విశాఖ నుంచి ఏదో విధంగా జగన్ పాలన సాగిస్తారు అనే వార్తలు వచ్చేసరికి తెలుగుదేశం అను’కుల’మీడియా బెంబేలెత్తిపోతోంది. ఒకసారి రాజధాని రుచి చూసిన తరువాత విశాఖ జనాలు మారిపోతారేమో? అమరావతికి మద్దతు ఇవ్వరేమో అని భయపడిపోతోంది. దాంతో తమ చిత్తానికి ఇష్టం వచ్చినట్లు కథలు అల్లుతోంది. అన్ని కథల పరమార్థం ఒక్కటే. విశాఖ రాజధాని కాకూడదు. వాళ్ల అమరావతి మాత్రమే రాజధానిగా వుండాలి. అమరావతి రాజధాని అయితే అద్భుతం. అదే విశాఖ రాజధాని అయితే చాలా దారుణం.
ఎంత చిత్రమైన కథనాలు వుండుతున్నారు అంటే…
రాజధాని కోసం వందల కోట్లు ఖర్చు చేసి భవనాలు నిర్మించేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి అదే విధంగా వందల కోట్లకు బదులు వేల కోట్లు ఖర్చు చూపించి అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టినపుడు ఏమయింది ఈ కథనాలు వండి వార్చే చాతుర్యం.
ఏ ముఖ్యమంత్రి హయాంలో ఏం కట్టినా, అది ఆయన స్వంత ఆస్తి కాదు కదా.. చాప చుట్టినట్లు పట్టుకెళ్లిపోరు కదా. ప్రభుత్వ భవనాలుగానే వుంటాయి కదా. చంద్రబాబు మాదిరి ప్రయివేటు భవనాల్లో వుంటూ ప్రభుత్వ డబ్బు ఆ భవనాలకు దోచిపెడితే తప్పు కానీ, ప్రభుత్వ ఆస్తులు అభివృద్ది చేస్తే సమస్య ఏమిటి?
అందుకే ఓ కొత్త కథనం వండారు. రుషికొండ పై కట్టిన పర్యాటక భవనాన్ని అమలులో వున్న నిబంధనల ప్రకారం 33 ఏళ్లు లీజుకు ఇవ్వవచ్చు అంట. జగన్ అదే విధంగా తనకు నచ్చిన వారికి దాన్ని లీజుగా ఇచ్చేసి, ఆ విధంగా తను అనుభవించడానికి మాస్టర్ ప్లాన్ వేసారేమో కాదు.. కాదు.. వేస్తారేమో అన్న అనుమానం అంట.
అంటే దీని పరమార్థం ఒక్కటే. జగన్ రుషికొండను ఆక్రమించేసి స్వంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడనే అనుమాన బీజాలు ఉత్తరాంధ్ర, విశాఖ జనాల మనసుల్లో నాటాలి. ఆ విధంగా రాజధాని వస్తోంది తమకు అన్న భావన వారి మనసుల్లో కలగకుండా చేయాలి.
విశాఖ, ఉత్తరాంధ్ర జనాలు అమాయకులు కనుక వీరి ఆటలు సాగుతున్నాయి. అదే కనుక వాళ్లు వీధుల్లోకి వచ్చి, మాకు ఎందుకు రాజధాని వద్దు.. మీ అమరావతికే ఎందుకు కావాలి. మీకు రాజధాని వస్తే అది గొప్ప విషయమా? మాకు రాజధాని వస్తే అంతా దారుణంగా మారిపోతుందని టముకు వేస్తారా? అని నిలదీసి వుంటే ఈ పరిస్థితి వుండేది కాదు.
దశాబ్దాల కాలంగా విశాఖ, ఉత్తరాంధ్ర మీద పడి, వేలాది ఎకరాలు, వ్యాపారాలు, రాజకీయ పదవులు అనుభవిస్తూ కూడా, అదే విశాఖను రాజధానికి దూరంగా వుంచాలనే దరిద్రపు బుద్ది వున్న సామాజిక వర్గ కుట్ర ఇది.. కాదంటారా?
కానీ ఇంకా నాలుగు నెలల సమయం వుంది. ఏదో విధంగా జగన్ వచ్చి విశాఖలో కూర్చుని, పాలన సాగిస్తే, జనాలకు వాస్తవం బోధపడుతుంది. సీఎం ఇక్కడే వుంటే శాంతి భద్రతలు మరింత కట్టుదిట్టంగా వుంటాయి. అధికారులు అంతా అప్రమత్తంగా వుంటారు. అందుబాటులో వుంటారు. మరింత అభివృద్ది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ వుందో, వివిధ సంస్థలు ఇక్కడికే వస్తాయి.
అప్పుడు ఉత్తరాంధ్ర, విశాఖ జనాలకు అర్థం అవుతుంది. ఇన్నాళ్లూ ఈ కుల మీడియా సాగించింది కేవలం దుష్ప్రచారం అని, వాళ్లకు విశాఖ మీద, ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదని, అంతా లోపల ద్వేషం పెట్టుకుని, పైకి ప్రేమ నటిస్తున్నారని. ఆ రోజు రావాల్సి వుంది.