ఆయన సినీ మాయామశ్చీంద్ర

ఆయన పేరు విఠలాచార్య. ఓ తరం సినిమాను తన దారిలో నడిపిన దర్శకుడు. సాంకేతికత అంతంత మాత్రంగా వున్న రోజుల్లోనే వెండితెర మీద అద్భుతాలు చూపించిన సినీ జ్ఙాని. కథను తన చిత్తానికి నడిపి…

ఆయన పేరు విఠలాచార్య. ఓ తరం సినిమాను తన దారిలో నడిపిన దర్శకుడు. సాంకేతికత అంతంత మాత్రంగా వున్న రోజుల్లోనే వెండితెర మీద అద్భుతాలు చూపించిన సినీ జ్ఙాని. కథను తన చిత్తానికి నడిపి కూడా ప్రేక్షకుడి కళ్లకను తెరకు కట్టేసే కనికట్టు చేసిన మాంత్రికుడు. ఒకటా రెండా… ఎన్ని సినిమాలో. కన్నడనాట పుట్టి, తెలుగు సినిమాను తన స్వంతం చేసుకున్న ప్రతిభాశాలి.

సినిమా జనాల మీద పుస్తకాలు తక్కువగా వస్తాయి. అలా వచ్చిన వాటిలో నూటికి తొంభై భజన పుస్తకాలు వుంటాయి. ఈ హీరో ఇంత పొడవు.. అంత లావు.. ఆ హీరో ఇంత తురుము.. అంత తోపు అనే పుస్తకాలు వేసి.. స్వామి కార్యం.. స్వకారం నెరవేర్చుకునే వ్యవహారాలే ఎక్కువ. అంతే తప్ప ఆ తరం జనాల గురించి, ముఖ్యంగా అద్భుతమైన పనితనం కనబర్చిన సాంకేతిక ప్రతిభామూర్తుల గురించి ఈ తరం జనాలకు పరిచయం చేసే ప్రయత్నాలు తక్కువ. ఎందుకంటే అలాంటి వాటికి స్పాన్సర్లు దొరకరు కదా. పాపులర్ హీరోల భజన పుస్తకాలు అయితే సులువుగా పని జరిగిపోతుంది.

కానీ రచయిత పులగం చిన్నారాయణ ఆ కోవకు చెందిన రచయిత కమ్ జర్నలిస్ట్ కాదు. ఆయన రాసిన పుస్తకాలు దాదాపుగా అన్నీ ఇలాంటివే. జంధ్యామారుతం అంటూ జంధ్యాల మీద, స్వర్ణయుగ సంగీత దర్శకులు అంటూ అలనాటి సంగీత చక్రవర్తుల గురించి ఇలా టచ్ చేసి అందించిన ప్రతి పుస్తకానికి ఓ పర్పస్ వుంది. దాని వెనుక నాలుగు ఆర్టికల్స్ ఏదో మ్యాగ్ జైన్ నుంచి కట్ చేసి దాచుకుని, గుదిగుచ్చేసిన చాకచక్యం కాకుండా, రోజుల తరబడి దాని మీద శ్రమించిన ఆనవాళ్లు వున్నాయి.

సరే.. అవన్నీ వదిలేసి జై విఠలాచార్య పుస్తకం దగ్గరకు వస్తే..

నాలుగు పదుల సినిమాలు అందించిన ఓ దర్శకుడి గురించి అయిదు వందలకు పైగా పేజీల పుస్తకం అందించడానికి మ్యాటర్ ఏముంటుంది? నాలుగు పదుల సినిమాల గురించి రాసినా మహా అయితే మూడేసి పేజీల వంతున 120 పేజీలు చాలు. పలువురి అభిప్రాయాలు జోడించిన, ఎంత నింపినా మహా అయితే రెండు వందల పేజీలు దాటవు. మరి ఇంతకీ పులగం ఈ అయిదు వందలకు పైగా పేజీలను ఎలా నింపారు? దేనితో నింపారు.

పేపర్ కటింగ్ లతో, సేకరించిన ఆర్టికల్స్ ఎంత మాత్రం కాదు. విఠలాచార్య గురించి పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి తనకు తాను చేసుకున్న ఇంటర్వూలతో..

అలా అని ఈ ఇంటర్వూలు అన్నీ దారినపోయే దానయ్యలతో కాదు. ప్రతి ఓక్క ఇంటర్వూకి ఓ పర్సప్ వుంది. అలాంటి ప్రముఖులతో ఇంటర్వూ చేయాలంటే చాలా శ్రమ, ఓపిక కావాలి. విఎకె రంగారావు, కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి, ఏచూరి లాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎడిటర్ మోహన్, విఠలాచార్య కుమారులు, కూతుర్లు, ఇలా చాలా అంటే చాలా. వీటివల్ల చాలా అరుదైన విషయాలు, అప్పటి కాలమాన పరిస్థితులు, సినిమాల మీద అవగాహన కలుగుతాయి అన్నది గ్యారంటీ.

అన్నింటికన్నా కీలకమైనది విఠలాచార్య కుమారుడి ఇంటర్వూ.. అది చాలు. మొత్తంగా విఠలాచార్య గురించి తెలుసుకునేందుకు. విఠలాచార్య మరణానికి రెండు రోజుల ముందు నంచి మరణించిన రోజు వరకు జరిగిన సంగతులు తెలుసుకుంటే చాలు.. ఆయన మనసు లోతు తెలుసుకోవడానికి, మనిషిగా ఎంత గొప్పగా ఆలోచించేవారో తెలియడానికి.

ఇక ప్రతి సినిమా కథ, విశేషాలు, పాటలు, ఇంకా ఇంకా అవన్నీ అదనపు సమాచారం. ఆ విశేషాలు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా వుంటాయి. చదవించేలా వుంటాయి. అంతే తప్ప ఆవు వ్యాసాల మాదిరిగా కాదు.

పుస్తకాలు చదవే అలవాటు, పైగా కొని చదివే అలవాటు తగ్గిపోతున్న రోజులు ఇవి. ఎక్కడ ఫ్రీగా పీడీఎఫ్ దొరుకుతుందా అని గూగుల్ ను పట్టుకుని తెగ సతాయించే కాలం ఇది. అందువల్ల ఈ పుస్తకం పాఠకులకు ఎంత మేరకు చేరువ అవుతుందో మరి? కానీ ఒకసారి కొని కానీ, గైకొని కానీ చదివిన వారు మాత్రం అస్సలు డిస్సపాయింట్ కారు.