ప్రీ ప్లాన్డ్ గానే పవన్ కామెంట్లు?

జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన కళ్యాణ్ ఒక్కసారిగా తనకు సంబంధం లేని వ్యక్తి మీద, వ్యక్తుల మీద అర్థం లేని కామెంట్లు చేసారు. పూర్తిగా వ్యక్తిగతానికి మించిన దాడి చేసారు. కేవలం ఓ వ్యక్తి…

జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన కళ్యాణ్ ఒక్కసారిగా తనకు సంబంధం లేని వ్యక్తి మీద, వ్యక్తుల మీద అర్థం లేని కామెంట్లు చేసారు. పూర్తిగా వ్యక్తిగతానికి మించిన దాడి చేసారు. కేవలం ఓ వ్యక్తి పేరు పట్టుకుని కామెంట్ చేసే స్థితికి దిగజారిపోయారు. 

నిజానికి పవన్ ఉద్దేశం ఏమిటి? సిఎమ్ జగన్ కు ఓ అల్టిమేటమ్ ఇవ్వాల్సివుంది. దాన్ని నేరుగా ఇవ్వొచ్చు. కానీ అలా ఇవ్వకుండా నాని, ఏ నాని? బోలెడు మంది నానీలు, శతకోటి లింగాల్లో ఓ బోడిలింగం అనే వరకు వెళ్లారు. నిజానికి ఏనాని? బోలెడు మంది నానీలు వైకాపాలో వున్నారు అన్నంత వరకు ఓకె. కానీ ఏ నాని అయితేనేం, శతకోటి లింగాల్లో బోడిలింగం అనడం పూర్తిగా అసంబద్దం.

అప్రస్తుతం ప్రసంగం. పైగా సదరు నానికి పవన్ కు అస్సలు వ్యక్తిగత, రాజకీయ వైరం ఏమీ లేదు కూడా. మరి ఈ అసందర్భ మాటలు పవన్ ఎందుకు మాట్లాడినట్లు? ఎవరైనా కళ్యాణ్ ఎవరు? సి కళ్యాణ్ నా? కళ్యాణ్ రామ్ నా? బోలెడు మంది కళ్యాణ్ లు వున్నారు టాలీవుడ్ లో అనే విధంగా మాట్లాడితే ఎంత అసహ్యంగా వుంటుంది. పవన్ మాటలు అచ్చం అలాగే వున్నాయి.

పవన్ తన అసందర్భపు మాటలు మాట్లాడి తన గూట్లోకి తాను వెళ్లిపోయారు. ఆ తరువాత ఏమయింది? వైకాపా జనాలు అంతా అటాక్ అంటూ పవన్ మీద పడ్డారు. మాటల తూటాలు విసిరారు. నిజానికి 'అవో పిచ్చి మాటలు, అసందర్భపు ప్రసంగం' అని కొట్టిపారేసి వుండొచ్చు. కానీ పవన్ లాంటి వ్యక్తి తన చిత్తానికి తాను మాటలు విసిరి, తన గూట్లోకి పోతానంటే మాటలు పడ్డవారు ఎందుకు ఊరుకుంటారు? అందుకే తిరగబడ్డారు.

అయితే ఇక్కడ గమనిస్తుంటే, పవన్ కు కావాల్సింది కూడా ఇదే. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి, సెల్ఫ్ స్టయిల్డ్ పార్టీ పెట్టుకుని, నాయకుడిగా చలామణీ అవుతున్నారు. అలా అని ఆ పార్టీకి కమిటీలు లేవు, కార్యవర్గాలు లేవు. దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. దాని భాగస్వామ్య పార్టీ భాజపానే దాన్ని పక్కన పెట్టేసింది. దాని మానాన దాని కార్యక్రమాలు అది చేసుకుంటోంది. 

