ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సాహసిస్తున్నారా? అంటే… ఔనని చెప్పక తప్పదు. సాధారణంగా న్యాయ వ్యవస్థతో ఎవరూ ఘర్షణ పెట్టుకోరు. తీర్పులు, ఆదేశాలు, ఘాటు వ్యాఖ్యలు నచ్చకపోయినా… మనసులో కుమిలిపోవడమే తప్ప ధైర్యం చేసి ఎదురు మాట్లాడరు. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధోరణి అందుకు భిన్నమైంది. తన ప్రభుత్వం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా, తీర్పులపై అసెంబ్లీలో చర్చించాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు తీర్పు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ప్రధానంగా శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ జొరబడి, దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసిందని ఏపీ అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు శాసన వ్యవస్థల హక్కులు, బాధ్యతలపై చర్చ జరగాలని ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
న్యాయ వ్యవస్థ తీర్పులపై చర్చ అని పైకి చెబుతున్నప్పటికీ, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఘాటు కామెంట్స్ రీత్యా రచ్చకు దారి తీసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి ఏపీ హైకోర్టు వర్సెస్ ఏపీ ప్రభుత్వం అనే ఘర్షణ వాతావరణం నెలకునే అవకాశం ఉందని ఆందోళన నెలకుంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై చర్చ జరగాలని వైసీపీ నిర్ణయించింది.
మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాసిన లేఖ ఆధారంగా అసెంబ్లీలో హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ రాజధానిని మార్చే, విభజించే అధికారం శాసనసభకు లేదన్న వ్యాఖ్య తనను తీవ్రంగా ఆలోచింపచేస్తోందని ఆయన పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర భద్రత, అభివృద్ధికి అవసరమైన చట్టాలను రూపొందించడం రాజ్యాంగం ద్వారా రాష్ట్ర శాసనసభకు సంక్రమించిన హక్కు అని ఆయన గుర్తు చేశారు. ఈ హక్కును కాదనడం రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధమని భావిస్తున్నట్టు ధర్మాన తెలిపారు. ఇప్పుడు శాసనసభ అధికారాల్లో, బాధ్యతల నిర్వహణలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుందని ఎవరికైనా స్ఫురించకమానదని ఆయన నేరుగానే అనేశారు. ఈ 3 విభాగాల మధ్య రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాల్సిన సంబంధాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాన కోరడం, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేందుకు స్పీకర్ సమాయత్వం కావడం కీలక పరిణామమని భావించొచ్చు.
టీడీపీ ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు తమ ప్రభుత్వానికి ఎందుకు ఉండదని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించడాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా చూడలేదు. ప్రభుత్వ మనోభావాల్ని ఆయన మాటల్లో తెలుసుకోవచ్చు. హైకోర్టు తాజా తీర్పుకే చర్చ పరిమితం కాదు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థపై వైసీపీ ప్రజాప్రతినిధుల విమర్శలు ఎలా వుంటాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
హైకోర్టు తీర్పుపై చర్చకు వైసీపీ మొగ్గు చూపడంతో ఆ పార్టీ మనసులో ఏముందో అర్థమవుతోంది. దీంతో న్యాయ వ్యవస్థ ధోరణిపై చర్చ కాస్త రచ్చకు దారి తీస్తే మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.