కేసీఆర్.. పడీ పడీ మొక్కితే ప్రధాని అయిపోతారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని.. టీఆర్ఎస్ నాయకులు చాలా ఘనంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేస్తున్నారు. ఇల్లలకగానే పండగ అనుకుంటున్న బాపతు కాదు ఇది. ఇల్లు అలకడానికి పేడ తీసుకురాగానే పండగ…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని.. టీఆర్ఎస్ నాయకులు చాలా ఘనంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేస్తున్నారు. ఇల్లలకగానే పండగ అనుకుంటున్న బాపతు కాదు ఇది. ఇల్లు అలకడానికి పేడ తీసుకురాగానే పండగ అయిపోయినట్టే అనుకునే బాపతు! ఇలా ప్రకటిస్తున్న నాయకులందరూ స్వామిని మించిన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న వాళ్లు. 

భజనలతో కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నవాళ్లు! అయితే నిజంగా కేసీఆర్ కు ప్రధాని కావాలనే కోరిక అంతరంగంలో ఉంటే గనుక.. అనుమానించాల్సిందే. ఆ కోరికతో.. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి, ఆ పార్టీలకు మూలపురుషులైన సీనియర్ నాయకులకు పాద నమస్కారాలు చేసినంత మాత్రాన.. ఈయన ప్రధానమంత్రి అవుతారా? అనేది ప్రజల్లో సందేహం!

దేశంలోని ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ ఒక జట్టుగా చేయాలని అనుకుంటున్న కేసీఆర్ దేశం తిరుగుతున్నారు. ఇటీవలే జార్ఖండ్ కు కూడా వెళ్లారు. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా మూల పురుషుడు శిబూసోర్ ను కలిసి పాదనమస్కారం చేసి ఆశీర్వాదం చేసుకున్నారు. ఆయన కొడుకు, అక్కడి సీఎం హేమంత్ సోరెన్ ను కలిసి వ్యూహరచనచ చేశారు. అయితే శిబూసోరెన్ కు పాదనమస్కారమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. 

కేసీఆర్ పాదనమస్కారాలు చేయడం ప్రజలకు కొత్త కొత్త అనుభవం కాదు. తన గురువుల పట్ల, ఆధ్యాత్మకవేత్తల పట్ల కేసీఆర్ ఆ రూపంలో అహంకారం ఎరుగని తన భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే శిబూ సోరెన్ పట్ల కూడా అలాంటి భక్తి ఉన్నదా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. 

జాతీయ రాజకీయాల అవసరం ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్ తాను కలగంటున్న కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండడానికి వీల్లేదని పట్టుదలగానే ఉన్నారు. స్థానికంగా ఆయన  పార్టీ అస్తిత్వం దెబ్బతినకుండా.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, అందుకు దేశరక్షణ, దేశ ప్రయోజనాలు అనే ముసుగుతొడగాలి అనేది ఆయన వ్యూహం. కాంగ్రెస్ ను పక్కన పెట్టే కూటమికి.. కేసీఆర్ సంప్రదిస్తున్న వారిలోనే కొన్ని పార్టీలు ఒప్పుకోకవచ్చు. వారి వారి లోకల్ కండిషన్స్ ను బట్టి.. వారు కాంగ్రెస్ తో మైత్రిని హఠాత్తుగా విడిచిపెట్టేయలేని స్థితిలో ఉన్నారు. 

ఇలాంటి నేపథ్యంలో 17 ఎంపీ సీట్ల తెలంగాణకు చెందిన నాయకుడు కేసీఆర్.. విబూ సోరెన్ లాగా ఎందరి కాళ్లు మొక్కితే ప్రధాని సీటుకు చేరువ కాగలరు? ఇంతా కలిపి జెఎంఎం బలమెంత? ఆ రాష్ట్రంలో ఉన్నదే కేవలం 14 సీట్లు. ఆ పార్టీకి ప్రస్తుతం లోక్ సభలో ఉన్నది ఒకే ఒక్క ఎంపీ!!

మద్దతు కోరే నాయకులకు, నాకంటే వయోధికులు కదా.. అనే ముసుగు కప్పి కాళ్లు మొక్కడం ప్రారంభిస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ కర్ణాటక కూడా వెళ్లి కుమారస్వామిని కలవాల్సి ఉంది. మరి అక్కడ దేవెగౌడ కాళ్లు కూడా మొక్కి ఆశీస్సులు తీసుకుంటారా? ఇలా కాళ్లు మొక్కుకుంటూ వెళితే.. ఆ మార్గానికి చిట్టచివరన ప్రధాని పీఠం తనకోసం ఎదురు చూస్తుంటుందని కేసీఆర్ అనుకుంటున్నారా??