తగ్గించిన టికెట్ రేట్లు అమల్లో ఉన్న టైమ్ లోనే ధైర్యం చేసి భీమ్లానాయక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. రిలీజైన వారాంతం కాకపోయినా, ఆ మరుసటి వీకెండ్ కైనా కొత్త జీవో వస్తుందని ఆశపడ్డారు. కానీ కొత్త జీవో భీమ్లానాయక్ కు అందుబాటులోకి రాలేదు. కాకతాళీయమా, కావాలని చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే భీమ్లానాయక్ మాత్రం కొత్త రేట్ల బెనిఫిట్ ను అందుకోలేకపోయింది.
పోనీ ఈ వారాంతమైనా భీమ్లానాయక్ కు ఈ కొత్త జీవో ఉపయోగపడుతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది. పైగా ఈ వీకెండ్ రాధేశ్యామ్ వస్తోంది. ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కోసం భీమ్లానాయక్ చాలా థియేటర్లు కోల్పోవాల్సి ఉంది. కాబట్టి పెరిగిన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చినా భీమ్లానాయక్ కు ఒరిగేదేం ఉండదు.
వంద కోట్లు సరే.. బ్రేక్ ఈవెన్ సంగతేంటి?
మరోవైపు భీమ్లానాయక్ సినిమా వంద కోట్ల షేర్ అందుకుంది. ఈ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ అంతా ఘనంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండింగ్ ముసుగులో బయ్యర్లు, ఎగ్జిబిటర్ల ఏడుపును ఆయాచితంగా మరిచిపోయారు. అవును.. పేరుకు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసినప్పటికీ, ఓవర్సీస్ తప్ప ఏ ఒక్క ఏరియాలో భీమ్లానాయక్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. దీంతో కోట్లు పెట్టి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.
తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కు కాస్త దగ్గరగా వచ్చిన ఈ సినిమా, ఆంధ్రాలో దరిదాపుల్లోకి కూడా రాలేదు. సీడెడ్ అయితే మరీ దారుణం. ఇంకా 5 కోట్లకు పైగా వసూళ్లు రావాలి. మరో 3 రోజుల్లో రాధేశ్యామ్ వస్తున్న నేపథ్యంలో.. సీడెడ్ జనాలంతా బ్రేక్ ఈవెన్ పై ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఎంత తక్కువ నష్టంతో బయటపడదామా అని ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ నుంచి అభినందనల వెల్లువ
ఓవైపు భీమ్లానాయక్ వ్యథ ఇలా ఉంటే, మరోవైపు టాలీవుడ్ లో పండగ వాతావరణం కనిపిస్తోంది. టికెట్ రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ కొత్త జీవో విడుదల చేయడంతో.. టాలీవుడ్ జనాలంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కొత్త జీవో వెలువడ్డంలో కీలక పాత్ర పోషించిన చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాకు 5వ షోకు వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మేలిమలుపుగా పేర్కొన్నారు చిరు.
ఊపిరిపీల్చుకున్న రాధేశ్యామ్
కొత్త జీవో వెసులుబాటును క్యాష్ చేసుకోబోయే మొట్టమొదటి పెద్ద సినిమా రాధేశ్యామ్. 11వ తేదీన విడుదలకాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త జీవో చాలా పెద్ద ఉపశమనం.
ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోయి, వడ్డీలు కొండలా పేరుకుపోయిన తరుణంలో, ఆంధ్రాలో ఎలా నెట్టుకురావాలా అనే టెన్షన్ లో ఉన్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్. ఈ మూవీ తర్వాత రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఇదో పెద్ద ఊరట.