మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా.. ఇది చదవండి!

ఇంట్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓవైపు పోర్న్ కంటెంట్ విజృంభిస్తుంటే, మరోవైపు ఆన్ లైన్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. ఇలానే ఏమాత్రం అవగాహన లేకుండా తన కూతురుకు…

ఇంట్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓవైపు పోర్న్ కంటెంట్ విజృంభిస్తుంటే, మరోవైపు ఆన్ లైన్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. ఇలానే ఏమాత్రం అవగాహన లేకుండా తన కూతురుకు ఫోన్ ఇచ్చిన తల్లి, నిలువునా మోసపోయింది. ఏకంగా 33 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

హైదరాబాద్ కు చెందిన వెంకాయమ్మ  అనే మహిళ తన కూతురుకు ఫోన్ ఇచ్చింది. ఆన్ లైన్ సైట్ నుంచి ఆ పాప 99 రూపాయల ఖరీదైన ఇయర్ ఫోన్ ఆర్డర్ చేసుకుంది. కొద్దిసేపటికే ఆ ఫోన్ కు కాల్ వచ్చింది. ఓ స్పోర్ట్స్ మోడల్ కారు గిఫ్ట్ గా వచ్చిందని కాల్ చేశారు. అమ్మాయి ఆ మాయమాటలు నమ్మింది. కేటుగాళ్లు చెప్పినట్టే చేసింది. అంతే.. ఎకౌంట్ నుంచి 16 లక్షలు మాయమయ్యాయి.

వెంటనే మరోసారి కేటుగాళ్లు ఫోన్ చేశారు. ఈసారి బెదిరింపులకు దిగారు. మరికొంత డబ్బు ఇస్తే, ఇప్పుడు ఎకౌంట్ నుంచి దొంగిలించిన మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తామని బెదిరించారు. దీంతో మరోసారి వాళ్లు చెప్పినట్టే చేసింది అమ్మాయి. ఈసారి ఏకంగా 17 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.

సర్వం కోల్పోయానని గ్రహించిన అమ్మాయి, తన తల్లి వెంకాయమ్మకు విషయం చెప్పకుండా దాచింది. ఏదో అవసరం కోసం బ్యాంక్ కు వెళ్లిన వెంకాయమ్మ, ఎకౌంట్ లో డబ్బులు లేవని తెలుసుకొని కూతుర్ని నిలదీసింది. అప్పుడు జరిగిన విషయం తెలుసుకుంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది.

తమ నెట్ వర్క్ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ దోపిడీకి పాల్పడిన వ్యక్తి బిహార్ కు చెందిన రాజేష్ కుమార్ మహ అని గుర్తించారు. పక్కాగా వల పన్ని అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 33 లక్షల రూపాయలు సీజ్ చేశారు. అంతేకాదు, 23 సైబర్ క్రైమ్స్ తో ఇతడికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

వెంకాయమ్మ అదృష్టం బాగుంది కాబట్టి డబ్బులు తిరిగొచ్చాయి. ఆన్ లైన్ మోసాల్లో తిరిగి డబ్బులు పొందిన వాళ్లు చాలా తక్కువ. విదేశీ కేటుగాళ్ల బారిన పడితే ఇక అంతే సంగతులు. అందుకే ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ యాప్స్ కు పాస్ వర్డ్ పెట్టుకోవాలి. దాన్ని ఎవ్వరితో షేర్ చేయకూడదు.