కర్నాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కమంగళూరు రైల్వేట్రాక్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
జేడీఎస్ నుంచి ఎమ్మెల్సీగా ధర్మగౌడ ఎన్నికయ్యారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి కారులో ఒంటరిగా ఆయన బయటి కెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ధర్మగౌడ కోసం రాత్రంతా పోలీసులు గాలించారు. చివరికి చిక్కమంగళూరు వద్ద రైల్వేట్రాక్ పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కర్నాటక శాసన మండలిలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలే ఆయన్ను కలచి వేశాయంటున్నారు. కాంగ్రెస్ సభ్యుడైన మండలి చైర్మన్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చ సందర్భంగా సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.
ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడను కాంగ్రెస్ సభ్యులు కిందికి తోసేశారు. బహుశా ఆయన మృతికి మండలి అవాంఛనీయ ఘటన కూడా కారణమై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమ పార్టీ నేత, డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ ఆత్మహత్యపై మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తనను కలచివేసిందని ఆయన చెప్పుకొచ్చారు. జేడీఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.