తనకు బోలెడు బలం వుంది తిరుపతి సీటు ఇవ్వమంటే, కనీసం సమాధానం కూడా చెప్పలేదు. విజయశాంతి ఢిల్లీ వెళ్తే కలిసిన భాజపా పెద్దలు పవన్ వెళ్తే పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ భాజపాకు తేదేపాకు మధ్యలో అవసరం అయినపుడు లింక్ కింద ఉపయోగపడాల్సిన అగత్యం వుంది కాబట్టి, పవన్ ఈ అవమానాలు అన్నీ దిగమింగుతూ భాజపాతో అంటకాగుతున్నారు.

మరి ఇలాంటపుడు అటెంక్షన్ ఎలా గ్రాబ్ చేయాలి? సరైన వాడిని టార్గెట్ చేస్తేనే కదా, అందరి దృష్టి అటు మళ్లుతుంది. పైగా సదరు నాని తరచు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. దానికి పవన్ తన వంతు బాధ్యత గా సమాధానం చెప్పాలి కదా? అది ఆయనకు అవసరం. అందుకే రెండు పనులు ఒకేసారి జరిగేలా సమాధానం చెప్పేసారు. పవన్ కు కావాల్సింది అదే. ఒక్కసారిగా మీడియాలో పవన్ మీద విమర్శలు కనిపిస్తాయి. పవన్ అనే పేరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది.

ఇక్కడ అసలు పాయింట్ ఇంకొకటి వుంది. ఈ మధ్యనే బాబుగారి హితవు సదా కోరే ఎబిఎన్ ఆర్కే ఏం రాసారు? చంద్రబాబును మూడో ప్లేస్ లోకి నెట్టేసి,భాజపా రెండో ప్లేస్ లోకి రావాలని, తనే సరైన ప్రతిపక్షం అనిపించుకోవాలని చూస్తోంది అంటూ బోలెడు లాజిక్ లెస్ మాటలు రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పవన్ ఈ విధంగా టార్గెట్ చేయడం వెనుక ఆ వ్యూహం కూడా దాగివుంది.

వైకాపాను గట్టిగా టార్గెట్ చేసి, తను కూడా రేస్ లో వున్నానని, తాను అపోజిషన్ లీడర్ నే అని, తనదీ అపోజిషన్ పార్టీనే అని పవన్ ఓసారి జనానికి గుర్తుచేయాలనుకుంటున్నారు. ఆ విధంగా భాజాపాకు ఓ హెచ్చరిక, ఓ పోటీ లాంటిది జారీచేయాలనుకున్నారు. భాజపాను మించి వైకాపాను టార్గెట్ చేస్తే, తాను దాని కన్నా మోర్ యాక్టివ్ అనిపించుకోవచ్చు అని పవన్ ఆలోచనగా కనిపిస్తోంది.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, సరైన విధంగా టార్గెట్ చేయడం మాత్రం ఆయనకు చాత కావడం లేదు. కొడాలి నానిపై మాటల తూటాలు విసరాల్సిన అవసరం ఇప్పుడేముంది? అలా అని ఆయనపై విమర్శలు చేసారా? ఏమైనా విషయాలు ఎత్తి చూపారా? అదేమీ లేదు, జస్ట్ పేరు పట్టుకుని, వ్యక్తిగత విమర్శ. అదే విధంగా తానంటే వైకాపా భయపడుతోందని ఆయనకు ఆయనే అనేసుకోవడం. ఆ విధంగా తనను తాను పెద్దగా చేసి చూపించాలని భ్రమల్లో బతకడం.

నిజానికి పవన్ ఈ కామెంట్లు చేసే వరకు ఆయనను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను ఎవ్వరూ సినిమాలు చేయవద్దని అనలేదు. ఆయనే మానేసాను అన్నారు. ఆయనే చేస్తున్నారు. దానిని జనం ఎక్కడ తప్పు పడతారోఅని, ఆయనకు ఆయనే తనకు పేపర్ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు అంటూ కవర్ చేసుకోవడం. 

తనను ఎవ్వరూ పట్టించుకోకున్నా, తనంటే భయపడుతున్నారంటూ తనకు తానే బీరాలు పోవడం. ఇవన్నీ ఓ విధమైన అటెంక్షన్ కోసం పవన్ పడుతున్న పాట్లను ఎత్తి చూపిస్తాయి. కిందపడిపోయినా, లేదు కావాలనే కిందకు జారా అంటూ బీరాలు పోయే కమెడియన్ మాదిరిగా వుంది పవన్ వ్యవహారం అంతా.

