ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కూల్చడం తప్ప, నిర్మించడం తెలియదని ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇందుకు ప్రజావేదికను ఉదహరిస్తుంటారు. దాన్ని కూల్చడంలో జగన్ ఉద్దేశం.. అక్రమాలపై తమ ప్రభుత్వం వేటు వేస్తుందనే సంకేతాల్ని అధికారంలోకి వచ్చిన మొట్టమొదట్లో ఇవ్వడమే.
జగన్‌కు కూల్చడమే తెలుసు అని విమర్శించే వాళ్లకు, అందులో నిజం లేదని చెప్పడానికి జగనన్న కాలనీలే నిలువెత్తు నిదర్శనం. ఏకంగా ఊళ్లకు ఊళ్లే జగన్ ఈ నాలుగున్నరేళ్లలో నిర్మించతలపెట్టాలని తెలుసుకోవచ్చు. పేదల సొంతింటి కలను నురవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని జగన్ సంకల్పించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మహిళల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. అంతేకాదు, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం చొరవ చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల పైచిలుకు జగనన్న కాలనీలను ఏర్పాటు చేయాలని సంకల్పించడం …కూల్చడమా? సృష్టించడమా? అనేది జగన్‌ను విమర్శించే వాళ్లు సమాధానం చెప్పాలి.
ఇందులో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సామర్లకోటలో ఈటీసీ లేఔట్‌లో 52 ఎకరాల్లో 2,412 మందికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ లేఔట్ అభివృద్ధికి రూ.15 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. రూ.4 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, మూడు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించారు. అంతేకాదు, ఆహ్లాదం కోసం పార్కులను నెలకొల్పారు. వీటిలో ఓపెన్ జిమ్‌లు, చిన్న పిల్లల పార్కులు ఏర్పాటు చేయడం విశేషం.
పేదల కోసం పాలన సాగిస్తున్న జగన్‌పై రాజకీయ కక్షతో విమర్శలే తప్ప, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఇవాళ సామర్లకోటలో సామూహిక గ్రహ ప్రవేశాలను చూస్తే అర్థమవుతుంది. ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఆ రెండు బాధ్యతలను నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది లక్షలాది పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత శ్రమటోడ్చి వుంటారో అర్థం చేసుకోవచ్చు.
సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ…రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నట్టు జగన్ తెలిపారు.
రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు.