టాలీవుడ్ కు మరో షాక్. హీరో రామ్ చరణ్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించాడు.
“నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాల్లేవు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాను. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకం ఉంది. దీన్నుంచి బయటపడతాను.”
ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించాడు. ఈమధ్య ఆచార్య సెట్స్ ను సందర్శించాడు రామ్ చరణ్. ఆచార్యలో తన పార్ట్ షూటింగ్ కు సంబంధించి కాల్షీట్లు కూడా కేటాయించాడు. అంతలోనే ఇలా కరోనా బారిన పడ్డాడు.
రామ్ చరణ్ కు ఎక్కడ, ఎలా కరోనా సోకిందనే విషయం ప్రస్తుతం మిస్టరీగా మారింది. ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆచార్యలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు.
కొన్ని రోజుల కిందట చిరంజీవి కూడా తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే తనకు కరోనా లేదని, తప్పుడు కిట్ వల్ల రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిందని ప్రకటించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు చరణ్ కరోనా బారినపడ్డం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా మొదలైనప్పట్నుంచి తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గతంలోనే వెల్లడించాడు రామ్ చరణ్. బయటకెళ్లి వచ్చిన ప్రతిసారి సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతున్నానని, భార్య ఉపాసనతో కలిసి భోజనం కూడా చేయడం లేదని వెల్లడించాడు. అలా చాన్నాళ్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్న చెర్రీ, ఇప్పుడిలా సడెన్ గా కరోనా బారిన పడడం బాధాకరం.