అసెంబ్లీ సమావేశాలకు అనూహ్యంగా బుధవారం సెలవు ప్రకటించడం వివాదాస్పదమైంది. ఎలాంటి కారణం లేకుండానే సెలవు ప్రకటించడం ఏంటని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిలదీస్తోంది. దీనిపై అధికార పక్షం వాదన ఒకలా, ప్రతిపక్షం కౌంటర్ భిన్నంగా ఉండడంతో చర్చనీయాంశంగా మారింది.
సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి మంగళవారం సభ సంతాపం తెలపనుంచి. సంతాప తీర్మానంపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను వాయిదా వేస్తారు. మరుసటి రోజు సభ జరగాలి. కానీ ప్రభుత్వం అనూహ్యంగా సెలవు ప్రకటించడం వివాదాస్పదమైంది.
ఎలాంటి అధికారిక సెలవు లేనప్పుడు, అసెంబ్లీకి మాత్రం ఎలా ఇస్తారనేది టీడీపీ ప్రశ్న. ఇందులో సహేతుకత ఉంది. మేకపాటి గౌరవార్థం సెలవు ప్రకటించామని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇలాంటి దాఖలాలు ఎన్నడూ లేవు. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టడం, సదరు నేత గురించి స్మరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కానీ సదరు నాయకుల గౌరవార్థం సెలవు ఇవ్వడం బహుశా ఇదే ప్రథమం.
బుధవారం సెలవు దినంగా ప్రకటించడానికి టీడీపీ చెబుతున్న కారణం మరోలా ఉంది.
'మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లి రిసెప్షన్ బుధవారం విజయనగరంలో ఉందని, అక్కడికి వెళ్లేందుకే సెలవు ఇచ్చారని టీడీపీ చెబుతున్న మాట. చట్టసభపై అధికార పార్టీకి ఏ మాత్రం గౌరవం ఉందో ఇదే నిదర్శనమని టీడీపీ విమర్శలు సంధిస్తోంది. వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు సెలవు ఇవ్వడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
ఇందుకు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును సాకుగా చూపడం ఏంటని టీడీపీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మంత్రి బొత్స కుమారుడి రిసెప్షెన్ కోసమే అసెంబ్లీకి సెలవు ప్రకటించి ఉంటే మాత్రం తీవ్ర తప్పిదమవుతుందని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. జగన్‌ను అభిమానించే వాళ్లు సైతం… బొత్స ఇంట్లో కార్యక్రమాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ సమావేశాలకు సెలవు ఇవ్వడం నిజమా?' అని అనుమానంతో సోషల్ మీడియాలో ప్రశ్నించడం గమనార్హం.