ఎమ్బీయస్: రామానుజుడి ప్రభావం

రామానుజుడు పుట్టి వెయ్యేళ్లు అయిన సందర్భంగా హైదరాబాదులో పేద్ద విగ్రహం ఒకటి పెట్టారు. విగ్రహం సైజుకి అటూయిటూగా వివాదాలు కూడా వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు రామానుజుడి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి,…

రామానుజుడు పుట్టి వెయ్యేళ్లు అయిన సందర్భంగా హైదరాబాదులో పేద్ద విగ్రహం ఒకటి పెట్టారు. విగ్రహం సైజుకి అటూయిటూగా వివాదాలు కూడా వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు రామానుజుడి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, సమాజంపై ఆయన కలిగించిన ప్రభావం గురించి కాస్త తెలుసుకోవాలి. ఆయన గురించి పేపర్లలో, టీవీల్లో చాలా కథనాలే వచ్చాయి. కానీ మీరు సింపుల్‌గా రాయండి, సమతామూర్తి అంటే ఏమిటి? ఆయన దేవుడా? అవతారమా? క్లియర్‌గా చెప్పండి అంటూ చాలామంది అడుగుతున్నారు. మనలో చాలామందికి మన మతం గొప్పది అనే ఫీలింగు వుంది కానీ ఎందుకు గొప్పదో ఎవరైనా అడిగితే చెప్పలేం. అందుకని ‘ఇదే యింకో మతంలో యిలా అడిగితే తల తెగవేస్తారు తెలుసా?’ అని గొప్పలకు పోతాం. వాళ్ల సంగతి మనకెందుకు? మన మతం మౌలిక సిద్ధాంతాలేమిటి? సిద్ధాంతభేదాలేమిటి? వ్యక్తిగతంగా ఏది మనకు నచ్చుతోంది, యివన్నీ తెలుసుకునే ఓపికా లేదు, తీరికా లేదు.

అవన్నీ ఆలోచిస్తే, తర్కిస్తే దేవుడి మీద భక్తే పోతుంది బాబూ, ఏదో ఓ దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. మన మొక్కులు తీర్చేవాడే మన యిష్టదైవం అనే పద్ధతిలోనే జీవితం గడిపేస్తున్నాం. అప్పుడప్పుడు ప్రవచనకారులు చెప్పేది విని, చాలా తెలుసుకున్నాం అనుకుంటున్నాం. చిక్కేమిటంటే, మనకు వచ్చే సమాచారమంతా బిట్స్ అండ్ పీసెస్‌లో వస్తుంది. క్రానలాజికల్ ఆర్డర్‌ ఏమిటో, ఓ దేవుడికి మరో దేవుడికి లింకేమిటో ఏమీ తెలియదు. మన జ్ఞానంలో చాలా గ్యాప్స్ ఉంటాయి. అందువలన పిల్లలు వచ్చి సందేహాలడిగితే ‘నన్ను చంపకుండా అమర్ చిత్ర కథ పుస్తకాల్లో చదువుకో, లేదా యూట్యూబ్‌లో చూసుకో’ అని తరిమేస్తున్నాం. వాస్తవమేమిటంటే, ఇలాటి విషయాలు తెలియకపోయినా నష్టమేమీ లేదు. ఇంకొకరికి కష్టం కలిగించకుండా, వీలైనంత మంచిగా బతికితే చాలు.

