ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలంటే చర్చకు బదులు రచ్చకే చోటు ఉంటుంది. ఈ వాస్తవం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే రుజువైంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అనుసరించిన వైఖరిపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ పత్రాలను చించేసి, ఆయనపై విసిరేయడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా పరిగణించారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై జగన్ బీఏసీలో ధ్వజమెత్తారు. గవర్నర్ వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ సభ్యులు సంస్కార హీనంగా ప్రవర్తించారని సీఎం జగన్ అంటే, అందుకు అచ్చెన్నాయుడు దీటైన కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత బీఏసీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా పెద్దాచిన్నా లేకుండా టీడీపీ సభ్యులు దురుసుగా ప్రవర్తించారని అచ్చెన్నపై జగన్ మండిపడ్డారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు కాసేపటి క్రితం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వయసుకైనా విలువ ఇవ్వొద్దా అని సీఎం అనడం సరికాదన్నారు. తాము గవర్నర్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదని, ఆయన తప్పిదాలను మాత్రమే ఎండగట్టినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత..? చంద్రబాబును వైసీపీ సభలో అవమానించ లేదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించడం గమనార్హం.
అసెంబ్లీ సమావేశాలు మున్ముందు ఎలా జరగనున్నాయో పాలక, ప్రతిపక్ష నేతల మధ్య పేలిన మాటల తూటాలు చెప్పకనే చెబుతున్నాయి. అసెంబ్లీలో ప్రజాసమస్యల కంటే పరస్పరం ఆధిపత్యం ప్రదర్శించుకోవడంపైనే ఇరుపార్టీలు పంతాలకు పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తమ తప్పుల్ని సమర్ధించుకునేందుకు గతాన్ని ఇరు పార్టీలు తవ్వుకునేందుకు వెనుకాడడం లేదు.