కాంగ్రెస్ ఖాతా నుంచి అది కూడా మైన‌స్!

దేశంలో ప్ర‌స్తుతం అతి త‌క్కువ‌గా ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్ర‌ముఖ‌మైన‌ది అయిన పంజాబ్ ఆ పార్టీ ఖాతా నుంచి చేజార‌డం లాంఛ‌న‌మే అని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు. ఐదు  రాష్ట్రాల అసెంబ్లీ…

దేశంలో ప్ర‌స్తుతం అతి త‌క్కువ‌గా ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్ర‌ముఖ‌మైన‌ది అయిన పంజాబ్ ఆ పార్టీ ఖాతా నుంచి చేజార‌డం లాంఛ‌న‌మే అని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు. ఐదు  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌డంతో పంజాబ్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు కూడా వెల్ల‌డి అయ్యాయి. ఈ స‌ర్వేల సారాంశం ప్ర‌కారం.. పంజాబ్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యాకా అక్క‌డ ప‌లు మార్పులు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అవేవీ ఫ‌లితాన్ని ఇచ్చే అవ‌కాశం లేద‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

బీజేపీకి పునాదులు లేని రాష్ట్రం, మోడీ స‌ర్కారు తెచ్చిన సాగు చ‌ట్టాల‌పై స‌ల‌స‌ల మ‌లిగిన రాష్ట్రం అయిన‌ప్ప‌టికీ.. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని నిల‌బెట్టుకునే అవ‌కాశాలు లేవ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. బీజేపీ వ్య‌తిరేక‌త‌ను ఆప్ మాత్రం బ్ర‌హ్మాండంగా క్యాష్ చేసుకుంద‌ని ఈ స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి.

117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి క‌నిష్టంగా 70 సీట్లు , గ‌రిష్టంగా 100 అసెంబ్లీ సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు అంచ‌నా వేస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ కు పంజాబ్ లో అధికారం రీటెయిన్ అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని, ఢిల్లీ త‌ర్వాత ఆప్ ఖాతాలో మ‌రో రాష్ట్రం ప‌డ‌నుంద‌ని అన్ని స‌ర్వేలూ ముక్త‌కంఠంతో చెబుతున్నాయి. 

ఆప్ కు ఎన్ని సీట్లు ద‌క్కినా రెండో స్థానం కాంగ్రెస్ దే అని కాస్త ఊర‌ట‌ను ఇస్తున్నాయి ఆ పార్టీకి. ప్రీ పోల్ స‌ర్వేల్లో ఆప్ కు యాభై సీట్ల వ‌ర‌కూ ద‌క్క‌వ‌చ్చ‌నే అంచ‌నాలు రాగా, ఇప్పుడు క‌నీస మెజారిటీ క‌చ్చితంగా ఆప్ కే ద‌క్కుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.