పైకి వెళ్లాక దేవుడు ‘నీకు ఈశానోపనిషత్ తెలుసా? అర్థతాత్పర్యాలతో అప్పచెప్పు’ అని అడగడు. నువ్వు చేసిన మంచి లేదా చెడు పనుల బట్టే నీ స్థాయి నిర్ణయిస్తాడు. అందువలన ధర్మవిచారం (ధర్మాన్ని గురించిన చర్చ) కంటె ధర్మాచరణే ముఖ్యం. అయితే మరి యీ వ్యాసం ఎందుకు చదవడం అంటే యిది ఒట్టి ఎకడమిక్ డిస్కషన్ మాత్రమే. సరదా వుంటే చదవవచ్చు. లేకపోతే మానేయవచ్చు. పురాణం అంటే ఒక కథ ఉంటుంది. సంఘటనలుంటాయి. వేదాంత చర్చల్లో అవేమీ వుండవు. ఎందుకంటే మానవమాత్రుడెవరికీ పరమాత్మ గోచరించడు. అందువలన యిలా వుంటాడు, అలా వుంటాడు, అతని స్వభావం యిదీ అంటూ ఉపమానాలిస్తూ చర్చిస్తారు. ఈ మెంటల్ ఎక్సర్‌సైజుతో తలనొప్పి వస్తుంది. పుస్తకం మూసేసి పక్కన పెట్టేస్తాం. ఈ విషయం తెలుసు కాబట్టి, నేను క్లుప్తంగానే చెప్తాను.

మొదటగా ఒక క్లారిఫికేషన్. మౌలికమైన దేవుళ్లు వేరు, పురాణపురుషులు వేరు. రాముడు, కృష్ణుడు దేవుళ్లే కానీ వాళ్లు విష్ణువు అవతారాలు. వాళ్లకు పుట్టుక ఉంటుంది. వినాయకుడికి, కుమారస్వామికి.. వీళ్లందరికీ పుట్టిన తేదీ అనేది వుంది. కానీ మౌలిక దేవుళ్లయిన త్రిమూర్తులకు ఉండదు. వీరిలో బ్రహ్మ విష్ణువు నాభిలోంచి పుట్టాడు అని తెలుస్తుంది కానీ శివుడు, విష్ణువులకు  ఆది, అంతం లేవు. వీళ్లకు తొలి నుంచీ భక్తులు ఉన్నారు. శివుణ్ని పూజించేవాళ్లు శైవులు, విష్ణువును పూజించేవాళ్లు వైష్ణవులు. శివుడు, విష్ణువు వేర్వేరు కాదు, ఒకే దేవుడి యొక్క రెండు రూపాలని భావిస్తూ ఇద్దర్నీ పూజించేవాళ్లు చాలామందే ఉన్నారు. వీరశైవులు శివుడొక్కడే దేవుడు అంటారు, విష్ణువును పరిగణించరు. వైష్ణవులు శివుణ్ని దేవుడే కాదంటారు. రామానుజుడు వైష్ణవుడు. ఈయనే వైష్ణవమతాన్ని స్థాపించాడు అనుకోకండి. ఆయన కంటె ముందు నుంచీ అది వుంది. ఈయనది దానిలో ఒక శాఖ, దానికి శ్రీవైష్ణవం అని పేరు.

ఈయన ఒక మతాచార్యుడు. దేవుడు కాదు, దేవదూత కాదు. 120 ఏళ్లు బతికి నిర్యాణం చెందిన వ్యక్తి. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు విశిష్టాద్వైతం. దేవుడు, మనిషి మధ్య ఉన్న సంబంధం గురించి మనకు మూడు రకాల సిద్ధాంతాలున్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని. ఈ మూడు దక్షిణభారతం నుంచే పుట్టుకుని వచ్చాయి మొదటిదాన్ని కర్ణాటకకు చెందిన మధ్వుడు, రెండోదాన్ని కేరళకు చెందిన ఆదిశంకరుడు, మూడోదాన్ని తమిళనాడుకు చెందిన రామానుజుడు ప్రతిపాదించారు. అయితే యివి దేశమంతా ప్రాచుర్యం పొందాయి. అర్థం కావడానికి ఆ ఆర్డరులో చెప్పాను కానీ మొదట వచ్చినది ఆదిశంకరుడు (క్రీ.శ. 788-820) ప్రతిపాదించిన అద్వైతం, 200 ఏళ్ల తర్వాత వచ్చినది రామానుజుడు (క్రీ.శ.1017-1137) ప్రతిపాదించిన విశిష్టాద్వైతం, ఆ తర్వాత నూరేళ్లకు వచ్చిన మధ్వాచార్యుడు (క్రీ.శ. 1238-1317) ప్రతిపాదించిన ద్వైతం.

అన్నిటికంటె సులభంగా అర్థమౌతుంది కాబట్టి ద్వైతం గురించి మొదట చెప్తాను. ఇది మనం చిన్నప్పటినుంచి విని, నమ్మిన సిద్ధాంతమే. ‘దేవుడు (పరమాత్మ) వేరు, మనం (జీవాత్మ) వేరు. ఆదిశంకరుడు ప్రతిపాదించినట్లు జీవుడు, జగత్తు మిథ్య కాదు. పరమాత్మ ఎంత సత్యమో, జీవుడు కూడా అంతే సత్యం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా పరమాత్మతో భేదం కొనసాగుతుంది. అజ్ఞానం చేత జీవుడు తను కర్త అని, స్వతంత్రుడనని అనుకుంటాడు. అది భ్రాంతి. పరమాత్మ మాత్రమే కర్త. సత్కర్మ వలన మనసు పరిశుద్ధమై, అది జ్ఞానానికి దారి తీస్తుందని, తద్వారా మోక్షం లభిస్తుందని ఆదిశంకరుడు అన్నాడు కానీ అది తప్పు. తను కర్తను కాను అనే జ్ఞానం వలననే జీవాత్మ సత్కర్మలు చేయగలుగుతాడు. భక్తి ఒక్కటే ముక్తిదాయకం.’ ఇదీ మధ్వాచార్యులు చెప్పినది.

ఆదిశంకరుడు పరమాత్మను నిర్గుణ బ్రహ్మమని భావిస్తే, మధ్వుడు పరమాత్మ సగుణుడు అన్నాడు. విష్ణువు, నారాయణుడు, శ్రీహరి, వాసుదేవుడు, కృష్ణుడు వీరందరూ దైవస్వరూపాలే. ఈ జాబితాలో శివుడు లేడు. తన పంథాకు మధ్వాచార్యులు సద్ వైష్ణవం అని పేరు పెట్టుకున్నారు. విష్ణువు, భార్య లక్ష్మి. వారికి యిద్దరు పిల్లలు బ్రహ్మ, వాయువు. బ్రహ్మ సృష్టికర్త, వాయువు సంధానకర్త. వాయువు ద్వారానే మనకు ముక్తి కలుగుతుంది. ఆయన మొదటి అవతారం హనుమంతుడు. రెండో అవతారం భీముడు. మధ్వాచార్యులను భీముని అవతారంగా భక్తులు భావిస్తారు. ఆయన శారీరకంగా కూడా బలాఢ్యుడు. 79 ఏళ్లు బతికాడు. ఈయన మతం ఈయన పుట్టిన ఉడుపిలో (అక్కడే ఆయన మఠం, స్థాపించిన కృష్ణాలయం ఉన్నాయి), కర్ణాటకలోని యితర ప్రాంతాల్లో, పరిసరాల్లో ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కొద్దిగా వ్యాప్తి చెందింది. నాకు తెలిసి బ్రాహ్మణుల్లో మాత్రమే మాధ్వులు ఉన్నారు. మధ్వాచార్యుల శిష్యులైన రాఘవేంద్రస్వామి గురువు కంటె ఎక్కువ పాప్యులర్. మంత్రాలయంలోని ఆయన సమాధికి అన్ని సిద్దాంతాల వారూ, అన్ని కులాలవారూ వెళతారు.  రాఘవేంద్ర మఠాలు చాలా ఊళ్లలో వున్నాయి.

దీనికి విరుద్ధమైన సిద్ధాంతం అద్వైతం. చాలా ఏళ్ల క్రితమే ఆదిశంకరుడి రచనలైన భజగోవిందం, శివానందలహరి, సౌందర్యలహరి, యితర స్తోత్రాల గురించి రాస్తూ ఆయన జీవితం, అద్వైత సిద్ధాంతం గురించి విపులంగా రాశాను. ఇప్పుడు క్లుప్తంగా చెప్పేస్తాను. అద్వైతం అంటే రెండు కానిది – అంటే రెండుగా కనబడతాయి కానీ రెండు కాదు, ఒకటే అని నొక్కి చెప్పడానికి అ-ద్వైతం అని చెప్పారు. ద్వైతం అంటే దేవుడు వేరు, జీవుడు వేరు అనే సిద్ధాంతం. అది కానిది అద్వైతం. ఆదిశంకరుడు చెప్పినదాన్ని సిద్ధాంతాన్ని నాలుగే నాలుగు ముక్కల్లో చెప్పాలంటే – 1. బ్రహ్మ సత్యం 2. జగన్మిథ్య 3. జీవో బ్రహ్మైవ 4. నా పరః.

మొదటిది తీసుకుంటే బ్రహ్మ పదార్థం (పరమాత్మ) సత్యం, అది పారమార్థిక సత్యం. అల్టిమేట్‌ ట్రూత్‌. అది గుణరహితం. దానికి అవధులు లేవు, పరిమితులు లేవు. అది ఎలా వుంటుందో మనం చూడలేదు కాబట్టి అవును కాబోలు అనుకుని వూరుకుంటాం. రెండవ సూక్తి జగన్మిథ్య. జగత్తు మిథ్య! ఇక్కడే గొడవ వచ్చిపడింది. కంటికి కనబడేదాన్ని మిథ్య అని ఎలా అంటావు? అన్న ప్రశ్న వస్తుంది. సమాధానంగా చాలా తర్కం వుంది. కంటికి కనబడేదంతా వాస్తవం కాదు అని ముందు మనం ఒప్పుకోవాలి. భూమి స్థిరంగా వుందని, సూర్యుడే తూర్పున వుదయించి, పశ్చిమాన అస్తమిస్తున్నాడు అని మన కంటికి కనబడే వాస్తవం. కానీ సైంటిఫిక్‌ దృక్కోణంతో చూస్తే అది కరక్టు కాదు. సూర్యుడు స్థిరంగా వున్నాడు, భూమి తిరుగుతోంది. కంటికి కనబడేదాన్ని స్థూలదృష్టి అనీ, మరోదాన్ని సూక్ష్మదృష్టి అన్నారు. రెండింటికీ తేడా గమనించాలి. అన్నీ స్థూలదృష్టితో చూసేసి నిర్ధారించేయకూడదు. 

దీనికి ఉదాహరణగా రజ్జుసర్పభ్రాంతి అన్నదాన్ని ప్రతిపాదించారు. చీకట్లో తాడును చూసి పాము అని భ్రమిస్తాం. లైటు వేసి చూస్తే తాడు అని తెలుస్తుంది. పాము అనేది లేనే లేదు. మరి అది ఎక్కడనుండి వచ్చింది? మన ఊహల్లోంచి, భయాల్లోంచి వచ్చింది. పామును తాడు మీద మనం ఆరోపించాం. సినీభాషలో చెప్పాలంటే సూపర్‌యింపోజ్‌ చేశాం. ఎప్పటివరకూ? లైటు వేసే వరకూ. లైటు వేయగానే పాము మాయం! అలాగే ఈ జగత్తు అశాశ్వతం. దాన్ని శాశ్వతం అని మనం పొరబడుతున్నాం, తాడుని పాము అనుకున్నట్టే! లైటు వేయగానే పాము మాయమైనట్టు బ్రహ్మజ్ఞానం కలిగేసరికి జగత్తు మిథ్య అని అర్థమవుతుంది. అక్కడ లైటు వేయకముందూ, తర్వాత కూడా వున్నది తాడు ఒక్కటే! అది అల్టిమేట్‌ ట్రూత్‌. అదే బ్రహ్మపదార్థం అనుకోండి. దానిమీద మనం జగత్తు అనే పామును సూపర్‌ యింపోజ్‌ చేసి వుంచినంతకాలం జగత్తు ప్రాగ్మాటిక్‌ ట్రూత్‌, వ్యావహారిక సత్యం.  

