అన్న ఎన్టీఆర్ బాటలో కేసీఆర్ గళమెత్తుతారా?

తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్నస్థాయి రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతోంది. 7వ తేదీనుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించడం కొత్త వివాదంగా రూపుదిద్దుకుంటోంది. గవర్నర్…

తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్నస్థాయి రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతోంది. 7వ తేదీనుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించడం కొత్త వివాదంగా రూపుదిద్దుకుంటోంది. గవర్నర్ తమిళిసై ఈ విషయంలో తన అసంతృప్తిని దాచుకోకుండా ప్రకటన చేశారు. మొత్తానికి గవర్నరుకు, ముఖ్యమంత్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే వాతావరణం ఏర్పడుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో.. గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దే ఆలోచనతో పిలుపు ఇచ్చిన తీవ్రమైన డిమాండ్ నే ఇప్పుడు కేసీఆర్ కూడా వినిపించబోతున్నారా? అందుకోసం ఉద్యమిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది.ఈ దేశంలో అసలు గవర్నరు వ్యవస్థ అవసరమే లేదని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు, తమిళిసైతో ఏర్పడిన విభేదాలు, బీజేపీపై సంకల్పిస్తున్న దండయాత్ర నేపథ్యంలో కేసీఆర్ తన ఆరాధ్యనాయకుడు ఎన్టీఆర్ డిమాండ్ ను మళ్లీ వినిపిస్తారనే చర్చ జరుగుతోంది.

బడ్జెట్ సమావేశాల్లో గవర్నరు ప్రసంగం లేకుండా ప్రారంభించడం ప్రభుత్వ నిర్ణయం. ఇది ఒక రకంగా గవర్నరు తమిళిసైకు అవమానమే. అయితే ఈ విషయంలో గవర్నరు– ప్రభుత్వ వర్గాలు సాంకేతిక అంశాలను పట్టుకుని వాదనలు వినిపిస్తూ.. తమ మధ్య ముదిరిన విభేదాలను బయటపెట్టుకుంటున్నారు. 

గత సమావేశాలు ముగిసిన తర్వాత.. శాసనసభ ప్రొరోగ్ కావడమే జరగలేదని.. కనుక ఇవి కొత్త సమావేశాల కిందికి రావని, వాటికి కొనసాగింపు మాత్రమే అవుతాయని అందువలన గవర్నరు ప్రసంగం అవసరం లేనేలేదనేది ప్రభుత్వ వాదన. 

దీనిపై తమిళిసై అలిగారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లును తన ఆమోదం కోసం పంపినప్పుడు తన ప్రసంగం ఉంటుందని అన్నారని తర్వాత లేదని చెప్పారని ఆమె అన్నారు. మొత్తానికి గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి ప్రయత్నించి, ఆమె తిరస్కరించడంతో భంగపడిన కేసీఆర్ ఆమె ప్రాధాన్యానికే చెక్ పెట్టదలచుకున్నట్టుగా కనిపిస్తోంది. 

అసలే బీజేపీ మీద, వారి నిర్ణయాల మీద రాష్ట్రప్రభుత్వాల పనిలో కేంద్రం పరోక్షంగా జోక్యం చేసుకోవడానికి చేస్తున్న కుట్రల మీద పెద్ద ఉద్యమమే ప్రారంభించాలని అనుకుంటున్న కేసీఆర్.. అదే క్రమంలో భాగంగా తెలంగాణ గవర్నరుతో కూడా సున్నం పెట్టుకుంటున్నారా? అనేది పరిశీలకుల భావన.

కేసీఆర్ ఎంతో ఇష్టపడే నాయకుడు ఎన్ టి రామారావు, అప్పట్లో గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేసేయాలని చాలా గట్టిగా పట్టుబట్టారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న తగాదాల నేపథ్యంలో ఎన్టీఆర్ తన ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు ఏ చిన్న చాన్స్ వచ్చినా, బీజేపీతో లడాయి పెట్టుకోడానికి ఉత్సాహపడుతున్న కేసీఆర్.. ఎన్టీఆర్ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది.