2024లో ఏపీలో ప్రత్యామ్నాయ కూటమిగా అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పోరాడడానికి సమస్యలే లేవా? ఎంత సేపూ తమ ఎజెండానే ప్రజలపై రుద్దాలనే ప్రయత్నాలే తప్ప, ప్రజా సమస్యలపై పోరు చేయాలనే సంకల్పమే ఆ పార్టీలో కొరవడింది. ఇందుకు తాజా ఉదాహరణ తిరుపతిలో పద్మావతి నిలయాన్ని నూతన కలెక్టరేట్‌గా ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకించడం.
ఎన్నికల హామీ మేరకు జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు నూతన జిల్లాల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు తిరుపతి కేంద్రంగా ప్రభుత్వం బాలాజీ జిల్లాను ప్రకటించింది. జిల్లా కేంద్రంగా తిరుచానూరు సమీపం లో పద్మావతి నిలయాన్ని అధికారులు ఎంచుకున్నారు.
టీటీడీ నిధులతో నిర్మించిన ఈ వసతి సముదాయాన్ని జిల్లా కార్యాలయంగా ఎంచుకోవడం బీజేపీ దృష్టిలో తీవ్ర అపరాధమైంది. పద్మావతి నిలయాన్ని జిల్లా కార్యాలయంగా ఎంపిక చేసుకోవడంపై తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ టీటీడీ ఈవో జవహర్‌రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ భవనాన్ని భక్తుల సౌకర్యం కోసం వినియోగించడమే సముచితమన్నారు.
ఇప్పటికే తిరుపతిలో చారిత్రిక కట్టడంగా చెప్పుకునే ఎస్వీఎన్ హైస్కూల్‌ను ఎస్పీ కార్యాలయంగా మార్చారని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ముఖ్యమైన సెంటర్లలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన టీటీడీ స్థలాలను ప్రభుత్వ అవసరాలకు అప్పగించారని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలకు వెనుకాడబోమని టీటీడీని సోము వీర్రాజు హెచ్చరించడం గమనార్హం.
కానీ వేలాది మంది ఉపాధి పొందుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మాత్రం అప్పనంగా అమ్మకానికి పెట్టడం మాత్రం బీజేపీ దృష్టిలో సరైందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బీఎస్ఎన్ఎల్ ఆస్తుల అమ్మకం, ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు తమ దృష్టిలో సరైన చర్యలా వీర్రాజు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.