శాశ్వతమైన బ్రహ్మం యిలాటి మిథ్యామయమైన జగత్తును ఎలా సృష్టించింది? సృష్టించిన తర్వాత అది అలాగ వుండిపోవాలి కదా! లేదేం? దీనికి సమాధానం అలాతకాంతి సిద్ధాంతంలో కనబడుతుంది. ఈ సిద్ధాంతాన్ని బౌద్ధగురువులనుండి శంకరుడు తీసుకున్నాడు. ఒక కొరకంచు, టార్చ్‌ వుందనుకోండి. దాన్ని గాల్లో తిప్పాం. దానివల్ల జ్వాలావలయం ఏర్పడుతుంది. ఆ జ్వాలావలయం శాశ్వతమా? కాదు కదా. శాశ్వతమైనది కొరకంచు మాత్రమే! దానియొక్క మూవ్‌మెంట్‌ వల్ల ఓ కాంతిచక్రం కాస్సేపు కనబడి మాయమవుతుంది. కొరకంచు బ్రహ్మపదార్థం అనుకుంటే, కాంతిచక్రం జగత్తు. అర్థమైంది కదా, జగత్తు మిథ్య అని ఎలా నిరూపించారో! అలాతమంటే కొరకంచు. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని అలాతకాంతి సిద్ధాంతమన్నారు. 

ఆదిశంకరుడి సిద్ధాంతం ఆధునికులకు కూడా నచ్చుతుంది. ఒకలా చెప్పాలంటే ఆయనది ఆధ్యాత్మిక సోషలిజం. అందరూ సమానమే, మనమే దేవుళ్లం అని చెపుతుంది కదా. ప్రతి శరీరమూ దేవాలయమే, ప్రతి మూర్తీ పూజనీయుడే. మనీషా పంచకం చెప్పినపుడు చండాలుడి పాదాలమీద పడ్డాడు శంకరుడు. శంకరుడు తర్కబద్ధంగా చెప్పాడు. మూఢభక్తితో నమ్మమని చెప్పలేదు. ఆలోచించి చూడమన్నాడు. అందువల్లన ఆధునిక దార్శనికులందరూ శంకరుణ్ని అనుసరించినవారే! విదేశాల తత్త్వవేత్తలు కూడా శంకరుడి 'మాయా' సిద్ధాంతానికి చాలా విలువనిస్తారు. వివేకానందుడు, డా. రాధాకృష్ణన్‌.. ఎవరైనా కానీయండి. అందరూ ఆదిశంకరుడి అద్వైత సిద్ధాంతంమీద డెవలప్‌ చేసినవారే! రామకృష్ణ మిషన్‌వారు కానీయండి, చిన్మయ మిషన్‌ వారు కానీయండి, అందరూ ఆదిశంకరుడి వ్యాఖ్యానాలమీదనే ఆధారపడతారు.

