ఎన్నికలంటే యుద్ధమే. బ్యాలెట్ పోరులో ప్రజల హృదయాలను గెలవాల్సి వుంటుంది. ప్రజాస్వామ్యంలో పోరు అంటే చిన్న విషయం కాదు. ప్రజల విశ్వాసం చూరగొనాలంటే ఒకరోజుతో పనికాదు. సుదీర్ఘ కాలం పాటు వారి కోసం తామున్నామనే నమ్మకం కలిగించేందుకు తమను తాము అర్పించుకోవాల్సి వుంటుంది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో విజేతలుగా నిలిచిన వాళ్లనే చరిత్ర గుర్తించుకుంటుంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం అధికారం.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజా క్షేత్రంలో వారి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు తన టీంను సిద్ధం చేస్తున్నారు. బలమైన కేడర్ కలిగిన ప్రతిపక్షాలతో యుద్ధం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకు తన ఎమ్మెల్యేలు, ఎంపీలను సమాయత్తం చేస్తున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన సమాయత్తం అవుతున్నారు.
మంత్రి వర్గంతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారనేందుకు ఆయన మాటలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘రాబోయే రెండేళ్లు ప్రజల్లోనే ఉందాం. ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి. గడగడపకూ వెళ్లి జనంతో మమేకమవుతూ…ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిద్దాం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరిద్దాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో వైఎస్సార్‌ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానని జగన్ చెప్పారు.
గతంలో ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు విన్నవించారు. జగన్ విన్నపాన్ని మన్నించి ప్రజలు పట్టం కట్టారు. రానున్న ఎన్నికల్లో జగన్ పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. గతంలో ‘నేను ఉన్నాను….నేను విన్నాను‘ అనే నినాదంతో జగన్ ప్రజల మనసుల్ని చూరగొనే ప్రయత్నం చేశారు. ఈ దఫా అలా నినదించడానికి వీల్లేదు. ఎందుకంటే పాలకుడిగా ప్రజలకు మంచి చేశారా? చెడు చేశారా? అనేది ఓటర్లు తేల్చుతారు.
సంక్షేమం తప్ప అభివృద్ధికి జగన్ పాలనలో చోటు లేదనేది బలమైన విమర్శ. చిన్నచిన్న అవసరాలను కూడా తీర్చేందుకు ఖజానాలో డబ్బు లేదనే సంగతి ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే సంక్షేమ పథకాల రూపంలో తమకు అందుతున్న ఆర్థిక లబ్ధి ఆగిపోతుందనే భయం సామాన్యుల్లో మొదలైతే మాత్రం ప్రతిపక్షాలకు సినిమానే.
అలా కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య రాజకీయ ఏకీకరణ జరిగితే మాత్రం ఏపీలో అధికార మార్పిడికి అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం గతంలో తానిచ్చిన హామీలను నెరవేర్చానని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
మధ్యతరగతి, తటస్థులు, ఉద్యోగులు, ఉన్నత వర్గాల్లోని అసంతృప్తిని జగన్ ఎదుర్కోవడం పెద్ద టాస్కే. సంప్రదాయంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అదే జగన్ ధైర్యం, భరోసా. అధికారంలోకి వచ్చినప్పటికీ తమకు ఒరిగింది శూన్యమని వైసీపీ శ్రేణులు ఆవేదనతో ఉన్నాయి. వారి అసంతృప్తిని పోగొట్టి 2024లో జరగనున్న అతిపెద్ద యుద్ధానికి సన్నద్ధం చేయాల్సి వుంది.
రానున్న రోజుల్లో జగన్ సెకెండ్ చాన్స్ ఫ్లీజ్ అని జనంలోకి వెళ్లనున్నారు. ఒక్కసారి జగన్ జనంలోకి వెళితే, అసంతృప్తి పోతుందనేది వైసీపీ అధిష్టానం ధీమా. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని కదన రంగానికి ఎలా సమాయత్తం చేస్తారో జగన్ మేధస్సుపై ఆధారపడి ఉంది.