జగన్ అధికారం మరోసారి రెన్యువల్ కావాలంటే జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ వ్యూహంపై ఆధారపడి ఉంది. పవన్ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ, కింగ్ మేకర్‌గా మాత్రం వ్యవహరించగలరు. పవన్ సామాజిక వర్గం ఏపీలో అత్యంత క్రియా శీలకం కావడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. పైగా ఆయనకున్న అభిమానులు సరేసరి. గత సార్వత్రిక ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులే ఉంటే మాత్రం జగన్‌కు మరోసారి అధికారం ఖాయం. అలా కాకుండా 2014నాటి రాజకీయ పరిస్థితులు ఉంటే మాత్రం జగన్ అధికారం దక్కడం కలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో రెండేళ్లలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకనేందుకు, ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14న జనసేన నిర్వహించనున్న సభే ఏపీ భవిష్యత్ రాజకీయాలను తేల్చనుంది. అందుకే ఈ సభపై వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి.
మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. సభా వేదిక నుంచి పవన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.
ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. జనసేన, బీజేపీ పొత్తు వల్ల బీజేపీకి లాభం. ఇదే సందర్భంగా జనసేనకు నష్టమే తప్ప లాభం లేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కోసం చంద్రబాబు ఒన్‌సైడ్ లవ్ ఎపిసోడ్‌ను రక్తి కట్టిస్తున్నారు. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్‌గా పవన్‌కల్యాణ్ కొట్టి పారేశారు. అయితే ఆయన మనసులో చంద్రబాబుకు ప్రత్యేక స్థానం ఉంది.
బీజేపీని కాదని చంద్రబాబుతో మళ్లీ రాజకీయ ప్రయాణం సాగిస్తారా లేక ముగ్గురు కలుస్తారా? అనేది చర్చనీయాంశమైంది. ఈ నెల 10న వెల్లడి కానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పవన్‌కల్యాణ్ నిర్ణయం ఆధార పడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తే మాత్రం… ఆ పార్టీతోనే పవన్‌కల్యాణ్ ఉంటారని, లేదంటే చంద్రబాబు వెంట నడుస్తారని చెబుతున్నారు.
టీడీపీతో జనసేనాని పొత్తు కుదుర్చుకుంటే మాత్రం వైసీపీకి రానున్న ఎన్నికల్లో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చుకుంటే మాత్రం ఈ కూటమికి విజయావకాశాలు మెరుగు అవుతాయనేది మెజార్టీ అభిప్రాయం. టీడీపీతో పొత్తులేదని, బీజేపీతోనే తన ప్రయాణమని పవన్‌కల్యాణ్ ప్రకటిస్తే మాత్రం… జగన్ నెత్తిన ఆయన పాలు పోసినట్టే. అందుకే ఈ నెల 14న జనసేన బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైందని చెప్పడం.
జగన్ అధికారాన్ని రెన్యువల్ చేయడం …పవన్ రాజకీయ స్టాండ్‌పై ఆధారపడి వుంది. అలాగే టీడీపీ అధికారంలోకి రావడం, రాకపోవడం పవన్‌కల్యాణ్ నిర్ణయంపై ఆధారపడి ఉందన్నది సుస్పష్టం. టీడీపీ భవిష్యత్‌ను తేల్చే ఎన్నికలు కావడంతో పవన్ సానుకూల నిర్ణయం కోసం ఆ పార్టీ నిద్రలేని రాత్రులు గడుపుతోంది.
పవన్‌ను వైసీపీ శత్రువుగా చూస్తున్న నేపథ్యంలో జనసేనాని మనసులో ఏముందో అంతుచిక్కడం లేదు. టీడీపీ, జనసేన పరస్పరం విమర్శించుకోని పరిస్థితుల్లో పొత్తు ఉంటుందనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఒకవేళ బీజేపీతోనే పవన్ ప్రయాణమని తేలితే మాత్రం… జనసేనానిపై టీడీపీ తన మీడియాను అడ్డు పెట్టుకుని తప్పకుండా దాడి చేస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే టీడీపీని అధికారానికి దూరం చేయడంలో జనసేనాని పాత్ర కీలకమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.