జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శల దాడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరైన జగన్.. అనంతరం జరిగిన బహిరంగ సభలో జనసేనానిపై చెలరేగిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్‌పై దాడిని జగన్ పెంచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పెళ్లిళ్లపై జగన్ కొత్త కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. జగన్ ఏం మాట్లాడారో తెలుసుకుందాం.
చంద్రబాబును సమర్థించే వాళ్లెవరూ ఏపీలో ఉండరని జగన్ విమర్శించారు. అలాగే బాబును సమర్థించే దత్త పుత్రుడు కూడా మన రాష్ట్రంలో ఉండరన్నారు. బాబు కొడుకు, బామ్మర్ది కూడా ఏపీలో ఉండరని చెప్పుకొచ్చారు. బాబు గజదొంగల ముఠాలో భాగస్వాములైన ఈనాడు అధిపతి రామోజీరావు, ఇతరులెవరూ మన రాష్ట్రంలో ఉండరన్నారు. వీళ్లకు మన రాష్ట్రం, ప్రజలు ఎందుకు కావాలంటే దోచుకోడానికి, ఆ సొమ్మును హైదరాబాద్‌లో పంచుకోడానికి అని ధ్వజమెత్తారు. తాను చెప్పిందాంట్లో నిజం వుందా? లేదా? అనేది ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక బాబు దత్త పుత్రుడి స్టోరీ మీ అందరికీ తెలిసిందే అని జగన్ అన్నారు. దత్త పుత్రుడి శాశ్వత ఇల్లు హైదరాబాద్‌లోనే అన్నారు. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడునాలుగేళ్లకు మారిపోతా వుంటారని దెప్పి పొడిచారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఎక్కడికి పోతాడో అని జగన్ ఎద్దేవా చేశారు.
ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా పవన్‌కున్న గౌరవం ఏంటో ఆలోచించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. తాను చెబుతున్నవన్నీ నిజాలన్నారు. మన ఇళ్లలోని మహిళలను , పెళ్లిళ్లను మనం గౌరవించకపోతే ఎలా అని ప్రశ్నించారు. మనమే నాయకులుగా వుంటూ మూడునాలుగేళ్లకు ఒకసారి ఇల్లాలను మారుస్తూ, మహిళలను చులకన భావంతో చూస్తే, ఎలాంటి పాలకులం, నాయకులమో ఆలోచన చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా జగన్ అభివర్ణించారు. గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాకలతో పవన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాటిని యూజ్ అండ్ త్రోగా పవన్ భావిస్తారని విమర్శించారు.
తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకోడానికి మాత్రమే అప్పుడప్పుడు వస్తూ, పోతూ వుంటారని పవన్‌పై విరుచుకుపడ్డారు. దత్త పుత్రుడిని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుందని జగన్ అన్నారు. సరుకును, సరంజామాను అమ్ముకునే వాళ్లను చూశామన్నారు. కానీ సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వాళ్లకు అమ్ముకునే వ్యాపారిని మాత్రమే దత్త పుత్రుడి రూపంలో చూస్తున్నామని జగన్ చెలరేగిపోయారు. రెండు షూటింగ్‌ల మధ్య విరామంలో అప్పుడప్పుడు వచ్చి అమ్ముకోడానికి వచ్చే దత్త పుత్రుడికి మన కాపులైనా, మన ప్రజలైనా, మన రాష్ట్రమైనా ఏం ప్రేమ వుంటుందో ఆలోచించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
వారాహియాత్రల్లో సీఎం జగన్‌పై పవన్ తీవ్ర విమర్శలనే ఇంత వరకూ చూశాం. ఇప్పుడు జగన్ నుంచి ఎదురు దాడి మొదలైంది. పవన్‌కల్యాణ్ పెళ్లిళ్లలపై కొత్త పంథాలో జగన్ వెటకరించడం చర్చనీయాంశమైంది. పవన్ మొదటి భార్య విశాఖ (లోకల్), రెండో భార్య రేణూ దేశాయ్ (మహారాష్ట్ర, నేషనల్), మూడో భార్య అన్నాలెజినోవా (రష్యా, ఇంటర్నేషనల్) అని జగన్ విమర్శల్లోని అంతరార్థంగా చర్చించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అని జగన్ ఎగతాళి చేయడం గమనార్హం. జగన్ విమర్శలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.