రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే…వారు చరిత్ర హీనులే…?

రాజధాని అన్నది పాలనాపరమైన వెసులుబాటుకు సంబంధించిన అంశం. అది ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్రానికే హక్కు ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక మూడు రాజధానులే తమ అజెండా అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన…

రాజధాని అన్నది పాలనాపరమైన వెసులుబాటుకు సంబంధించిన అంశం. అది ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్రానికే హక్కు ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక మూడు రాజధానులే తమ అజెండా అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అంటున్నారు. ఈ విషయం నుంచి తాము ఏ మాత్రం పక్కకు జరిగే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చారు.

మూడు రాజధానులను టీడీపీ సహా కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని, వెనకబడిన ప్రాంతాలకు, ప్రజలకు ద్రోహం చేసిన పార్టీలు చరిత్రహీనులు గానే మిగులుతాయని ఆయన విమర్శించారు.ఇక పాలనా సౌలభ్యం బట్టి రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా ధర్మాన చెప్పుకొచ్చారు.

పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటే దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో కృంగిపోయిన ఉత్తరాంధ్రాకు మంచి రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక రాజధాని అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించినది కానే కాదని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా మూడు రాజధానుల విషయంలో తాము ముందుకు అడుగులు వేశామని చెప్పుకున్నారు.ఇక అమరావతి రాజధాని అంశం మీద హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద న్యాయ నిపుణులతో సంప్రదించి వారి సూచన‌లు, సలహాల మేరకే భవిష్యత్తు కార్యాచర‌ణను చేపడతామని ధర్మాన చెప్పారు. 

మొత్తానికి వెనకబడిన ప్రాంతాల ఆభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయని ధర్మంగా ధర్మాన చెప్పారు. మరి దీని మీద జనాలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే కచ్చితంగా టీడీపీ సహా ఇతర పార్టీలకు ఉంటుంది అంటున్నారు.