ఇవన్నీ ఎలాగైనా తను ప్రతిపక్షంగా వున్నాను అని చాటి చెప్పడం కోసం పవన్ పడుతున్న అగచాట్లు. ఎక్కడ భాజపా ప్రధాన ప్రతిపక్షంగా మారిపోతుందో, దాని నీడలో తాను కనిపించకుండా పోతానేమో అన్న భయంతో పవన్ పన్నిన వ్యూహం ఇది,. దీనికి విరుగుడు ఒక్కటే పవన్ మాటలు అస్సలు పట్టించుకోకుండా, బదులివ్వకుండా వదిలేయడం. రెండు చేతులు కలిస్తేగా సౌండ్..లేదంటే అజ్ఞాతవాసి సినిమా మాదిరిగా చడీ చప్పుడు లేకుండా అయిపోతుంది వ్యవహారం.

నిజానికి పవన్ చేత ఎవరు తెరవెనుక ఆడిస్తున్నారో జనాలకు ఇట్టే అర్థం అయిపోతోంది. కొడాలి నాని ని కాకుండా మరెవర్ని టార్గెట్ చేసి వున్నా, వేరుగా వుండేది. కానీ చంద్రబాబు మీద ఘాటు పదజాలతో విరుచుకుపడే కొడాలి నాని ని బోడిలింగం అంటూ పవన్ ఎటువంటి అకేషన్ ఎటువంటి రిలేషన్ లేకుండా టార్గెట్ చేసినపుడే జనాలకు అర్థం అయిపోయింది. ఇంతా వయా మీడియా దాడి తప్ప, వేరుకాదు అని. దాంతో పవన్ ను కిట్టని వాళ్లు పేర్కొనే ప్యాకేజ్ స్టార్ అనే గ్యాసిప్ కు మరింత బలం చేకూరుతోంది.

చంద్రబాబు అంటే కిట్టని భాజపాతో పొత్తు పెట్టుకుని కూడా మళ్లీ చంద్రబాబు ఎజెండానే పవన్ తన భుజాన మోయడం అంటే ఏమనుకోవాలి? పవన్ ను భాజపాకు దగ్గర చేసింది చంద్రబాబే అనే మాటలకు మరింత బలం చేకూరుతోంది. పైగా కొడాలి నానిని ఆయన సామాజిక వర్గం వారు కాకుండా పవన్ చేత టార్గెట్ చేయించడం వెనుక కూడా బలమైన వ్యూహం వుంది. 

వైకాపాకు కాపులను దూరం చేసే యత్నమే అది తప్ప వేరు కాదు. కానీ వైకాపాలో కాపులు బలమైన స్థానంలో వున్నారు. అందువల్ల వారి ఓటు బ్యాంకును వైకాపాకు దూరం చేయడం అంత వీజీ కాదు. కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ కు అనుకూలంగా వుంటే ఆయన రెండు చోట్ల ఓడిపోయిన ఘనతను ఎలా సాధించి వుంటారు?

నిజానికి పవన్ కు డ్రామా చేయడం చాతకాదు. అలా చేతనయితే చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నారు అనే ఫీలింగ్ రాజకీయాలు పరిశీలించేవారిలో కలిగేది కాదు. పవన్ కు అందుతున్న డైరక్షన్ రాంగ్ కావచ్చు. లేదా ఆ డైరక్షన్ కు అనుగుణంగా పవన్ కనబరుస్తున్న నటన తేలిపోతూ వుండోచ్చు. మొత్తానికి డ్రామా రక్తికట్టడం లేదు. ఎపిసోడ్ ఎపిసోడ్ కు పవన్ పరువు మరింత దిగజారుతోంది తప్ప ఆయన అనుకున్న దిశగా ఎగబాకడం లేదు.

చాణక్య

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క