రామానుజ విగ్రహం ప్రతిష్ఠాపన సందర్భంగా చిన జియర్ గారు అద్వైతాన్ని హేళన చేస్తూ ‘నువ్వు లేవు, నేను లేవు, ప్రకృతి మాయ అంటారు…’ అన్నప్పుడు అనేకమంది పండితులు అభ్యంతరం చెప్పారు. రామానుజుడు మాయావాదాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని యాదవప్రకాశుడనే గురువు వద్ద కొంతకాలం అభ్యసించాక దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అద్వైతానికి మెరుగులు దిద్దుతున్నాను అంటూ మరో థియరీ ప్రతిపాదించారు. దాన్ని విశిష్ట అద్వైతం అన్నారు. విశిష్ట అంటే క్వాలిఫైడ్‌ అన్నమాట. అంటే అద్వైతమే కానీ దానిలో మార్పు చేసినదన్నమాట. అద్వైతానిది ముఖ్యంగా జ్ఞానమార్గమైతే రామానుజుడిది భక్తిమార్గం. ఈ పరిణామాన్ని ఒకలా మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రేమ, కృతజ్ఞత వంటి భావాల లాగానే దైవభక్తి అనేది మానసికమైనది. అది ఎంత ఉందో, ఏ స్థాయిలో వుందో ఎదుటివాళ్లకు తెలియదు. తలిదండ్రుల పట్ల మనకు ప్రేమ ఉంటుంది, గౌరవం వుంటుంది.  వాళ్ల పట్ల మనం మెలిగే విధానం బట్టి అది వ్యక్తమౌతుంది. మరి దేవుడి పట్ల మనకున్న ప్రేమ, భక్తి వంటివి తెలియపరచడం ఎలా? దానికి పూజారి పూజ అనే విధానాన్ని కనిపెట్టాడు. దాన్ని అలాగే చేయాలి అని రాజు ఒత్తిడి పెట్టాడు. తలితండ్రులైతే భౌతికంగా మన ఎదుట వుంటారు కాబట్టి మనం మరీ మరీ కాళ్లకు మొక్కేస్తూ వుంటే ‘ఇక చాల్లేరా, నీ మనసులో ఉన్నది మాకు తెలియదా’ అని వారిస్తారు.

మరి దేవుడేమో మనకు కనబడడు. ‘ఇంతొద్దు, యీ మేరకు చాలు’ అని చెప్పడు. దేవుడి ప్రతినిథిగా ఉన్న పూజారి అలాటి మాట ఎప్పుడూ చెప్పడు. ‘ఇంతేనా? ఇంకాయింకా’ అంటూ పోతాడు. ‘..లేకపోతే దేవుడు తృప్తి పడకపోగా ఆగ్రహిస్తాడు, నిన్ను సర్వనాశనం చేస్తాడు’ అని భయపెడతాడు. నా మనసులో భక్తి అపారంగా వుంది బాబోయ్ అన్నా, అదెవడు చూడొచ్చాడు? యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, వ్రతాలు చేయి, నోములు పట్టు, నాకు దానాలు చేయి అని హడలగొట్టేస్తాడు. మనకు దేవుడంటే ప్రేమ పోయి భయం కలిగేట్లా చేస్తాడు. అందుకనే ‘త్వమేవ మాతా, త్వమేవ పితా’ శ్లోకాలున్న దేవుడి గురించే గాడ్ ఫియరింగ్, దైవభీతి వంటి పదాలు వచ్చాయి. ఈ క్రతువులు పోనుపోను పెరిగిపోయి, జంతుబలులు, నరబలులు వరకు వెళ్లిపోయేసరికి దాన్ని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ జైనం, బౌద్ధం పుట్టుకుని వచ్చాయి. ధ్యానం చేస్తే చాలు, యీ అట్టహాసాలు అక్కరలేదు అనడంతో ప్రజలకు ఆ పద్ధతి నచ్చి హిందుమతం నుంచి ఆ మతాల వైపు మరలసాగారు.

ఆ దశలో ఆదిశంకరుడు ఉద్భవించాడు. బౌద్ధంలోని తర్కబద్ధమైన అంశాలు తీసుకుని, వారి కంటె మెరుగ్గా వాదిస్తూ, ఓడిస్తూ, సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేట్లా దేవుడెక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, నేనే దేవుణ్ని (అహం బ్రహ్మాస్మి) అనే జ్ఞానం సంపాదిస్తే చాలు, మోక్షం సిద్ధిస్తుంది అని ప్రచారం చేశాడు. కర్మకాండ, భక్తిమార్గం యివన్నీ తొలిదశలో అవసరమే కానీ, పోనుపోను యివన్నీ వదుల్చుకుని జ్ఞానమార్గం వైపు పయనించాలి. సత్సంగత్వం నుంచి నిస్సంగత్వం, నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం, నిర్మోహత్వం నుంచి నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వం నుంచి జీవన్ముక్తి కలుగుతాయి అన్నాడు. ఇలా చెపుతూనే పూజాది క్రతువులను మాన్పించలేదు. హిందూమతంలో విడివిడిగా ఉన్న అనేకమంది దేవుళ్లను ఒక్కచోటికి చేర్చి వారిపై స్తోత్రాలు రాశాడు. పూజాపద్ధతులను ఏర్పాటు చేశాడు.

