బంగారం స్మగ్లింగ్.. ఇదో కొత్త రకం ఎత్తుగడ

పొట్టలో బంగారం దాచుకొని స్మగ్లింగ్ చేసినోళ్లను చూశాం. షూ కింద బంగారం పెట్టి స్మగ్లింగ్ చేసిన ఘటనలు చూశాం. బంగారాన్ని కరిగింది కస్టమ్స్ కళ్లుగప్పే ఉదంతాలు కూడా చూశాం. వీటి తరహాలోనే ఇది మరో…

పొట్టలో బంగారం దాచుకొని స్మగ్లింగ్ చేసినోళ్లను చూశాం. షూ కింద బంగారం పెట్టి స్మగ్లింగ్ చేసిన ఘటనలు చూశాం. బంగారాన్ని కరిగింది కస్టమ్స్ కళ్లుగప్పే ఉదంతాలు కూడా చూశాం. వీటి తరహాలోనే ఇది మరో ఎత్తుగడ. బంగారం స్మగ్లింగ్ కోసం ఓ వ్యక్తి మరో పద్ధతిని అనుసరించాడు. కానీ దొరికిపోయాడు.

సౌదీ అరేబియా నుంచి విమానంలో చెన్నై వచ్చిన వ్యక్తి నేరుగా బయటకెళ్లేందుకు ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడ్ని ఆపారు. అతడి లగేజీ మొత్తం చెక్ చేశారు. ఏం దొరకలేదు. ఒళ్లంతా వెదికారు. అక్కడ కూడా ఏం దొరకలేదు. చివరికి షూ విప్పి కూడా చెక్ చేశారు. అయినా ప్రయోజనం లేదు.

తను ఎలాంటి వస్తువులు స్మగ్లింగ్ చేయడం లేదని బుకాయించాడు ఆ వ్యక్తి. కానీ అతడి వ్యవహారశైలి మాత్రం అధికారులకు అనుమానాస్పదంగా అనిపించింది. ఇంతలో ఎక్సైజ్ అధికారుల్లో ఒకరికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అటుఇటు నడవమని ఆదేశించారు. సరిగ్గా ఇక్కడే దొరికిపోయాడు స్మగ్లర్.

బంగారాన్ని ఏకంగా తన అరికాళ్లకు అతికించుకున్నాడు ఈ వ్యక్తి. బంగారాన్ని కరిగించి, పల్చటి ముద్దగా చేసి రెండు అరికాళ్లకు, బలమైన గమ్ తో అతికించుకున్నాడు. దానిపై షూ వేసుకొని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నడకలో తేడాను గమనించి చెక్ చేస్తే, అరికాళ్ల కింద ఉన్న బంగారం కనిపించింది.

ఏకంగా 240 గ్రాముల బంగారాన్ని ఇలా ముద్దుగా చేసి, అరికాళ్ల కింద అతికించి స్మగ్లింగ్ చేయబోయాడు ఆ వ్యక్తి. దీని విలువ దేశీయ మార్కెట్లో 12 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది.