భీషణ ప్రతిజ్ఞకే కట్టుబడ్డ.. అభినవ భీష్ముడు చంద్రబాబు!

భీష్ముడు అంటే ఎవ్వరో తెలియనివాళ్లు మనలో చాలా మంది ఉండరు. మహాభారతాన్ని నడిపించిన మూలపురుషుల్లో ఒకడు. వాళ్ల డాడీ.. ఓ అమ్మాయి మీద మనసు పారేసుకుంటే.. ఆ అమ్మాయిని ఒప్పించడానికి తను ఎంట్రీ ఇచ్చి,…

భీష్ముడు అంటే ఎవ్వరో తెలియనివాళ్లు మనలో చాలా మంది ఉండరు. మహాభారతాన్ని నడిపించిన మూలపురుషుల్లో ఒకడు. వాళ్ల డాడీ.. ఓ అమ్మాయి మీద మనసు పారేసుకుంటే.. ఆ అమ్మాయిని ఒప్పించడానికి తను ఎంట్రీ ఇచ్చి, ఆమెతో ఎగ్రిమెంటు సైన్ చేసి మరీ.. ‘మా నాన్నకు పెళ్లి’ అనే ఎపిసోడ్ నడిపించాడు. ఆ అగ్రిమెంటుకు కట్టుబడి జీవితమంతా పెళ్లి చేసుకోకుండా, రాజ్యాధికారం తీసుకోకుండా ఉండిపోయాడు. 

మహాభారతంలో.. కౌరవపాండవులు అందరికంటె కూడా హీరో- ‘వీరో’యిజం పరంగా గొప్పవాడు అయినప్పటికీ, రాజ్యం మీద, పదవి మీద ఆశలేకుండా బతికాడు. చచ్చేదాకా ఆ ఎగ్రిమెంట్ కు కట్టుబడి ఉన్నాడు గనుక.. ఆయన పట్టుదల పట్ల గౌరవంగా.. భీష్మప్రతిజ్ఞ అని పెద్దలు అంటూ ఉంటారు.

మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అలాంటి భీష్మ ప్రతిజ్ఞ ఒకటి చేశారు. గత నవంబరులో శాసనసభలో జరిగిన పరిణామాలు.. మనకు గుర్తున్నట్లయితే ఆ ప్రతిజ్ఞ కూడా గుర్తుకొస్తుంది. కానీ మన అభినవ భీష్ముడు- రాజ్యాధికారాన్ని త్యాగం చేయడం కాదు.. రాజ్యాధికారం కోసం ప్రతిజ్ఞచేశాడు. ఏపీ ప్రజలు తనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప.. ఈ అసెంబ్లీలో అడుగుపెట్టను అని చాలా బీభత్సంగా ప్రకటించేసి.. ఆయన ఎంచక్కా సభలోంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ఏడవడం ఇదంతా కూడా ఆ ఎపిసోడ్ ఎండ్ లో రోలింగ్ టైటిల్స్ మీద వచ్చే సీన్స్ మాత్రమే. 

అలాంటి చంద్రబాబునాయుడు.. ఇప్పుడు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొత్త భీష్ముడు చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ గురించి కూడా పాపం చర్చ జరిగింది. ఆ రోజున చంద్రబాబు ప్రతిజ్ఞ చేసినప్పుడు.. ఆయన వెంట మూకుమ్మడిగా బయటకు వచ్చేసిన ఆ పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, హమ్మయ్య ఇక సభకు వెళ్లి బాబు స్క్రిప్టు ప్రకారం పసలేని గోల చేయాల్సిన అవసరం లేదులెమ్మని సంబరపడ్డారు. 

బాబుకు మద్దతుగా తామంతా కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టుగా అప్పట్లో ప్రకటించారు. సభలో వారు చేసే అల్లరితో విసుగెత్తి పోయి ఉన్న ప్రజలు మాత్రం.. వారి బహిష్కరణ నిర్ణయంతో చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతుండగా.. తెదేపా ఓ మెట్టు దిగినట్టుంది. 

చంద్రబాబునాయుడు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సభకు హాజరవుతారట. అంటే చంద్రబాబునాయుడు మాత్రం.. తన భీషణ ప్రతిజ్ఞను కాపాడుకుంటారన్నమాట. తనను రాష్ట్ర ప్రజలు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అలా అసెంబ్లీ గేటు బయట వేళ్లాడుతూ కూర్చుంటారన్నమాట! ప్రజలు తనకు ప్రతిపక్షనేతగా ఒక బాధ్యత అప్పగిస్తే.. దానిని నెరవేర్చకుండా పలాయనం చిత్తగించిన ఈ పిరికి, భయస్తుడైన చంద్రబాబు.. ప్రతిజ్ఞల ముసుగు వేసుకుని సభకు వెళ్లకపోవడం సిగ్గు చేటు అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.