తమ్ముడు సినిమా వకీల్ సాబ్ ఆడుతున్నప్పుడు ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు మొదలైంది, బెనిఫిట్ షో లపై వేటు పడింది. అది దాదాపు ఏడాది కొనసాగింది. ఇప్పుడు భీమ్లానాయక్ విడుదలైంది. ఈ సినిమాకు కూడా కొత్త జీవో అందకుండా చేశారు. ఈ టైమ్ లో ఎక్కడా చిరంజీవి నోరు మెదపలేదు.
తన తమ్ముడి సినిమాను పట్టించుకోనట్టే వ్యవహరించారు. పరిశ్రమకు మేలు చేకూర్చేలా మాత్రమే వ్యవహరించారు. ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టారు. తనే ముందుండి అందర్నీ నడిపించారు. అనుకున్నది సాధించారు.
ఓవైపు జనసైనికులు, పవన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ.. చిరంజీవి టాలీవుడ్ సంక్షేమం కోసం ఆలోచించారు. తమ్ముడి సినిమా కోసం ఆలోచించలేదు. అలా అందరివాడు అనిపించుకున్నారు చిరు.
చిరంజీవి చేతులు కట్టుకున్నారు, సీఎం ముందు వంగిపోయారంటూ ఆమధ్య పవన్ కల్యాణ్ కూడా పరోక్షంగా హేళన చేశారు. ఆ దెబ్బతో జనసైనికులు కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. మెగాస్టార్ అని కూడా చూడకుండా నోరు పారేసుకున్నారు.
నిజంగానే చిరంజీవి అలాంటివారయితే.. తమ్ముడి సినిమా కోసమే చేతులు కట్టుకునేవారు. భీమ్లా నాయక్ రిలీజ్ కి ముందే ఆ జీవో వచ్చేలా చేసేవారు. తన తమ్ముడి సినిమాను కాస్త కనికరించండి అంటూ సీఎంని అభ్యర్థించేవారు.
కానీ చిరంజీవి ఆ పని చేయలేదు. మొత్తం ఇండస్ట్రీ బాగు కోసం నడిచారు. చిన్న సినిమాలకు ఐదో షో కోసం అనుమతి రావడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దటీజ్ చిరు.
దిగజారిన పవన్ ఫ్యాన్స్
సినిమాల కోసం సొంత అన్ననే టార్గెట్ చేశారు పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు. భీమ్లా నాయక్ రిలీజ్ టైమ్ లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది థియేటర్ల దగ్గర గస్తీ తిరిగారని, ఆ టైమ్ లో ఇండస్ట్రీ నుంచి తనకు సపోర్ట్ లేదన్నారు పవన్ కల్యాణ్. పవన్ పేరుతో నాగబాబు మరీ రెచ్చిపోయారు. పరోక్షంగా సొంత అన్ననే ఇరుకున పెట్టేలా మాట్లాడారు. కానీ చిరంజీవి ఎక్కడా మాట తూలలేదు, తప్పుడు ట్వీట్ వేయలేదు.
భీమ్లా నాయక్ విషయంలో ఆయన విమర్శల జోలికి వెళ్లలేదు. ఇండస్ట్రీ అంతటి బాగు కోసమే ఆయన ఆలోచించారు కాబట్టి, ప్రభుత్వంతో పలుమార్లు చర్చలకు వచ్చి అంతా సర్దుకునేలా చేశారు. జీవో వచ్చే వరకు వేచి చూశారు. జీవో వచ్చాక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ వేశారు.
ఈ ట్వీట్ ని కూడా జనసేన భూతద్దంలో చూస్తోంది. తమ్ముడి సినిమాని సపోర్ట్ చేయని చిరు, ఇప్పుడు ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ వేశారని మండిపడుతున్నారు జనసైనికులు. కానీ చిరంజీవిని మిగతా ఇండస్ట్రీ అంతా పెద్ద దిక్కులా భావిస్తోంది.
తమ తరపున ప్రభుత్వంతో మాట్లాడిన చిరంజీవికి ధన్యవాదాలు చెబుతోంది. అలా చిరంజీవి మరోసారి అందరివాడు కాగా.. ఇలా పవన్ కేవలం తన సినిమా కోసమే ఆలోచించి కొందరివాడిగా మిగిలిపోయారు.