దీని కారణంగా హిందూమతం మళ్లీ జీవం పుంజుకుంది. బౌద్ధం, జైనం వెనకబడ్డాయి.

కొంతకాలం పాటు అద్వైతం రాజ్యమేలింది. శివభక్తులు, విష్ణుభక్తులు, దేవీభక్తులు, అందరూ ఆ మార్గంలోనే వెళ్లారు. ఎందుకంటే దీనిలో ఏ దేవుణ్నీ పక్కకు పెట్టలేదు. ఇది జీవాత్మ, పరమాత్మ సంవాదం. నువ్వు జీవాత్మవి. నీలోనే పరమాత్మ ఉన్నాడు అన్నారంతే. అందుకే వైష్ణవుడైన రామానుజుడు కూడా కొంతకాలం అద్వైతాన్ని అభ్యసించాడు. కానీ దానివలన సత్ఫలితాలు కలగడం లేదని గ్రహించాడు. ‘తత్త్వమసి’ (నువ్వే అతడు, అనగా పరమాత్మవై ఉన్నావు) అనే జ్ఞానం ఉంటే చాలు అన్నారు కాబట్టి, ఆ జ్ఞానాన్ని కొలిచే కొలబద్దలు లేవు కాబట్టి, ‘ఆ తెలుసుకున్నానులే’ అని అనేసుకుని, ఎలాగూ జగమే మాయ కదాని ప్రజలు పూజాపునస్కారాలను అటకెక్కించడం మొదలెట్టారు. భక్తి, పాపం, పుణ్యం వంటి సాధనాలు లేకపోతే సమాజం కట్టుతప్పే ప్రమాదం వుంది. మతం మూలపడే ప్రమాదమూ ఉంది.

అందుకని రామానుజుడు ప్రజలను భక్తిమార్గం వైపు మళ్లించి, పూజాపునస్కారాలకు పట్టం కట్టాడు. ఒకలా చెప్పాలంటే ఆదిశంకరుడు మేధస్సుకు ప్రాముఖ్యత యిస్తే, రామానుజుడు మనసుకు యిచ్చాడు. కష్టాల్లో ఉన్న మానవుడికి ఊరట కలిగించేది పూజ చేయడం, దేవుడికి మొక్కడం, ఆయనేదో చేస్తాడని ఆశ పెట్టుకోవడం. దేవుడు నీ మొర వింటాడన్న హామీ అద్వైతం యివ్వలేదు. నిర్గుణుడైన పరమాత్మ నీ బాధలకు, అనుభూతులకు అతీతంగా ఉంటాడు అంటే బాధల్లో ఉన్నవాడికి సంతోషం కలుగుతుందా? అంతకంటె దేవుడు విడిగా, పైన ఎక్కడో ఉన్నాడు, పూజాపునస్కారాలు చేసి, దేవుడా నీదే భారం అని మొర పెట్టుకుంటే ఆలకిస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు అని చెప్తే తృప్తిగా వుంటుంది కదా! రామానుజుడు అదే పని చేశాడు. అయితే దానికి అప్పటికే పాప్యులర్‌గా వున్న అద్వైతం అనే ముసుగు తొడిగాడు. తక్కిన విషయాలు రామానుజుడి విగ్రహం అనే వ్యాసంలో రాస్తాను. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]