కేసీఆర్ ను కార్నర్ లో పడేసిన ఎగ్జిట్ పోల్స్

కేంద్రంపై కేసీఆర్ కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ గద్దెనెక్కుతా, మోదీని దించేస్తానంటూ.. ఇప్పటికే ఆయన బీజేపీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తన వాగ్బాణాలకు మరింత పదును పెట్టాలనుకున్నారు…

కేంద్రంపై కేసీఆర్ కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ గద్దెనెక్కుతా, మోదీని దించేస్తానంటూ.. ఇప్పటికే ఆయన బీజేపీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తన వాగ్బాణాలకు మరింత పదును పెట్టాలనుకున్నారు కేసీఆర్. కానీ ఆయన ఆశలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి.

అత్యథికంగా అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ మరోసారి బీజేపీ వశం కాబోతుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. దీంతోపాటు.. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కూడా బీజేపీకే విజయావకాశాలు ఎక్కువని సర్వేలు తేల్చడంతో కేసీఆర్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. 

నిజంగా ఎగ్జిట్ పోల్స్ నిజమై.. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తే, అది కేసీఆర్ ను మరింత టెన్షన్ పెడుతుంది. ఎగ్జిట్ పోల్స్ తో కేసీఆర్ కార్నర్ లో పడ్డారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫ్రంట్ లేదనడం వ్యూహంలో భాగమేనా..?

ఆమధ్య బీజేపీ వైరి వర్గాన్నంతా ఒకటిచేసి కలసి పనిచేస్తామని చెప్పిన కేసీఆర్, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తర్వాత మాత్రం కాస్త మెత్తబడ్డారు. ఫ్రంట్ లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు.. ఇప్పుడేమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ నుంచి అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. 

కేసీఆర్ కి ఫ్రంట్ పెట్టేంత సీన్ లేదని, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని కలిశాక ఆయన డైలమాలో పడ్డారని రేవంత్ రెడ్డి అప్పుడే జోస్యం చెప్పారు, అదే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. నిజంగానే కేసీఆర్ ఇప్పట్లో ఫ్రంట్ కి వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు.

కేజ్రీ ముందు కేసీఆర్ నిలబడగలరా..?

బీజేపీ బలహీనపడకపోవడంతో పాటు.. కేజ్రీవాల్ క్రేజ్ పెరగడం కూడా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే పరిణామమే. పంజాబ్ లో కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అంటే కేజ్రీవాల్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి అధినేత అన్నమాట. 

ఆ లెక్కన టెక్నికల్ గా మమత కంటే ఆయనే ఓ అడుగు ముందుకేశారు. 2024లోపు మిగతా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ మెరుగైన ఫలితాలు సాధిస్తే..కచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కి ఆయనే కింగ్ మేకర్, కింగ్ కూడా అయ్యే అవకాశముంది.

అంటే కేసీఆర్, బీజేపీ వ్యతిరేక కూటమికి పునాది వేసినా, దానిలో కాపురం ఉండేది, అవకాశమొస్తే ప్రధాని అయ్యేది కేజ్రీవాలే అని అర్థమవుతోంది. సో.. కేసీఆర్ ముందుకెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ లేదన్నమాట. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడుతుందని అంచనా వేసిన కేసీఆర్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. 

ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమైతే మాత్రం కేసీఆర్ మరోసారి తన 'ఢిల్లీ ఆలోచనలు' విరమించుకోవాల్సిందే.