జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఉత్తరప్రదేశ్ ఫలితాలు ముకుతాడే వేసే అవకాశం ఉంది. ఎందుకనో ఆయన చంద్రబాబుపై ప్రేమను చంపుకోలేక, అలాగని ఏపీ బీజేపీతో సఖ్యతగా ఉండలేక, అలాగని మనసు చంపుకోలేక సతమతం అవుతున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేవైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పవన్‌కు అసలు గిట్టదు. జగన్ పేరు వినడానికే ఆయన ఇష్టపడరు.
2014లో ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ పార్టీగా జనసేనను స్థాపించానని పవన్‌కల్యాణ్ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ప్రశ్నించడం మానేసి, జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికి ఆదిలోనే అభిమానుల్ని నిరాశపరిచారు. 2019లో టీడీపీ, బీజేపీలతో విభేదించి, వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచి, చివరికి తాను నిలబడ్డ రెండు నియోజకవర్గాల్లో ఓటమి మూటకట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు వుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాజకీయ సమీకరణలపై పార్టీలు దృష్టి సారించాయి. బలమైన వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దించేయడం ఎలా? అని ప్రతిపక్షాలు తీవ్ర మథనం చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు శత్రువులకు కూడా వద్దు. జనసేనతో పొత్తు వుంటే తప్ప టీడీపీ బతికి బట్ట కట్టదనే నిర్ణయానికి ఆయన వచ్చారు. అందుకే పవన్‌కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు తపస్సు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభలో భవిష్యత్ కార్యాచరణ పవన్ ప్రకటిస్తారని జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అందుకే ఈ సభపై అందరి దృష్టి పడింది. ఉత్తరప్రదేశ్ ఫలితాలపై ఏపీలో పవన్ రాజకీయ వ్యూహం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటితో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నీ సర్వేలు చెబుతున్నాయి. దీంతో పవన్‌కల్యాణ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో కూడా బీజేపీతోనే కలిసి నడిచేందుకు మొగ్గు చూపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురు కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల చంద్రబాబును సీఎం చేయడం, ఆ పార్టీని బలపరిచినట్టు అవుతుందే తప్ప జనసేనకు వచ్చే లాభం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. తమ కూటమి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్‌కల్యాణ్ పేరునే ప్రకటిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీని శాశ్వతంగా దెబ్బతీస్తే తప్ప తమ కూటమి బలపడలేదని జనసేనానికి బీజేపీ నేతలు హితోపదేశం చేస్తున్నారని సమాచారం. పైగా పవన్‌కు జాతీయ స్థాయి బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయి.
ఏపీ వరకే పరిమితమై ఆలోచించకుండా, భవిష్యత్‌లో మోదీనే మరోసారి ప్రధాని అవుతారని, ఆ దృష్ట్యా బీజేపీతోనే కలిసి ప్రయాణిస్తే మంచిదని పవన్‌కు పలువురు సలహాలిస్తున్నారని సమాచారం. దేశంలో రోజురోజుకూ బీజేపీ బలోపేతం కావడం, మరోవైపు ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో …బీజేపీతోనే ప్రయాణించడం మంచిదనే అభిప్రాయాలు పవన్‌కు పెద్ద సంఖ్యలో చెబుతున్నారని సమాచారం. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 14న పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెబుతున్నారు.
కేవలం జగన్ మాత్రమే తన టార్గెట్ అనుకుంటే, అప్పుడు పవన్ కార్యాచరణ టీడీపీకి సంతోషాన్ని ఇచ్చేలా ఉంటుందని మరికొందరి వాదన. విశాల దృక్పథంతో ఆలోచిస్తే మాత్రం పవన్‌కు ఇప్పుడు కాకపోయినా, 2029 నాటికి మంచి భవిష్యత్ ఉంటుందని మెజార్టీ అభిప్రాయం. ఇలాంటి అనేక రకాల ప్రచారాలు, అభిప్రాయాల నేపథ్యంలో పవన్ మనసులో ఏముందో అనే ఉత్కంఠ అందరిలో నెలకుంది. దానికి ఆయన మరో ఐదారు రోజులు తెరదించనున్నారు.