తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రోజురోజుకూ దూకుడు పెంచుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన జోష్‌తో బీజేపీ ఉత్సాహంగా ఉంది. కేసీఆర్ పాలనలో అధికార పార్టీని ఓడించడం ఏ పార్టీకైనా ఊపు ఇచ్చేదే. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాటన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మొదలైన బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ కేసీఆర్‌కు సినిమా భాషలో చురకలంటించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలని, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా ఉందన్నారు. బడ్జెట్‌పై ప్రశ్నించకూడదనే తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆయన ధ్వజమెత్తారు.
తమనెవరూ ప్రశ్నించకూడదనేదే కేసీఆర్ సర్కార్ ఉద్దేశమైతే, ప్రగతిభవన్‌లో, ఫాంహౌస్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించు కోవాల్సిందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల త్రయం ఆర్ఆర్ఆర్ (రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు) ట్రైలర్‌కే కేసీఆర్ భయపడుతున్నారని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ చురకలంటించారు.
సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో తెలియకుండానే తమ ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని, టీఆర్ఎస్ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ సమావేశమని ఆయన జోస్యం చెప్పారు.