బుల్లి రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ట‌ఫ్ ఫైట్!

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌క్రియ సాగుతున్న ఐదు రాష్ట్రాల్లోని.. గోవా, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ ల‌లో రెండు జాతీయ పార్టీల మ‌ధ్య‌న ప్ర‌ధాన పోటీ నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. పోస్ట్ స‌ర్వేల ప్ర‌కారం.. ఐదు రాష్ట్రాల్లో, బీజేపీ,…

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌క్రియ సాగుతున్న ఐదు రాష్ట్రాల్లోని.. గోవా, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ ల‌లో రెండు జాతీయ పార్టీల మ‌ధ్య‌న ప్ర‌ధాన పోటీ నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. పోస్ట్ స‌ర్వేల ప్ర‌కారం.. ఐదు రాష్ట్రాల్లో, బీజేపీ, కాంగ్రెస్ లు ముఖాముఖి త‌ల‌ప‌డుతున్న‌ది ప్ర‌ధానంగా మూడు రాష్ట్రాల్లోనే.

యూపీలో బీజేపీ, స‌మాజ్ వాదీల మ‌ధ్య‌న ప్ర‌ధాన పోటీ ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ లు అధికారం కోసం త‌ల‌ప‌డుతున్నాయి. యూపీలో కాంగ్రెస్ రేంజ్ ఐదారు సీట్ల‌ను దాట‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా. పంజాబ్ లో బీజేపీ ప‌రిస్థితి అంత‌క‌న్నా మెరుగ్గా లేదు. 

అదే.. గోవా, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ ల‌లో మాత్రం రెండు జాతీయ పార్టీలు త‌ల‌ప‌డుతున్నాయి. గోవాలో ఈ రెండు పార్టీల న‌డుమా నువ్వా నేనా అనే పోటీ ఉంటుంద‌ని పోస్ట్ పోల్ స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. 

40 సీట్లున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 14 నుంచి 19 సీట్ల వ‌ర‌కూ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా. బీజేపీకి 12 నుంచి 18 సీట్ల వ‌ర‌కూ ద‌క్క‌వ‌చ్చ‌ని అంచ‌నా. అయితే కాంగ్రెస్  పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ క‌న్నా ఎక్కువ సీట్ల‌ను ద‌క్కించుకుంది. అయితే ఎమ్మెల్యేలను తిప్పుకోవ‌డం ద్వారా బీజేపీ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. ఫిరాయింపుదారుల‌తోనే ఐదేళ్లు బండి లాగించింది. కాంగ్రెస్ కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చినా, రాకున్నా అక్క‌డ బీజేపీ ఫిరాయింపు రాజ‌కీయాల‌కు కీ ఇవ్వ‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఇక ఉత్త‌రాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ లు గ‌ట్టిగా త‌ల‌ప‌డుతున్నాయి. 70 సీట్ల‌కు గానూ బీజేపీకి ముప్పై ఆరు నుంచి న‌ల‌భై ఐదు సీట్ల వ‌ర‌కూ ద‌క్క‌వ‌చ్చ‌ని కొన్ని స‌ర్వేలు చెబుతుండ‌గా, కాంగ్రెస్ కు ఇక్క‌డ ముప్పై ఐదు సీట్ల వ‌ర‌కూ ద‌క్క‌వ‌చ్చ‌ని మ‌రి కొన్ని స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి.

అర‌వై స్థానాలున్న మ‌ణిపూర్ లో బీజేపీకి మినిమం మెజారిటీ ద‌క్క‌వ‌చ్చ‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి, ఇక్క‌డ కూడా కాంగ్రెస్ కూట‌మి గ‌ట్టి పోటీ ఇవ్వ‌వ‌చ్చ‌ని అంచ‌నా.