ఆడ, మగ మధ్యన స్వచ్ఛమైన స్నేహం అంటూ ఏదీ ఉండదని, తాము స్వచ్ఛమైన ఫ్రెండ్స్ మని ఎవరైనా ఆడమగ చెప్పుకుంటే, తమ మధ్యన లైంగికార్షణ అంటూ ఏదీ లేదని అంటే.. వారిలో ఎవరో ఒకరు అబద్ధమైనా చెబుతూ ఉండాలి లేదా వారి మానవాతీతులు అయినా అయి ఉండాలని అంటాడు ఒక రచయిత! మరి ఇది ఆ రచయిత అభిప్రాయమే అనుకోవాలి. చాలా మంది అబ్బాయిల వైపు నుంచి చూస్తే.. లైంగికార్షణను మనసులో పెట్టుకుని కూడా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అనే మాటను వారు అవసరానికి ఉపయోగిస్తూ ఉంటారు. తమది ఫ్రెండ్షిప్ అని ఒక ముసుగు తొడిగి మాటామంతీ కలపడానికి అవకాశాన్ని వాడుకునే వారూ కోకొల్లలు. ఇలా అబ్బాయిల వైపు నుంచి చూస్తే.. ఏదో రకమైన ఆకర్షణ తప్ప స్వార్థం లేని స్నేహం తక్కువే!
అలాగే ఫ్రెండ్స్ మనే వాళ్లు నెమ్మదినెమ్మదిగా లవ్ లోకి టర్న్ కావడమూ పెద్ద వింత కాదు! లేదా కనీసం ఫ్రెండ్షిప్ సాగిన తర్వాత అబ్బాయి వైపు నుంచి ప్రపోజల్ వచ్చిన ఫ్రెండ్షిప్ స్టోరీలూ బోలెడు ఉంటాయి. మరి అలా కొంతకాలం ఫ్రెండ్స్ గా చలామణి అయ్యో భార్యాభర్తలు అయిన వారు, లేదా ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తిదాయకమైన అంశం.
బెస్ట్ ఫ్రెండ్ గా అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. అబ్బాయికి బోలెడన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశమూ ఉంది. ఒకవైపు తనకు బాగా తెలిసిన అమ్మాయిని, తను మనసెరిగిన అమ్మాయిని, తన మనసెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో కొంత సుఖముంది. అయితే ఆమెకు ఫ్రెండ్ నంటూ కొంత ఇమేజ్ ను సృష్టించుకున్న తర్వాత భర్తగా మారితే.. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు తెచ్చుకున్న ఇమేజ్ ను దీర్ఘకాలం నిలబెట్టుకోవడమూ కీలకమే! లేకపోతే అప్పటి వరకూ ఫ్రెండ్ గా చూపింది నకిలీ మనస్తత్వం అనే విషయం ఆమెకు క్లారిటీ వచ్చి చులకన అయ్యే అవకాశమూ ఉండవచ్చు!
మరి ఇలా పెళ్లి చేసుకున్న.. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన.. ఉండే మొదటి ప్రాబ్లమ్ హై ఎక్స్ పెక్టేషన్స్ అని అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. నిజంగానే వారు ఫ్రెండ్స్ గా మొదట్లో పరిచయం అయ్యి, ఒక దశ దాటాకా వారి స్టోరీ లవ్ గా టర్న్ తీసుకుని ఉంటే.. పెళ్లి వరకూ వెళ్లాకా.. పరస్పరం చాలా ఎక్స్ పెక్టేషన్స్ ను కలిగి ఉంటారనేది నిపుణుల మాట. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను మనసులో పెట్టుకుని, వారితో జీవితం అలా ఉంటుందనే లెక్కలతోనే వారు ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారు. ఏ మాత్రం తేడా కొట్టినా..ఈ ఎక్స్పెక్టేషన్స్ కు పరస్పరం రీచ్ కాకపోయినా.. చాలా దిగులు చెందే అవకాశాలుంటాయి!
మిస్టరీ లేకపోవడం మరో ప్రాబ్లమ్. పెళ్లికి ముందు తన జీవితం, తన ఆసక్తులు, ఇష్టాలు ప్రతిఒక్కటీ ఫ్రెండ్షిప్ ద్వారా తెలిసిపోవడంతో.. ప్రత్యేకించి పెళ్లి తర్వాత పరస్పరం తెలుసుకునే విషయాలు ఏమీ ఉండవు! ఇలాంటి బంధాల్లో ఈ ఎలిమెంట్ పూర్తిగా మిస్ అవుతుంది. అన్నీ తెలిసినవే అన్నట్టుగా ఉంటే.. ప్రత్యేకమైన ఎగ్జయిట్ మెంట్ వచ్చే అవకాశాలు ఉండవు. పరస్పరం ఉండే మిస్టరీలు కొత్తగా పెళ్లైన కొంతకాలాన్ని ఆసక్తిదాయకంగా మలుస్తాయి. అయితే ఇలాంటి వారికి ఆ అవకాశం ఉండకపోవచ్చు!
ఇక లైంగికార్షణ కూడా కీలకమైన అంశం. ఒకవేళ ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు లేదా ఆ పరిచయమే లైంగికార్షణ వల్లా కలిగినది అయితే ఫర్వాలేదు! ఫ్రెండ్స్ కాబట్టి పెళ్లి చేసుకున్నామనే వాళ్లలో పరస్పరం లైంగికార్షణ కూడా ఎంత వరకూ రసవత్తర స్థాయికి చేరుతుందనేది ప్రశ్నార్థకమే! ఫ్రెండ్ గా మాత్రమే ఫీల్ అయిన వారిని పెళ్లి చేసుకున్నాకా.. లైంగికార్షణను కూడా కల్టివేట్ చేసుకోవాల్సి రావొచ్చు! అయితే అబ్బాయిలు అమ్మాయిలతో చేసే ఫ్రెండ్షిప్ లు చాలా వరకూ మొదలయ్యేది లైంగికార్షణతోనే అనేది ఒక నిష్టూరమైన సత్యం!
గతంలో తమ మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ కు అతిగా విలువను ఇస్తూ వైవాహిక జీవితాన్ని గడపాల్సి వచ్చినా, లేదా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రవర్తించినా.. రిలేషన్ షిప్ లో ఇబ్బందులు రావొచ్చు! ఇలాగని స్నేహం చేసిన ఆడ, మగ పెళ్లి చేసుకోకూడదని ఎవ్వరూ బల్లగుద్దలేరు! అబ్బాయిల్లో అమ్మాయిలతో స్నేహం చేసే ఉద్దేశం వెనుకే.. ఒక వెడ్డింగ్ ప్లానింగ్ ఉంటుంది కదా!