వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేయాలని వైసీపీ పెద్దలకు గుర్తుకొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా లక్షలాది మంది వైసీపీ సైన్యం వివిధ రూపాల్లో పని చేసింది. ఆర్థికంగా, హార్థికంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అధికారం వచ్చిన తర్వాత నిరాదరణ ఎదురైంది.
సోషల్ మీడియాలో కనిపించే వాళ్లు, పార్టీ ముఖ్య నేతల్ని ప్రసన్నం చేసుకునే వాళ్లకు మాత్రమే పదవులు దక్కాయనే విమర్శలున్నాయి. పార్టీ కోసం సిన్సియర్‌గా పని చేసిన వాళ్లను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ స్థాయిలో వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత స్థానిక నాయకత్వం నిర్వీర్యం అవుతోందనే ఆవేదన లేకపోలేదు.
గ్రామ స్థాయిలో నాయకులను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ అనుబంధ సంఘాల ఇన్‌చార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారు. విజయసాయిరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరుసగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రానున్న ఎన్నికలకు మరోసారి పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దివంగత వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8న వైసీపీ ప్లీనరీని నిర్వహించేందుకు సీఎం సిద్ధమవుతున్నారని సమాచారం. 2017లో చివరిగా నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్లీనరీని నిర్వహించారు. ఆ తర్వాత ఐదేళ్లకు అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ప్లీనరీ నిర్వహించాలని ఆలోచన రావడం శుభపరిణామంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వ్యంగ్యంగా అంటున్నారు.
జగన్ అధికార మాయలో పడి పార్టీని పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలే కారణమని తెలిసి కూడా, అధికారంలో ఉంటూ ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. రానున్న రెండేళ్లలో వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చితే తప్ప, మరోసారి పార్టీ విజయం కోసం మునుపటిలా పని చేయరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం అనుబంధ సంఘాల నేతలతో సమావేశం అయినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పార్టీలో గూడుకట్టుకున్న అసంతృప్తి పోగొట్టొచ్చని అనుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.