తన కలల ప్రాజెక్టు కన్నప్పలో పలు భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తారనే విషయాన్ని హీరో మంచు విష్ణు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడీ ప్రాజెక్టుకు మరో ఎట్రాక్షన్ తోడైంది.
తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ భారీ ప్రాజెక్టులోకి వచ్చి చేరారు. ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని, మేకర్స్ మరో సందర్భంలో అట్టహాసంగా ఎనౌన్స్ చేస్తారట. ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం ప్రభాస్ ను తీసుకున్నారంటూ ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిపై మంచు విష్ణు నేరుగా స్పందించనప్పటికీ, పరోక్షంగా కన్ ఫర్మ్ చేశాడు.
ప్రభాస్ సరసన పార్వతి పాత్రలో నయనతారను తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. దానిపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో, ఇలా శివరాజ్ కుమార్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు.
బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నాడు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా ముందుగా నూపుర్ సనన్ ను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ స్థానం కూడా ఖాళీగా ఉంది.