ఇప్పుడు పేదలు లేరా.. నాలుక మడతపెట్టిన టీడీపీ

పేదవాడికి కూడా వినోదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో టికెట్ ధరల్ని తగ్గించినట్టు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బెనిఫిట్ షో ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా టికెట్ రేట్లు పెంచి నిర్మాతలు సొమ్ము చేసుకోడానికి అడ్డుకట్ట…

పేదవాడికి కూడా వినోదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో టికెట్ ధరల్ని తగ్గించినట్టు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బెనిఫిట్ షో ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా టికెట్ రేట్లు పెంచి నిర్మాతలు సొమ్ము చేసుకోడానికి అడ్డుకట్ట వేసింది. గతంలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆ టైమ్ లో టీడీపీ విరుచుకుపడింది.

టాలీవుడ్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, థియేట్రికల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. 5 రూపాయలకు టీ కూడా రాదు, సినిమా టికెట్ ఏంటని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాలం గడిచింది. ఇండస్ట్రీ పెద్దలు వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నాక ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చింది.

మరిప్పుడు టీడీపీ ఏం చేయాలి..?

టికెట్ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిన తర్వాత టీడీపీ కచ్చితంగా స్పందించాలి. టాలీవుడ్ డిమాండ్లకు ప్రభుత్వం న్యాయం చేసిందని అనాలి. కొత్త జీవోను పొగడాలి. కానీ నాలుక మడత పెట్టేసింది. రివర్స్ గేర్ వేసింది. 

టికెట్ రేట్లు పెంచిన నేపథ్యంలో.. ఇప్పుడు పేదవాడు కనిపించడం లేదా.. వాడికి వినోదం అందుబాటులోకి తీసుకురారా అంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు పసుపు నెటిజన్లు.

టీడీపీ వాదనలో ఏది కరెక్ట్..?

గతంలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు..  రేట్లు తగ్గిస్తే సినిమావాళ్లు నష్టపోతారు కదా, వాళ్లు బతకడం ఇష్టం లేదా అంటూ ఏడ్చింది టీడీపీ బ్యాచ్. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే.. సామాన్యులకు వినోదం అందకుండా చేస్తారా అంటూ మరోసారి మొసలి కన్నీరు కారుస్తోంది. 

అంటే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి, టీడీపీ అప్పుడూ ఇప్పుడూ సిగ్గులేకుండా విమర్శలు మాత్రమే చేస్తోంది..

ఇంతకీ టికెట్ రేట్లు పేదవారికి అందుబాటులో లేవా..?

గ్రామాల్లో సినిమా టికెట్ కనీస ధర 20 రూపాయలు. అంటే టీ, సమోసా తినడానికి ఎంత ఖర్చు పెడతామో, అదే ఖర్చుతో సినిమా చూడొచ్చనమాట. అదే గ్రామం పరిధిలో మల్టీప్లెక్స్ కడితే కేవలం 100 రూపాయలకే మల్టీప్లెక్స్ టికెట్ కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రభుత్వం పేదల విషయంలో అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ తప్పు నిర్ణయం తీసుకోలేదు.

ఇక నగరాల్లోని సినిమా థియేటర్ల విషయంలో కూడా నామమాత్రంగా టికెట్ రేట్లు పెంచారు. 40 రూపాయలతో మొదలై.. మల్టీప్లెక్స్ లో 250 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. అటు ఇండస్ట్రీ వారికి నష్టం రాకుండా, ఇటు సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సమన్యాయం చేసింది ప్రభుత్వం. హీరో, హీరోయిన్ల పారితోషికాన్ని కలపకుండా బడ్జెట్ లెక్క వేయాలంటూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.

కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం గరిష్ట ధరని కోట్ చేస్తూ రెచ్చిపోతోంది. 250 రూపాయల టికెట్ రేటును మాత్రమే చూపిస్తూ, పేదవాడికి వినోదం అందుబాటులో లేదంటూ సిగ్గులేని కామెంట్స్ చేస్తోంది. ఇలా తన రెండు నాల్కల ధోరణిని మరోసారి బయటపెట్టుకుంది టీడీపీ.