టుకుని రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సందర్భంలో తన వెంట నడిచిన తక్కువ మందిలో గౌతమ్ ఒకడని తెలిపారు.
మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయంగా తన వెంట నడవడానికి గౌతమ్‌రెడ్డే కారణమన్నారు. తనపై నమ్మకంతో తండ్రిని కూడా రాజకీయంగా వెంట నడిచేలా చేశారని కొనియాడారు.
స్నేహితుడిని భవిష్యత్ తరాలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునేలా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సభ్యుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులను పూర్తి చేసేలా మంత్రి అనిల్ చర్యలు తీసుకున్నారన్నారు. బ్యారేజీ ప్రారంభం రోజు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేస్తామని అన్నారు.
గౌతమ్‌రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన కలలు నెరవేరుస్తామని సీఎం అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామన్నారు. అలాగే గౌతమ్ స్మారకార్థం ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి మూడు విన్నపాలు చేశారని, వాటిని తప్పక నెరవేరుస్తామని సభాముఖంగా జగన్ హామీ ఇచ్చారు.