మొత్తానికి ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న టికెట్ ల జీవో వచ్చేసింది. పెద్దగా సవరణ లేదూ అని కాదు. అలా అని వుందీ అని కాదు. మధ్యస్ధంగా వున్నాయి కొత్త రేట్లు. అయితే ఈ విషయం ఎలా వున్నా ముందు సమస్య ఒక కొలిక్కి వచ్చేసింది. అది చాలు.
టాలీవుడ్ కూడా ఇంతకన్నా ఎక్కువ రేట్లు టాలీవుడ్ కూడా ఆశించలేదు. కానీ రేట్ల సంగతి ఎలా వున్నా అదనపు ప్రయోజనాలు బాగానే వున్నాయి.
ముఖ్యంగా అయిదు ఆటలకు అనుమతి అన్నది పెద్ద ప్లస్ పాయింట్. ఎలాగూ పెద్ద సినిమాలు వుంటే చిన్న సినిమాలు విడుదల కావు. అందువల్ల చిన్న సినిమాల క్లాజ్ అన్నది పెద్దగా ఇబ్బంది పెట్టదు. హ్యాపీగా అయిదు ఆటలు వేసుకోవచ్చు.
అలాగే ఆంధ్రలో 20శాతం షూట్ చేసుకోవాలనే నిబంధన కూడా పెద్దగా ఇబ్బంది కరం కాదు. పుష్ప సినిమా, రామ్ చరణ్-శంకర్ సినిమాలు ఆంధ్రలో షూటింగ్ జరుపుకున్నవే. ఇకపై ఈ విధంగానే అన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. దీని వల్ల ఆంధ్రలో షూటింగ్ లు పెరుగుతాయి. ఒక విధంగా అది మంచిదే.
ఇక టికెట్ రేట్ల సంగతి. ఒకసారి గడబిడ ముగిసాక ఇక ఎవ్వరూ పట్టించుకోరు. వంద అమ్మారా? రెండు వందలు అమ్మారా? అన్నది లోకల్ అధారిటీలు చూసుకుంటాయి. వాళ్లని ఎలా మేనేజ్ చేయాలి అన్నది మన సినిమా జనాలకు చాలా కాలంగా అలవాటైపోయిన వ్యవహారం.
ఇంత గడబిడ జరుగుతున్నపుడే చాలా సినిమాలకు భయంకరమైన రేట్లు అమ్మేసారు. అంత కట్టుదిట్టం చేసినా భీమ్లా నాయక్ కు అమ్మేసారు. ఇకపై ఏ గడబిడ వుండదు కనుక, అన్నీ తెరవెనుక స్మూత్ గా సాగిపోతాయి.