పవన్ కళ్యాణ్ లో ఒక విశేషముంది. అది అన్నయ్య చిరంజీవిలో లేనిది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో కొనసాగినంత కాలం సినిమాలను పక్కకు పెట్టాడు. అయినప్పటికీ ఆయన అనుకున్నది నెరవేరకపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. కానీ పవన్ అలా కాదు. అన్నయ్య మాదిరిగా సినిమాలను పూర్తిగా వదిలేస్తే అటు రాజకీయాల్లో క్లిక్ కాక, ఇటు సినిమాల్లో మార్కెట్ తగ్గిపోయి ఎటూ కాకుండా పోతాననుకున్నాడేమో రాజకీయాల్లో ఉన్నా సినిమాలను మాత్రం వదులుకోలేదు.
ఇంకా చెప్పాలంటే సినిమాలనే సీరియస్ గా తీసుకుంటున్నాడు. రాజకీయాలను ఇప్పటికీ పార్టీ టైం వ్యాపకంగానే చూస్తున్నాడు. ఇదివరకు సినిమాలను పూర్తిగా వదిలేస్తానని రాజకీయాలకే అంటే ప్రజాసేవకే పూర్తిగా అంకితం అవుతానని అన్నాడు. కానీ క్రమంగా సినిమాల్లో బిజీ అవుతున్నాడు. పవన్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడంలేదని కోపం వచ్చి, అలిగి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. పవన్ వైఖరిని నిరసిస్తూ మరి కొందరు కూడా పార్టీని వీడారు.
ఇక పవన్ అభిమానులు/జనసేన కార్యకర్తలు ఆయన్ని ఇప్పటికీ సినిమా హీరోగానే చూస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినా సినిమాల్లో నటించడానికి పవన్ కారణం చెబుతూ రాజకీయ పార్టీని నడపాలంటే డబ్బు కావాలి కాబట్టి సినిమాల్లో నటిస్తున్నానని అన్నాడు. ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా తనకు వ్యాపారాలు, కంపెనీలు లేవని, తనకు తెలిసింది నటించడం ఒక్కటేనని, అందుకే ఆ పని చేస్తున్నానని చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే మెగాస్టార్ కంటే పవర్ స్టార్ కు కరడుగట్టిన అభిమానులున్నారు.
అతనితో సినిమా తీయడానికి ఇప్పటికీ నిర్మాతలు, దర్శకులు పోటీలు పడుతున్నారు. పారితోషికం కూడా బాగానే ముట్టజెబుతున్నారు. సాధారణంగా సినిమా హీరో, హీరోయిన్స్ పారితోషికాలు కరెక్టుగా ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పలేరు కూడా. బయటకు తెలిసే ఫిగర్స్ కూడా ఊహాగానాలే. కొన్నికరెక్టుగా ఉండొచ్చు. చెప్పలేం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? 'వకీల్ సాబ్' కోసం 'దిల్' రాజు దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలు ఇచ్చారని ఇండస్ట్రీ గుసగుస. 'భీమ్లా నాయక్'కు ఎంత ఇచ్చారనేది ఇంకా బయటకు రాలేదు.
కానీ, బాగానే ఇచ్చినట్టు భోగట్టా. పవన్ తరువాతి సినిమాకు 'వకీల్ సాబ్' కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయ్యాక పవన్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతోంది. తమిళ హిట్ 'వినోదయ సితమ్'ను పవన్ రీమేక్ చేయబోతున్నారు. అందులో ఆయనతో పాటు మేనల్లుడు సాయి తేజ్ కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాకు పవన్ కల్యాణ్ 20 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుందని సమాచారం.
ఆ 20 రోజులకు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అన్నారట. అంటే… రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు అన్నమాట. అది కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు రూ. 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని మరో టాక్.
పార్టీని నడపాలంటే డబ్బు కావాలి కాబట్టి సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్, భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవర్ స్టార్ పార్టీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలియడంలేదు. ఎందుకంటే జనసేన ఇప్పటికీ నత్త నడక నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి అప్పటివరకు మస్తు సినిమాలు చేసి ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేస్తాడేమో.