సుదీర్ఘంగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడి అయ్యాయి. వివిధ అధ్యయన సంస్థలు యూపీ ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేశాయి. ఇవి ఎంత మేరకు వాస్తవం అవుతాయో కానీ… యూపీలో వరసగా రెండో సారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని అంచనా వేస్తూ ఉన్నాయి. ముక్తకంఠంతో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకే పట్టం గట్టుతున్నాయి.
కనిష్టంగా 220 సీట్లతో మొదలుపెడితే గరిష్టంగా 280 సీట్ల వరకూ భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ నష్టపోయే సీట్లన్నీ దాదాపుగా వందకు వంద శాతం సమాజ్ వాదీ పార్టీ ఖాతాలోకి పడతాయని కూడా ఈ అధ్యయన సంస్థలు చెబుతుండటం గమనార్హం. బీఎస్పీ పుంజుకునే అవకాశం లేదని, కాంగ్రెస్ లేవదని.. పోటీ మొత్తం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యనే జరిగిందని పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
విశేషం ఏమిటంటే.. ప్రీ పోల్ సర్వేలు చెప్పిన విషయాన్నే పోస్ట్ పోల్ సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రీ పోల్ సర్వేలు అంచనా వేసిన రీతిలోనే పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి.
బీజేపీ యూపీలో తిరిగి అధికారం సాధిస్తుంది కానీ.. క్రితం సారి దక్కినన్ని సీట్లు మాత్రం దక్కవనేది ఈ అధ్యయనాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. బీజేపీ ఖాతా నుంచి తరిగిపోయే సీట్లు వంద అసెంబ్లీ స్థానాల వరకూ ఉండవచ్చని కొన్ని సర్వేలు చెబితే, యాభై సీట్ల వరకూ తరుగుదల ఉండవచ్చని మరికొన్ని అంచనా వేస్తున్నాయి. మరి అసలు కథ ఏమిటనేది ఈ నెల పదో తేదీతో స్ఫష్టత రానుంది.