భారతీయ క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లికి వీరాభిమానులు ఎవరైనా ఉంటే.. తమ హీరో.. ప్రపంచంలోనే అరుదైన ఘనత సాధించిన అతి కొద్ది మంది ప్రముఖ బ్యాటర్ల సరసకు చేరుతాడని రెండురోజుల కిందటి వరకు చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజం చెప్పాలంటే.. ఒక్కరోజు ముందు వరకు కూడా వారిలో అలాంటి ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశ వారిలో ఉంది. కానీ.. ఇప్పుడిక అవకాశం లేదు.
అద్భుతం కాదు- మాయ జరిగితే తప్ప వారి కోరిక తీరదు. ఇంతకూ వారి కోరిక ఏంటంటే.. వందో టెస్టులో వంద పరుగులు సాధించడం! ప్రస్తుతం మొహాలీలో తన టెస్టు కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న విరాట్ కొహ్లి.. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించి.. ప్రపంచ దిగ్గజాల సరసన నిలిచే అవకాశం చేజారిపోయినట్టే!
ఒక బ్యాటర్ వందటెస్టుల వరకు ఆడడం అంటే ఎంతో సుదీర్ఘమైన కెరీర్ ఉన్నట్టు లెక్క. ఎంతో క్రమశిక్షణతో తమ కెరీర్ ను నిర్మించుకునే వారు తప్ప ఇలాంటి ఘనతను అందరూ సాధించలేరు. అలాంటిది.. వందో మ్యాచ్ లో సెంచరీ కొట్టి.. అద్భుతాన్ని నమోదు చేసేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పటిదాకా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వారు 9 మందే ఉన్నారు.
మన దేశం నుంచి ఎవ్వరూ లేరు. పాకిస్తాన్ కు చెందిన జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్ ఇలాంటి ఫీట్ చేశారు. అయితే ఇండియా తరఫున అలాంటి అద్భుతం నమోదు చేసే మొట్టమొదటి బ్యాటర్ గా చరిత్ర పుటలకెక్కే అవకాశం విరాట్ కొహ్లి ముందు నిలిచింది. మొహాలిలో ప్రస్తుతం అంత గొప్ప ఫామ్ లో లేని శ్రీలంక జట్టుతో వందో టెస్టుగా తలపడే అవకాశం అది.
ఈ మ్యాచ్ కు చాలా కాలం ముందునుంచే విరాట్ ‘వందలో వంద’ గురించి చాలా ఊహాగానాలు రేగాయి. ఎటూ కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదు కాబట్టి.. ఇటీవలి మ్యాచ్ లలో గొప్ప గణాంకాలు లేకపోయినా.. ఈ మ్యాచ్ లో పట్టుదలగా సెంచరీ కొట్టేస్తాడని అభిమానులు అనుకున్నారు. అందరి అంచనాలు, మీడియా కూడా ఈ విషయంలో బాగా హైప్ ఇవ్వడంతో వందో టెస్టులో విరాట్ సెంచరీ గురించి వైరల్ అయింది.
ప్రాక్టీసు సెషన్లో విరాట్ అయిదారుసార్లు డకౌట్ అయిన విషయాన్ని కూడా ముడిపెట్టి.. సెంచరీ ఒత్తిడిలో విరాట్ డకౌట్లు అవుతున్నాడనే కథనాలు కూడా వచ్చాయి. తీరా మ్యాచ్ మొదలయ్యాక విరాట్ తన ఫ్యాన్స్ ను మరీ అంతగా నిరాశపరచలేదు. మొదటి ఇన్నింగ్స్ లో మొదటి రోజే బ్యాటింగ్ అవకాశం రాగా 76 బంతుల్లో 45 పరుగులతో గౌరవప్రదమైన స్కోరు చేశాడు. అభిమానులు మాత్రం ఆశలు అలాగే ఉంచుకున్నారు. ఇటీవలి మ్యాచ్ లతో పోలిస్తే విరాట్ ఫామ్ లోకి వచ్చనట్టే అనుకుని, సెకండిన్నింగ్స్ లో తమ కల పూర్తి చేస్తాడని అనుకున్నారు. కానీ అలా జరిగి పరిస్థితి మారిపోయింది.
కానీ.. మ్యాచ్ రెండో రోజు భారత ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా చెలరేగిపోయి ఏకంగా 175 పరుగులు చేయడం, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. అసలు భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరమే ఉండదనే అంచనాలు విరాట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాయి. శ్రీలంక బ్యాటర్లు భారతీయ బౌలర్లను ఎదుర్కోవడంలో చేతులెత్తేస్తున్నారు.
మొదటిరోజు 43 ఓవర్ల ఆటకు నాలుగు వికెట్లు కోల్పోయిన వారు.. రెండో రోజున పూర్తి రోజు మొదటి ఇన్నింగ్స్ ను కాపాడుకోవడం అసాధ్యమే. ప్రస్తుతానికి 466 పరుగులు వెనుకపడి ఉన్న శ్రీలంక, ఫాలోఆన్ తప్పించుకోవాలంటే కనీసం 266 పరుగులు చేయాలి. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ఇంత స్కోరు అసాధ్యం. ఫాలో ఆన్ తప్పదు. అలా వరుసపెట్టి రెండు ఇన్నింగ్స్ ఆడినా కూడా.. భారత్ వారి ముందు ఉంచిన 574 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించడం ఇంకా కష్టం. ఆ నేపథ్యంలో.. భారత్ అసలు రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండా.. శ్రీలంక కథ ముగిసిపోతుంది.
టెస్టు విజయం మనకు దక్కుతుంది గానీ.. ‘వందలో వంద’ కొట్టడానికి విరాట్ కు వచ్చిన అవకాశం మాత్రం చెదిరిపోయింది. ఈ రోజుల్లో బ్యాటర్ల కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగకపోతున్న పరిస్థితుల్లో మళ్లీ మరో ఇండియన్ బ్యాటర్ కు ఇలాంటి అవకాశం ఎప్పటికి వస్తుందో చూడాలి.